కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీతో పాటు ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎల్.విజయచందర్ తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర సమ్మెలో లేని జిల్లా అధికారులు అందరూ విజయవాడ దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా రెవెన్యూ, ఇతర సిబ్బంది అందుబాటులో లేనందున జిల్లా అధికారులందరూ బాధ్యత వహించాలన్నారు. శాఖల వారీగా సమ్మెలో పాల్గొనని సిబ్బంది పేరుతో నివేదికలను కలెక్టర్‌కు నిత్యం సమర్పించాలని కోరారు. విజయవాడలో మంగళవారం జరిగే సమావేశంలో అధికారులు, సిబ్బందికి విధులు కేటాయిస్తారని తెలిపారు.
ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు సంబంధిత సిబ్బంది సెలవులు పెట్టొద్దని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, డీఎస్‌వో పి.బి.సంధ్యారాణి, డీఈవో దేవానందరెడ్డి, మత్స్యశాఖ డీడీ కల్యాణం, బీసీ సంక్షేమశాఖ డీడీ చినబాబు, డీపీవో కె.ఆనంద్, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, డీసీహెచ్‌ఎస్ రంగరాజారావు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
అర్జీల వివరాలు ఇవీ..
తనను మానసికంగా హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన కె.కవితారెడ్డి జేసీకి అర్జీ దాఖలు చేశారు.
తన భర్త మహాలక్ష్ముడు ఆర్మీలో పనిచేసి రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారని, ఆయన 2011 ఏప్రిల్ ఒకటో తేదీన మరణించారని, ప్రభుత్వం నుంచి భూమి కేటాయించలేదని కలిదిండి మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తిన శాంతమ్మ జేసీకి దరఖాస్తు చేసుకున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరులో ఐదెకరాల భూమి కేటాయించాలని కోరారు.
తన పొలానికి సాగునీరు అందించే పంట బోదెను అనధికారికంగా పూడ్చివేశారని, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నంలోని బందరుకోటకు చెందిన బి.కృష్ణమూర్తి జేసీకి అర్జీ ఇచ్చారు.
తమకు ఇళ్లస్థలాలు ఇప్పించాలని కోరుతూ మచిలీపట్నం మైనార్టీ అసోసియేషన్‌కు చెందిన అబ్దుల్‌అలీమ్, సుల్తానాబేగం, మెహరున్నీసా, ఫాతిమాబేగం తదితరులు దరకాస్తుచేసుకున్నారు.
తమ గ్రామంలో శ్మశానభూమి ఆక్రమణకు గురైందని, విచారణ నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని తిరువూరు మండలం, ఎర్రమాడు గ్రామానికి చెందిన వేము రవిబాబు ఫిర్యాదుచేశారు.
తన ఇంటి స్థలం మధ్య నుంచి విద్యుత్ అధికారులు కొత్తగా లైను వేస్తున్నారని, ఆ పనులను నిలిపివేయాలని కోరుతూ గుడివాడ మండలం నాగవరప్పాడు కాలనీకి చెందిన డి.వి.ప్రభాకరరావు అర్జీదాఖలు చేశారు.
తమకు కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ పెడన మండలం లంకలకలవగుంట గ్రామానికి చెందిన జె.ప్రసాద్, ముసలయ్య అర్జీదాఖలు చేశారు.
జిల్లాలోని రజక వృత్తిదారులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, రజక వృత్తిపై ఆధారపడే రజకుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాటూరి నాగభూషణం జాయింట్ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు.
జిల్లాలోని మత్స్యకారుల జీవన పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి వనమాడి సుబ్బారావు జేసీకి అర్జీ ఇచ్చారు.
దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
Published Tue, Oct 1 2013 2:09 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement