వాంగ్మూలం ఇస్తేనే కేసా..? జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు | Criticism Over Police Behavior In Jubilee Hills Gangrape Case | Sakshi
Sakshi News home page

వాంగ్మూలం ఇస్తేనే కేసా..? జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు

Published Mon, Jun 6 2022 4:04 AM | Last Updated on Mon, Jun 6 2022 4:27 AM

Criticism Over Police Behavior In Jubilee Hills Gangrape Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసుల తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నాకే ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని చెప్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. బాలికతో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆధారాలు లభించినా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు తీరు, నిందితులపై చర్యలు, వాహ నాల స్వా«దీనం తదితర అంశాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కేసుకు సంబం ధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆదివారం మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని.. జువెనైల్‌ హోంకు తరలించారు. ఇప్పటికే సాదుద్దీన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లను పట్టుకోగా.. పరారీలో ఉన్న ఉమేర్‌ఖాన్‌ కోసం గాలిస్తున్నారు. 

బాధితురాలు చెప్తేనే పట్టుకున్నారా? 
అమ్నీషియా పబ్‌ కేంద్రంగా మొదలైన ఈ నేరంలో.. తొలుత బెంజ్‌ కారులో బాలికతో అసభ్యకర ప్రవర్తనపైనే పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తండ్రి గత నెల 31న బెంజ్‌ కారు నంబర్‌ సహా చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఆందోళన (షాక్‌)లో ఉన్న బాలిక పూర్తి వివరాలు వెల్లడించలేకపోతోందని కూడా పొందుపరిచారు. బెంజ్‌ కారు నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇన్నోవాలో జరిగిన అత్యాచార దారుణాన్ని గుర్తించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మసీవుల్లాఖాన్‌ కుమారుడితోపాటు ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర కూడా ఉందని మొదటినుంచీ ఆరోపణలు ఉన్నాయి. మసీవుల్లా కుమారుడి పాత్రను నిర్ధారించిన అధికారులు.. ఎమ్మెల్యే తనయుడి అంశంపై ఆధారాలు లేవని చెప్తూ వచ్చారు. 

ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో.. 
బాలికపై అఘాయిత్యం పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలికతో బెంజ్‌ కారులో అసభ్యంగా ప్రవర్తించిన వారిలో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడంటూ ఆయన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. దీనితో ఎమ్మెల్యే కుమారుడినీ ఈ కేసులో చేర్చక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. అయినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కుమారుడి అంశాన్ని బాలిక తన వాంగ్మూలంలో చెప్పలేదని, మరోసారి ఆమె వాంగ్మూలం నమోదుచేశాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. వాస్తవానికి అసలు కేసే అసభ్య ప్రవర్తనకు సంబంధించినది అయినప్పుడు వాంగ్మూలాల పేరుతో మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. 

బ్లాక్‌ ఫిల్మ్, స్టిక్కర్‌ ఎందుకు తొలగించారు? 
బాలికను అమ్నీషియా పబ్‌ నుంచి బెంజ్‌ కారులో తీసుకువెళ్లిన నిందితులు.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద ఆగారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోగా.. మిగతావారు ఇన్నోవా కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. టెంపరరీ రిజి్రస్టేషన్‌తో ఉన్న ఇన్నోవా అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉందని, ప్రభుత్వం వాహనం అన్న స్టిక్కర్‌ ఉందని సమాచారం. శనివారం ఇన్నోవాను స్వా«దీనం చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్‌తోపాటు అద్దాల బ్లాక్‌ ఫిల్మ్‌ను తొలగించినట్టు తెలిసింది. దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు కోర్టు విచారణకు వచ్చినప్పుడు నేర నిరూపణపై ఇది ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పారదర్శకంగా ఉన్న అద్దాలతో కూడిన వాహనంలో సాయంత్రం వేళ అత్యాచారం ఎలా జరిగిందనే అంశం ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌’గా మారే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 

బెంజ్‌కారులో ఫోరెన్సిక్‌ ఆధారాల సేకరణ 
ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్న పోలీసులు శనివారమే అందులో నుంచి కొన్ని నమూనాలు, ఆధారాలు సేకరించారు. అయితే రఘునంద్‌రావు మీడియాకు విడుదల చేసిన వీడియోలో బెంజ్‌ కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఆదివారం సోషల్‌ మీడియాలో మరికొన్ని వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. అందులో కారు వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు మైనర్లతో బాధితురాలు సన్నిహితంగా ఉన్న దృశ్యాలున్నాయి. వీటిలో ఎమ్మెల్యే కుమారుడు లేడు. ఈ వీడియోలు తీసే సమయానికి ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడా? లేక అంతకు ముందే ఇది తీశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆదివారం బెంజ్‌ కారులో ఫోరెన్సిక్‌ నిపుణులతో ఆధారాలు సేకరించారు. 
– సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో పబ్‌ నుంచి బెంజ్‌ కారును నడుపుకొంటూ వస్తున్నది ఉమేర్‌ఖాన్‌గా గుర్తించారు. కారు అతడి తల్లి పేరు మీదే రిజి్రస్టేషన్‌ అయి ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఉమేర్‌ పరారీలోనే ఉన్నాడని, మూడు బృందాలు గోవా, ఊటీ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఉమేర్‌ పోలీసుల అదుపులోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 
– ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో సాదుద్దీన్‌పాటు వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడు, సంగారెడ్డి మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుడి కుమారుడు, రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన ఒక కార్పొరేటర్‌ కుమారుడు ఉన్నట్టు తెలిసింది. 

మెడపై గాయాలు.. ‘టూత్‌ టాటూ’లు! – విచారణలో ఓ మైనర్‌ వెల్లడి 
రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి రావడానికి మూలం ఆమె మెడపై ఉన్న గాయాలే. వీటిని చూసిన బాలిక తండ్రి నిలదీయడంతోనే బాధితురాలు జరిగింది చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవి పంటి గాట్లని గుర్తించారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన నిందితులను పోలీసులు ఈ గాయాలకు కారణాల పైనా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకర అంశం బయటపడింది. నిందితుడిగా ఉన్న ఓ మైనర్‌ పోలీసుల విచారణలో ఆ గాయాలు ‘టూత్‌ టాటూ’లు అంటూ బయటపెట్టాడని సమాచారం. బాలికతో వేర్వేరుగా సన్నిహితంగా మెలిగిన తర్వాత అలా మెడపై కొరికి గాయపరిచామని, వీటినే తాము టూత్‌ టాటూలు అంటామని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. నరగంలోని అనేక సమూహాల్లో ఈ విష సంస్కృతి ఉన్నట్లు సమాచారం.  

ప్రజాప్రతినిధి ఫాంహౌస్‌లో తలదాచుకుని..! 
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారును పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో స్వా«దీనం చేసుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్‌ మొయినాబాద్‌ మండలంలోని ఓ ప్రజాప్రతినిధికి చెందినదని.. నిందితులు ఘటన జరిగిన రోజు రాత్రే అక్కడికి వెళ్లి తలదాచుకున్నారని తెలిసింది. తర్వాతి రోజు నిందితులు పరారైనట్టు సమాచారం. అయితే మండలంలోని ఏ గ్రామంలో, ఏ ఫాంహౌస్‌లో కారును స్వాధీనం చేసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. 

జూబ్లీహిల్స్‌ రేప్‌ ఘటనపై నివేదిక ఇవ్వండి – సీఎస్, డీజీపీలకు గవర్నర్‌ తమిళిసై ఆదేశం 
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై రెండు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించారు. 17 ఏళ్ల బాలికపై దురాగతం జరగటం పట్ల గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచి్చన వార్తలను పరిశీలించిన అనంతరం గవర్నర్‌ నివేదిక కోరారని రాజ్‌భవన్‌ అధికారులు ప్రకటించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement