తరుముకొస్తున్న లెహర్
భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
సాక్షి, మచిలీపట్నం : బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తీరం వైపు దూసుకొస్తున్న లెహర్ పెను తుపానేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తుపాను మచిలీపట్నానికి 1200 కిలోమీటర్లు, కాకినాడకు 1140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతవరణ శాఖ ప్రకటించింది. ఇది మచిలీపట్నం-కళింగపట్నం రేవుల మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ నెల 27 నుంచే వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దాటిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, తాటాకు ఇళ్లు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
యంత్రాంగం అప్రమత్తం
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే హెలెన్ తుపాను కోసం నియమించిన మండల స్థాయి ప్రత్యేక అధికారులను లెహర్‌కూ కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తుపాను, వరద ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 26 నుంచి అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సోమవారం ఆదేశించారు. మండల స్థాయిలోని అధికారులు తమ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి ఈ నెల 26 ఉదయం పది గంటలకు ఆఫీసుల్లోని ల్యాండ్ లైన్ల నుంచి తనకు ఫోన్లు చేయాలని ఆమె ఆదేశించారు.
సోమవారం మచిలీపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లాలోని ప్రత్యేక అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర పెను తుపానుగా వచ్చే లెహర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మహంతి హెచ్చరించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రఘునందనరావు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒక రోజు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆహారం, మంచినీళ్లు వంటి వాటిని సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.
పెను తుపానే..
Published Tue, Nov 26 2013 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement