భయం గుప్పెట్లో ‘పశ్చిమ’
Published Thu, Nov 28 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
సాక్షి, ఏలూరు :ఎండ మండించింది.. కడలి నిశ్శబ్దంగా ఉంది.. గాలి కూడా నిశ్చలమే.. ఒకానొక దశలో సన్నటి చినుకులు కురిశారుు.. జిల్లాలో బుధవారం కనిపించిన వాతావరణం ఇది. లెహర్ పెను తుపానుగా మారి ‘పశ్చిమ’ను అతలాకుతలం చేయనుం దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంటే.. బుధవారం రాత్రి వరకూ ఆ పరిస్థితులేవీ కనిపించలేదు. కానీ.. జనం గుండెల్లో మాత్రం గుబులు మొదలైంది. నిశ్శబ్దం తరువాత వచ్చే తుపాను ఎంత భయంకరంగా ఉంటుందోననే భయంతో ప్రాణా లను అరచేత పట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరుస తుపాన్లు చూసిన జిల్లా ప్రజలు లెహర్ హెచ్చరికలను తొలుత అంత తీవ్రంగా పరిగణించలేదు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సహకరించలేదు. కానీ.. బుధవారం సాయంత్రానికి పరిస్థితి చూసిన జనం లెహర్ తీవ్రతను తలచుకోవడానికే వణికిపోతున్నారు.
64 గ్రామాల్లో భయం.. భయం
లెహర్ తుపాను ఏ క్షణాన తీరంపై విరుచుకుపడుతుందోనని జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తుపాను తొలుత కాకినాడలో తీరం దాటుతుందని భావించినప్పటికీ.. దిశ మార్చుకుని.. మధ్యాహ్నం 2.30 గంటలకు సూపర్ సైక్లోన్ స్థాయి నుంచి తీవ్రత తగ్గించుకుంటూ సైక్లోన్‌గా మారి మచిలీపట్నం వైపు పయనిస్తుండటంతో ప్రజల్లో భయం అధికమైంది. కొద్దిరోజుల క్రితం జిల్లాను కుదిపేసిన హెలెన్ తుపాను మచిలీపట్నంలోనే తీరం దాటింది. ఆ సమయంలో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మచిలీపట్నం-కళింగపట్నం/నెల్లూరు మధ్య గురువారం ఉదయం 90 నుంచి 100 కి.మీ. వేగాన్ని పుంజుకుని సాయంత్రానికి 55 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే జిల్లా అధికారులు మాత్రం తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని ఆచంట, మొగల్తూరు, కాళ్ల, ఆకివీడు, యలమంచిలి, పోడూరు, భీమవరం, నరసాపురం, పాలకోడేరు, వీరవాసరం, పెరవలి, పెనుగొండ, పెనుమంట్ర, ఉండ్రాజవరం, తణుకు మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయూ మండలాల్లోని 64 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎదుర్కోవడానికి
అంతా సిద్ధం
తుపాను నేపథ్యంలో తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, విపత్తును ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. 500 మంది సైనికులను రప్పిస్తున్నామని, నాలుగు జాతీయ విపత్తు నివారణ (ఎన్‌ఆర్‌డీఎఫ్) బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని తెలిపారు.
అత్యవసరంగా రంగంలోకి దిగేందుకు విశాఖలో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే 123 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 22వేల మంది ప్రజలను 35 మినీ బస్సులు, 24 ట్రాక్టర్లు, 24 టాటా మేజిక్ ఆటోలు, 32 ఆటోల్లో పోలీసుల సాయంతో బలవంతగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ 44 పునరావాస కేంద్రాలకు 5,713 మందిని తరలించారు. ఇక్కడ 240 మంది వైద్య సిబ్బందితో 46 వైద్య బృందాలు సేవలందిస్తున్నాయి. గర్భిణులను 108 వాహనాల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గాలుల తీవ్రత వల్ల సమాచార వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటంతో 30 వైర్‌లెస్ సెట్లను సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా రిజర్వాయర్లలో నీరు నింపుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. 278 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా చేశారు. మొగల్తూరు, నరసాపురం మండలాల పరిధిలో 112 బోట్లకు లంగరు వేయించి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా నిలిపివేశారు. 8 మండలాల్లో 130 మంది అగ్నిమాపక సిబ్బంది, 9 ఫైర్ ఇంజిన్లు ఆధునిక రంపపు యంత్రాలు, కట్టర్లను సిద్ధంగా ఉంచారు.
తీర ప్రాంతాలకు తహసిల్దార్లు
పునరావాస కేంద్రాలను నిర్వహించేందుకు నరసాపురం మండలం తూర్పు వేములదీవి గ్రామానికి ముగ్గురు తహసిల్దార్లను వెస్ట్ వేములదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక, బియ్యపు తిప్ప, చినమైనవానిలంక, గంగసల మెరక గ్రామాలకు ఐదుగురు తహసిల్దార్లు, మొగల్తూరు మండలానికి ముగ్గురు తహసిల్దార్లతో కూడిన బృందాలను పంపించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు.
మేలుకున్న విద్యుత్ శాఖ
హెలెన్ తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని లెహర్ తుపానును ఎదుర్కోవడానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లాకు ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సింహాద్రిని ప్రత్యేకాధికారిగా సంస్థ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు నియమించారు. డీఈ స్థాయి అధికారి పర్యవేక్షణలో సాంకేతిక బృందాన్ని సన్నద్ధం చేశారు. 11 సబ్‌స్టేషన్లలోని దాదాపు 50 ఫీడర్ల పరిధిలో లెహర్ ప్రతాపం చూపనుంది. తీరానికి సమీపంలో ఉన్న ఎనిమిది సెక్షన్లలో విద్యుత్ స్తంభాలు పడిపోతే పునరుద్ధరించడానికి 300 మందిని, పడిపోరుున చెట్లను తొలగించేందుకు తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం నుంచి ఉత్తరాంద్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం నుంచి ప్రత్యేకాధికారులు, సిబ్బంది, కార్మికులను రప్పిస్తున్నారు. జిల్లా యంత్రాగంతో పాటు దాదాపు వెరుు్య మందిని సిద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ తెలిపారు. ప్రతి మండలానికి రెండేసి పొక్లెయిన్లు, విద్యుత్ రంపాలను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement