సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో ఆయా అంశాలు వెల్లడించినపుడు చట్టపరిధిలో తానేమైనా తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. తనకు చట్టం గురించి తెలుసునని, ఈ కేసు విషయంలో తాను మాట్లాడిన దాంట్లో ఎక్కడా పొరపాటు చేయలేదన్నారు. ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపాలని పార్టీలన్నీ డిమాండ్ చేయాల్సిన నేపథ్యంలో తనపై కేసు పెట్టాలంటూ టార్గెట్ చేయడం వెనక ఆయా పార్టీలకు ఏం ప్రయోజనాలున్నాయోనని వ్యాఖ్యానించారు. సోమవారం రఘునందన్‌రావు టీవీ చానెళ్ల ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో తాను చట్టాన్ని అతిక్రమించినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటికే మీడియాలో వచ్చిన అంశాల గురించి విలేకరుల సమావేశంలో ప్రస్తావించానే తప్ప.. ఎక్కడా అమ్మాయి ఫొటో, పేరు వంటివి బయటపెట్టలేదన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారంతా తాను మీడియాలో వెల్లడించిన అంశాలు తప్పు అంటున్నారే తప్ప ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరకపోవడం విడ్డూరంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ముందు ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ధర్నా చేయాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment