=కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
=అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, రెండు మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడవచ్చని చెప్పారు. గుడిసెలు, పెంకుటిళ్లు, నానిన గోడలతో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలో నివసించేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ లేదా స్కూల్ బస్సులను వాడాలని కోరారు. నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో వీఆర్వోలు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
స్థానికంగా ఉండే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో చర్చించి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో హాస్టల్‌లో పిల్లల రక్షణ ఏర్పాట్లు, భోజన, మంచినీటి ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. శారద, వరాహ, తాండవ రిజర్వాయర్ల పరిసరాల లోతట్టు గ్రామాల ప్రజలను అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తవతియా, డీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లెహర్‌పై అప్రమత్తం
Published Tue, Nov 26 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement