P. Usha Kumari
-
ధాన్యం కొనుగోలుకు 93 కేంద్రాలు
=ఐకేపీ మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో 42 =పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 51 =జేసీ ఉషాకుమారి వెల్లడి కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా, దళారుల బారినపడకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇందిరా క్రాంతిపథం మహిళా గ్రూపుల నిర్వహణలో 42 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణలో 51 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి వాటి పరిధిలో ఉన్న రైస్‌మిల్లులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి కేటాయించిన బిల్లులకు రవాణా అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్రాల పర్యవేక్షకులుగా పౌరసరఫరాల డీటీలను నియమించినట్లు చెప్పారు. -
పెను తుపానే..
తరుముకొస్తున్న లెహర్ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి, మచిలీపట్నం : బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తీరం వైపు దూసుకొస్తున్న లెహర్ పెను తుపానేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తుపాను మచిలీపట్నానికి 1200 కిలోమీటర్లు, కాకినాడకు 1140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతవరణ శాఖ ప్రకటించింది. ఇది మచిలీపట్నం-కళింగపట్నం రేవుల మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ నెల 27 నుంచే వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దాటిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, తాటాకు ఇళ్లు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యంత్రాంగం అప్రమత్తం ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే హెలెన్ తుపాను కోసం నియమించిన మండల స్థాయి ప్రత్యేక అధికారులను లెహర్కూ కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తుపాను, వరద ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 26 నుంచి అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సోమవారం ఆదేశించారు. మండల స్థాయిలోని అధికారులు తమ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి ఈ నెల 26 ఉదయం పది గంటలకు ఆఫీసుల్లోని ల్యాండ్ లైన్ల నుంచి తనకు ఫోన్లు చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లాలోని ప్రత్యేక అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర పెను తుపానుగా వచ్చే లెహర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మహంతి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రఘునందనరావు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒక రోజు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆహారం, మంచినీళ్లు వంటి వాటిని సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. -
దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీతో పాటు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర సమ్మెలో లేని జిల్లా అధికారులు అందరూ విజయవాడ దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా రెవెన్యూ, ఇతర సిబ్బంది అందుబాటులో లేనందున జిల్లా అధికారులందరూ బాధ్యత వహించాలన్నారు. శాఖల వారీగా సమ్మెలో పాల్గొనని సిబ్బంది పేరుతో నివేదికలను కలెక్టర్‌కు నిత్యం సమర్పించాలని కోరారు. విజయవాడలో మంగళవారం జరిగే సమావేశంలో అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తారని తెలిపారు. ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు సంబంధిత సిబ్బంది సెలవులు పెట్టొద్దని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, డీఎస్వో పి.బి.సంధ్యారాణి, డీఈవో దేవానందరెడ్డి, మత్స్యశాఖ డీడీ కల్యాణం, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, డీపీవో కె.ఆనంద్, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, డీసీహెచ్ఎస్ రంగరాజారావు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. అర్జీల వివరాలు ఇవీ.. తనను మానసికంగా హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన కె.కవితారెడ్డి జేసీకి అర్జీ దాఖలు చేశారు. తన భర్త మహాలక్ష్ముడు ఆర్మీలో పనిచేసి రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారని, ఆయన 2011 ఏప్రిల్ ఒకటో తేదీన మరణించారని, ప్రభుత్వం నుంచి భూమి కేటాయించలేదని కలిదిండి మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తిన శాంతమ్మ జేసీకి దరఖాస్తు చేసుకున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరులో ఐదెకరాల భూమి కేటాయించాలని కోరారు. తన పొలానికి సాగునీరు అందించే పంట బోదెను అనధికారికంగా పూడ్చివేశారని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నంలోని బందరుకోటకు చెందిన బి.కృష్ణమూర్తి జేసీకి అర్జీ ఇచ్చారు. తమకు ఇళ్లస్థలాలు ఇప్పించాలని కోరుతూ మచిలీపట్నం మైనార్టీ అసోసియేషన్‌కు చెందిన అబ్దుల్అలీమ్, సుల్తానాబేగం, మెహరున్నీసా, ఫాతిమాబేగం తదితరులు దరకాస్తుచేసుకున్నారు. తమ గ్రామంలో శ్మశానభూమి ఆక్రమణకు గురైందని, విచారణ నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని తిరువూరు మండలం, ఎర్రమాడు గ్రామానికి చెందిన వేము రవిబాబు ఫిర్యాదుచేశారు. తన ఇంటి స్థలం మధ్య నుంచి విద్యుత్ అధికారులు కొత్తగా లైను వేస్తున్నారని, ఆ పనులను నిలిపివేయాలని కోరుతూ గుడివాడ మండలం నాగవరప్పాడు కాలనీకి చెందిన డి.వి.ప్రభాకరరావు అర్జీదాఖలు చేశారు. తమకు కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ పెడన మండలం లంకలకలవగుంట గ్రామానికి చెందిన జె.ప్రసాద్, ముసలయ్య అర్జీదాఖలు చేశారు. జిల్లాలోని రజక వృత్తిదారులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, రజక వృత్తిపై ఆధారపడే రజకుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం జాయింట్ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. జిల్లాలోని మత్స్యకారుల జీవన పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి వనమాడి సుబ్బారావు జేసీకి అర్జీ ఇచ్చారు.