Raghunandana Rao
-
బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్ రావు, సంగమేశ్వర్, చిన్న పటేల్, విష్ణువర్థన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! -
నిజాలు నిగ్గుతేల్చండి
సాక్షి, హైదరాబాద్: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్‌రావు విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకులు, అధికారులు కలిసి ఈ వ్యవహారం వెనక ఒక జాతీయ పార్టీ నాయకత్వం ఉందంటూ ఒక సినిమాకథ సిద్ధం చేశారన్నారు. రాజకీయ నేతల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ మీడియాలో వార్తలు రాగా, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఆ వివరాలేవీ లేవన్నారు. ప్రస్తుత ఆర్థిక విధానాలకు అనుగుణంగా రూ.2 లక్షలకు మించి నగదు కలిగి ఉండరాదని, అంతకుమించి ఉంటే మనీలాండ రింగ్ కిందకు వస్తుందని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరారు. సైబరాబాద్ సీపీపై ఫిర్యాదు ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో ఆధారా లు లేకుండా జాతీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీలోని కేంద్ర ఎన్ని కల ప్రధాన కమిషనర్ (సీఈసీ)కు ఎం.రఘునందన్‌రావు మరో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను డబ్బుతో లోబర్చుకునేందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేరాన్ని నిరూపించే ఆధారాలనుగానీ, డబ్బు లావాదేవీలను గానీ పోలీసులు చూపకపోవడంతో కోర్టు ఆ ముగ్గురిని రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఉదంతాలపై విచారణకు ఆదేశించాలని కోరారు. దేశాన్ని పాలిస్తున్న జాతీయపార్టీ నాయకత్వంపై నెపం మోపి, దాని ప్రతిష్ట దిగజార్చేందుకు అధికారులు గిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సాగేందుకు వీలుగా ఈ వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఫిర్యా దుల ప్రతులను ఢిల్లీలోని ఈడీ,కేంద్ర న్యాయ, డీవోపీటీ శాఖలకు కూడా పంపించారు. నా వాంగ్మూలాన్ని నమోదు చేశారు ఫిర్యాదుపై ఈడీ తన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని, దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతుందని రఘునందన్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ దర్శకత్వంలోనే ‘ఫామ్‌హౌజ్ లీలలు, నగదు’ సినిమా విడుదలైందని ఎద్దేవాచేశారు. బేరసారాలకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల మొబైల్ఫోన్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. -
చట్ట పరిధిలో తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఆయా అంశాలు వెల్లడించినపుడు చట్టపరిధిలో తానేమైనా తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. తనకు చట్టం గురించి తెలుసునని, ఈ కేసు విషయంలో తాను మాట్లాడిన దాంట్లో ఎక్కడా పొరపాటు చేయలేదన్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపాలని పార్టీలన్నీ డిమాండ్ చేయాల్సిన నేపథ్యంలో తనపై కేసు పెట్టాలంటూ టార్గెట్ చేయడం వెనక ఆయా పార్టీలకు ఏం ప్రయోజనాలున్నాయోనని వ్యాఖ్యానించారు. సోమవారం రఘునందన్‌రావు టీవీ చానెళ్ల ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో తాను చట్టాన్ని అతిక్రమించినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటికే మీడియాలో వచ్చిన అంశాల గురించి విలేకరుల సమావేశంలో ప్రస్తావించానే తప్ప.. ఎక్కడా అమ్మాయి ఫొటో, పేరు వంటివి బయటపెట్టలేదన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారంతా తాను మీడియాలో వెల్లడించిన అంశాలు తప్పు అంటున్నారే తప్ప ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరకపోవడం విడ్డూరంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ముందు ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ధర్నా చేయాలని హితవు పలికారు. -
నాడు హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదు: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక న్యాయవ్యాదిగా ఉద్యమంలో వెళ్తున్నప్పుడు తోటి మిత్రులు మీకెందుకు ఇదంతా అన్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధనలో చురుకుగా పాల్గొన్న నాపై అనేక కేసులున్నాయని అన్నారు. ఈ మేరకు రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఉద్యమంలో పని చేసే అవకాశం లభించింది. అనేక మంది మిత్రులు నాతో తెలంగాణ వచ్చేదా సచ్చేదా ఎందుకు ఉద్యమంలో పాల్గొంటున్నావు అన్నారు. స్వామి గౌడ్, విఠల్, నాలాంటి ఎంతో మంది నాయకులు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఉద్యమ ద్రోహులు పదవులు అనుభవిస్తున్నారు. పార్టీలకతీతంగా పని చేశాం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు కానీ వారెవరికీ సరైన గౌరవం లభించలేదు. 1969 ఉద్యమంలో అమరులైన వారికి అమరవీరుల స్థూపం చెక్కిన యాదగిరిని కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ కనీసం అమరవీరుల స్థూపం ప్రారంభించేందుకు రాలేదు. నేడు దాన్ని వదిలేసి కొత్తగా కోట్లు పెట్టి స్థూపం పెడుతున్నారు. తెలంగాణలో చెక్కిన స్థూపం పనికి రాదు కానీ చైనాకు డిజైన్ అప్పజెప్పారు. తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా పని చేశామని రఘునందన్‌రావు అన్నారు. చదవండి: (Hyderabad: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు) శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి ఉద్యమ సమయంలో హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది తప్ప అగ్గిపెట్టె దొరకలేదు. ఇది చూసి శ్రీకాంతా చారి నిజంగా హరీశ్‌రావు ఆత్మహత్య చేసుకుంటాన్నాడేమో అని శ్రీకాంతాచారి అమరుడాయ్యాడు. చివరి క్షణాల్లో శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. నాటి శ్రీకాంతాచారి మొదలు కొని దాదాపు 1200 మంది అమరులయ్యారు. రంగారెడ్డికి చెందిన యాదిరెడ్డి ఢిల్లీలో ఉరి వేసుకొని అమరుడయ్యాడు. సోనియా గాంధీ 2004 ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది అమరులయ్యారు. అనేక రంగాలకు చెందిన చాలా మంది ఈ ఉద్యమంలో అమరులయ్యారు. నాడు అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వలేదు. ఆనాడు ఉద్యమ ద్రోహులు ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారు. మీరు ఆత్మబలిదానాలు ఆపాలని అనాడు సుష్మ స్వరాజ్ చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన పదవులు ఇస్తామని మొదటి అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాట ఏమైంది?. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కా యాదగిరి చెక్కిన అమరవీరుల స్థూపాన్ని వీలయితే ప్రధానమంత్రితో ప్రారంభించేందుకు కృషి చేస్తాం' అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. -
Telangana: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల గెలుపుతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. రాజేందర్ గెలిస్తే ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) అసెంబ్లీలో ఉంటారని ఆ పార్టీ అధ్య క్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యా యి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లలో గెలిచిన ఆపార్టీ 2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. గోషామహల్ నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఒక్క సీట్‌కే పరిమిత మైంది. తరువాత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు టీఆర్ఎస్పై విజ యం సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. బీజేపీ లో చేరిన ఈటల శాసనసభ్యత్వానికి కూడా రాజీ నామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చింది. హోరా హోరీగా సాగిన తాజా ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సుమారు 24 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కమ లాపూర్/ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఆయన గెలవ డం ఇది ఏడోసారి. దీంతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతల పేర్లు ఆంగ్ల అక్షరం ‘ఆర్’తోనే మొదలవుతుంది. సినీ దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’. దీంతో ఆ టైటిల్‌ను ఈ ముగ్గురికి అన్వయిస్తున్నారు. -
మొక్కులు చెల్లించుకున్న రఘునందన్‌రావు
సాక్షి, తిరుమల: దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్రావు బుధవారం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల విచ్చేసి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన యువకుల సహకారంతో దుబ్బాక ఎన్నికలో విజయం సాధించాను. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుంది. నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నా. దుబ్బాకలో బీజేపీ విజయం దక్షణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. పార్టీ సమిష్ట కృషికి నిదర్శనం నా గెలుపు. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై నన్ను గెలిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించాను అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. కాగా రఘునందర్రావు దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతపై గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: (టీఆర్ఎస్ కంచుకోటలో కమలదళం పాగా) (దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం) -
రూ. కోటితో చిక్కిన రఘునందన్ బావమరిది
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు రూ.కోటి నగదుతో చిక్కారు. పెద్దపల్లి మాజీ ఎంపీకి చెందిన, బేగంపేటలోని విశాఖ ఇండ స్ట్రీస్ నుంచి ఈ నగదును తీసుకున్న శ్రీనివాస రావు దుబ్బాకకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆది వారం ప్రకటించారు. ఈ డబ్బుకు, దుబ్బాక ఉప ఎన్నికకు మధ్య సంబంధం ఉన్నట్లు ఆధారాలు సైతం లభించాయని ఆయన స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు... సిద్దిపేటకు చెందిన శ్రీనివాసరావు పటాన్చెరులో దాదాపు పదేళ్లుగా ఏ టు జెడ్ సొల్యూషన్స్ పేరుతో టెక్నికల్, మ్యాన్‌పవర్ సరఫరా వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఆదివారం మధ్యా హ్నం తన కారు డ్రైవర్ టి.రవికుమార్‌తో కలిసి బేగంపేటకు వచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ నుంచి రూ.కోటి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన కారులో పెట్టుకుని దుబ్బాకకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఉప్పందింది. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్కు కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై థక్రుద్దీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. బేగంపేట ప్రాంతంలో శ్రీనివాస రావు ప్రయాణిస్తున్న కారును ఆపింది. అందులో ఉన్న రూ.కోటి నగదుతోపాటు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఫోన్లో లభించిన ఫేస్‌టైమ్ కాల్స్ వివరాలు, వాట్సాప్‌లో ఉన్న సందేశాలు, ఇతర అంశాలు పరిశీలించిన నేపథ్యంలో ఈ నగదు రఘునందన్‌రావు సూచనల మేరకు దుబ్బాకకు తీసుకువెళ్తున్నారని, అక్కడ ఓటర్లకు పంచిపెట్టడానికి పథకం వేశారని అనుమానిస్తున్నామని అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుడు తమ అదుపులో ఉండగా అనేకసార్లు రఘునందర్రావు నుంచి అతడి ఫోన్‌కు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఈ కేసును బేగంపేట పోలీసులు ప్రత్యేక ఏజెన్సీ సహకారంతో దర్యాప్తు చేస్తారని తెలిపారు. పదిరోజుల్లో రూ.2.34 కోట్లు స్వాధీనం ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు విభాగం కట్టుబడి ఉంది. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా హవాలా దందాపై నిఘా ముమ్మరం చేశాం. ఫలితంగా పది రోజుల వ్యవధిలో రూ.2.34 కోట్లు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నాం. దీనికి ప్రజలిచ్చిన సహకారం, సమాచారమే కీలకంగా మారింది. ఇంకా ఇలాంటి లావాదేవీలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలి. – అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పెద్ద మొత్తంలో పట్టుకున్న హవాలా నగదుకు సంబంధించి ఇద్దరు వక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పట్టుబడ్డ నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుది గుర్తించాం. శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశాం. బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో ఈ నగదును పట్టుకున్నాం. స్వాధీనం చేసుకున్న ఫోన్లో చాలా కీలక సమాచారం సేకరించాం. కాల్ లిస్ట్‌లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్ ఫోన్ చేశాడు. కోటి రూపాయిలకు పైగా హవాలా నగదును పట్టుకున్నాం. ఈ నగదును విశాక ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు వెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. (దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్న దృష్ట్యా పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేర మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వెయ్యిమంది ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
దుబ్బాక బీజేపీలో ముసలం
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీ అభ్యర్థిగా మాధవనేని రఘునందర్‌రావును ఖరారు చేయడంపై స్థానిక బీజేపీ నేత తోట కమలాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన్‌రావు లాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ అధిష్తానం పునరాలోచించాలని కమలాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తోట కమలాకర్‌రెడ్డిని పార్టీ నుంచి బీజేపీ తొలగిస్తూ ప్రకటన చేసింది. (దుబ్బాక... మనకు కీలకం ) ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే రఘునందన్‌రావుకే టికెట్ దక్కింది. గతంలో ఆయన దుబ్బాక నుంచి రెండు పర్యాయాలు బీజేపీ తరఫున పోటీ చేశారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తెరమీదకు వచ్చింది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) నవంబర్ 3న ఉప ఎన్నిక దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు. నవంబర్ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. (కాంగ్రెస్ గూటికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి) పోటీకి దూరంగా సీపీఐ ఉప ఎన్నికకు సీపీఐ పోటీకి దూరంగా ఉండనుంది. పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాల్లో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయన్నారు. రెండ్రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. షెడ్యూల్ వివరాలు.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 -
కేసీఆర్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు
సిద్దిపేట : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందరావు సంఘీభావం తెలిపారు. ఆ సమయంలో డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ జరిగింది. సమ్మెకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందరావు మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రోజున మహిళా ఆర్టీసీ కార్మికులపై జరిగిన దాడులకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలనసాగుతోందన్నారు. నాటి ధృతరాష్ట్రుడి పాలనలో ద్రౌపతికి జరిగిన అన్యాయం నేడు తెలంగాణలో మహిళా ఆర్టీసీ కార్మికులకు జరిగింది. మహిళల హక్కులను కాలరాసే విధంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులందరిపైన ఇండియన్ పీనల్ కోడ్‌లో మహిళలను వేధిస్తే ఏ శిక్షను వేస్తారో ఆ శిక్షను వెంటనే అమలు పరచాలన్నారు. గతంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెలామణి అయిన శ్రీనివాస్ గౌడ్ నేడు మంత్రి పదవి రాగానే.. ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ సంఘాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించి కార్మిక సంఘాలలో చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. మీ మంత్రి పదవుల కోసం కార్మిక సంఘాల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉద్యోగ, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మీ పోరాటానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కార్మిక, ఉద్యోగ సంఘాలకు ఎల్లప్పుడూ సహకరిస్తామని అన్నారు. -
‘టీఆర్ఎస్లో హరీశ్ పనైపోయింది’
చేగుంట (తూప్రాన్): టీఆర్ఎస్లో మంత్రి హరీశ్‌రావు పని అయిపోయిందని, సిద్దిపేట నుంచి హరీశ్‌రావును తప్పించి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన వాఖ్యలు చేశారు. చేగుంటలో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్.వాసురెడ్డి తో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది’ అంటూ ఇబ్రహీంపూర్లో హరీశ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్లో ఆయన పని ముగిసిందనేలా ఉన్నాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిసిందన్నారు. మూడు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటాయని, హరీశ్‌ను సిద్దిపేట నుంచి తప్పించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. -
‘ఎన్టీఆర్ సుజల’కు సహకరించండి
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకం నిర్వహణకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రఘునందనరావు పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువరం ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకంపై జిల్లా అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజల తాగునీటి సమస్యపై దృష్టి సారించి ప్రతి ఇంటికి రూ.2 లకే 20 లీటర్ల మంచినీటిని అందించాలని నిశ్చయించారన్నారు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 30వ తేదీన విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను చేస్తామని తెలిపారు. ఫేజ్-1లో ఐదు వేల గ్రామాల్లో ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించగా, జిల్లాలో 513 గ్రామాలను మొదటి దశకు ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 221 ఆర్వో ప్లాంట్స్, ఒక ఇడియఫ్ ప్లాంట్స్, 291 అల్ట్రా ఫిల్ట్రేషన్ గ్రావిటి ఫిల్టర్ ప్లాంట్ల ఆవశ్యకత ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ పిలుపునకు స్పందన .... సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా నిలపాలని ఇచ్చిన కలెక్టర్ పిలుపునకు నూజివీడు, తిరువూరు, గన్నవరం, జగ్గయ్యపేట, కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల పరిధిలో ప్లాంట్ల నిర్వాహణకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల తరఫున హాజరైన ప్రతినిధుల ద్వారా ప్రకటించారు. జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జిల్లా పంచాయితీ అధికారి కె.చంద్రశేఖర్, జిల్లా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కీసరలో దేవాదాయ నిర్మాణాల కూల్చివేతకు యత్నం
కీసర: కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆలయానికి సంబంధించిన పలు నిర్మాణాలను ఓ ప్రైవేటు వ్యక్తి కూల్చివేయడానికి ప్రయత్నించడం గురువారం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు స్థలం ఓ ప్రైవేటు వ్యక్తికి చెందినది కావడంతో సమస్య ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర వాణి సమీపంలోని సర్వే నం: 200/4లో దాదాపు 11 ఎకరాల్లో భూమి ఉంది. ఈ భూమిలో ఏటా కీసరగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్, జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు అక్కడ కళా వేదిక నిర్మాణంతోపాటు, భక్తుల సౌకర్యార్థం మినీ తాగునీటి ట్యాంకులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ సర్వే నంబర్లోని ఎనిమిదిన్నర ఎకరాల భూమి బోగారం గ్రామానికి చెందిన చేవూరి రఘునందనరావు పేరిట ఉంది. ఈ స్థలాన్ని వాడుకుంటున్నందుకు పట్టాదారును స్థలదాతలుగా కీసర దేవస్థానం గుర్తిస్తూ వస్తోంది. కూల్చివేతలకు ప్రయత్నించిన పట్టాదారుడు అయితే గురువారం ఈస్థలాన్ని స్వాధీ నం చేసుకునే క్రమంలో పట్టాదారు అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీ సాయంతో పనులు చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ స్థలంలో మోదుగు వృక్షాల చుట్టూ ఉన్న దిమ్మెలను కూల్చివేశారు. ఈ సమాచారాన్ని తహసీల్దార్ రవీందర్‌రెడ్డికి, కీసరగుట్ట దేవస్థానం వారికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ కూల్చివేతలను నిలిపివేయించారు. రికార్డుల ప్రకారం స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందినదైనప్పటికి చాలా ఏళ్లుగా ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ పలు నిర్మాణాలను చేపట్టిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదన్నారు. స్థలం మొత్తం సర్వేచేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని, అంతవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్థలయజమానికి స్పష్టం చేశారు. -
పెను తుపానే..
తరుముకొస్తున్న లెహర్ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం అప్రమత్తమైన అధికార యంత్రాంగం సాక్షి, మచిలీపట్నం : బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తీరం వైపు దూసుకొస్తున్న లెహర్ పెను తుపానేనని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తుపాను మచిలీపట్నానికి 1200 కిలోమీటర్లు, కాకినాడకు 1140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 1060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతవరణ శాఖ ప్రకటించింది. ఇది మచిలీపట్నం-కళింగపట్నం రేవుల మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ నెల 27 నుంచే వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో దాటిన తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, తాటాకు ఇళ్లు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. యంత్రాంగం అప్రమత్తం ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే హెలెన్ తుపాను కోసం నియమించిన మండల స్థాయి ప్రత్యేక అధికారులను లెహర్కూ కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తుపాను, వరద ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు ఈ నెల 26 నుంచి అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి సోమవారం ఆదేశించారు. మండల స్థాయిలోని అధికారులు తమ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లి ఈ నెల 26 ఉదయం పది గంటలకు ఆఫీసుల్లోని ల్యాండ్ లైన్ల నుంచి తనకు ఫోన్లు చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం ఓడరేవు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లాలోని ప్రత్యేక అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తీవ్ర పెను తుపానుగా వచ్చే లెహర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మహంతి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రఘునందనరావు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒక రోజు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఆహారం, మంచినీళ్లు వంటి వాటిని సమకూర్చుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు.