లెహర్ తుపానుతో అప్రమత్తంగా ఉండాలి | Cyclone Lehar landfall expected on November 28 | Sakshi
Sakshi News home page

లెహర్ తుపానుతో అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Nov 26 2013 3:07 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Cyclone Lehar landfall expected on November 28

 గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఈనెల 28న  మచిలీపట్నం-కాకినాడ సమీపంలో తుపాను తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆర్డీవోలు, తహశీల్దారులు, ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. లెహర్ తుపానుప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని సూచనలు జారీ చేయాలని, తుపాను సమయంలో రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల తుది జాబితా ప్రకటన జనవరి 16 తేదీలోపు చేయాలిన నేపథ్యంలో ఓటర్ల నమోదు, అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జె.సి వివేక్ యాదవ్, ఆర్డీవో కె.నాగబాబు, జిల్లా పరిషత్ సీఈవో సత్యన్నారాయణ తదితరులు ఉన్నారు.
 
 నిత్యావసరాలు సిద్ధం చేసుకోండి..
 లెహర్ తుపాను కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలింపునకు విస్తృత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పి.కె మహంతి జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కోస్తా జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసుకోవాలని, కిరోసిన్, నిత్యావసర సరుకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిల్వ లేకుంటే తక్షణమే కావలసిన సరుకుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. దీనిపై  కలెక్టర్ ఎస్.సురేష్‌కుమార్ మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో జిల్లా అంతటా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో అర్బన్, రూరల్ ఎస్పీలు జెట్టి గోపీనాథ్, జె.సత్యన్నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 మెరుగైన ‘మీ సేవ’లకు చర్యలు
 జిల్లాలోని మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురే శ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. డీఆర్‌సీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఈ-గవర్నెన్స్ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీసేవ ద్వారా సేవలందిస్తున్న 21 శాఖల జిల్లా అధికారులను కూడా సభ్యులుగా చేర్చాలన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ స్థాయిలో కూడా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మీసేవలు అందుతున్న తీరుపై తహశీల్దార్లు, ఆర్డీవోలు ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోఅదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డిఆర్వో కె.నాగబాబు, మీసేవ డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement