Investigation of the police
-
వాంగ్మూలం ఇస్తేనే కేసా..? జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసుల తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నాకే ఎమ్మెల్యే కుమారుడిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని చెప్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. బాలికతో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆధారాలు లభించినా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు తీరు, నిందితులపై చర్యలు, వాహ నాల స్వా«దీనం తదితర అంశాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కేసుకు సంబం ధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో మైనర్‌ను అదుపులోకి తీసుకుని.. జువెనైల్ హోంకు తరలించారు. ఇప్పటికే సాదుద్దీన్‌తోపాటు మరో ఇద్దరు మైనర్లను పట్టుకోగా.. పరారీలో ఉన్న ఉమేర్‌ఖాన్ కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్తేనే పట్టుకున్నారా? అమ్నీషియా పబ్ కేంద్రంగా మొదలైన ఈ నేరంలో.. తొలుత బెంజ్ కారులో బాలికతో అసభ్యకర ప్రవర్తనపైనే పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తండ్రి గత నెల 31న బెంజ్ కారు నంబర్ సహా చేసిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. తీవ్ర ఆందోళన (షాక్)లో ఉన్న బాలిక పూర్తి వివరాలు వెల్లడించలేకపోతోందని కూడా పొందుపరిచారు. బెంజ్ కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇన్నోవాలో జరిగిన అత్యాచార దారుణాన్ని గుర్తించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసీవుల్లాఖాన్ కుమారుడితోపాటు ఓ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర కూడా ఉందని మొదటినుంచీ ఆరోపణలు ఉన్నాయి. మసీవుల్లా కుమారుడి పాత్రను నిర్ధారించిన అధికారులు.. ఎమ్మెల్యే తనయుడి అంశంపై ఆధారాలు లేవని చెప్తూ వచ్చారు. ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో.. బాలికపై అఘాయిత్యం పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంతో కేసు కీలక మలుపు తిరిగింది. బాలికతో బెంజ్ కారులో అసభ్యంగా ప్రవర్తించిన వారిలో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడంటూ ఆయన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. దీనితో ఎమ్మెల్యే కుమారుడినీ ఈ కేసులో చేర్చక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. అయినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కుమారుడి అంశాన్ని బాలిక తన వాంగ్మూలంలో చెప్పలేదని, మరోసారి ఆమె వాంగ్మూలం నమోదుచేశాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. వాస్తవానికి అసలు కేసే అసభ్య ప్రవర్తనకు సంబంధించినది అయినప్పుడు వాంగ్మూలాల పేరుతో మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్ ఎందుకు తొలగించారు? బాలికను అమ్నీషియా పబ్ నుంచి బెంజ్ కారులో తీసుకువెళ్లిన నిందితులు.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద ఆగారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోగా.. మిగతావారు ఇన్నోవా కారులో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. టెంపరరీ రిజి్రస్టేషన్‌తో ఉన్న ఇన్నోవా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉందని, ప్రభుత్వం వాహనం అన్న స్టిక్కర్ ఉందని సమాచారం. శనివారం ఇన్నోవాను స్వా«దీనం చేసుకున్న పోలీసులు.. స్టిక్కర్తోపాటు అద్దాల బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించినట్టు తెలిసింది. దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు కోర్టు విచారణకు వచ్చినప్పుడు నేర నిరూపణపై ఇది ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. పారదర్శకంగా ఉన్న అద్దాలతో కూడిన వాహనంలో సాయంత్రం వేళ అత్యాచారం ఎలా జరిగిందనే అంశం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’గా మారే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. బెంజ్‌కారులో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్న పోలీసులు శనివారమే అందులో నుంచి కొన్ని నమూనాలు, ఆధారాలు సేకరించారు. అయితే రఘునంద్‌రావు మీడియాకు విడుదల చేసిన వీడియోలో బెంజ్ కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఆదివారం సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. అందులో కారు వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు మైనర్లతో బాధితురాలు సన్నిహితంగా ఉన్న దృశ్యాలున్నాయి. వీటిలో ఎమ్మెల్యే కుమారుడు లేడు. ఈ వీడియోలు తీసే సమయానికి ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడా? లేక అంతకు ముందే ఇది తీశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆదివారం బెంజ్ కారులో ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరించారు. – సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో పబ్ నుంచి బెంజ్ కారును నడుపుకొంటూ వస్తున్నది ఉమేర్‌ఖాన్‌గా గుర్తించారు. కారు అతడి తల్లి పేరు మీదే రిజి్రస్టేషన్ అయి ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఉమేర్ పరారీలోనే ఉన్నాడని, మూడు బృందాలు గోవా, ఊటీ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఉమేర్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. – ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో సాదుద్దీన్పాటు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడి కుమారుడు, రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఒక కార్పొరేటర్ కుమారుడు ఉన్నట్టు తెలిసింది. మెడపై గాయాలు.. ‘టూత్ టాటూ’లు! – విచారణలో ఓ మైనర్ వెల్లడి రొమేనియా బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి రావడానికి మూలం ఆమె మెడపై ఉన్న గాయాలే. వీటిని చూసిన బాలిక తండ్రి నిలదీయడంతోనే బాధితురాలు జరిగింది చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవి పంటి గాట్లని గుర్తించారు. ఈ నేపథ్యంలో పట్టుబడిన నిందితులను పోలీసులు ఈ గాయాలకు కారణాల పైనా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకర అంశం బయటపడింది. నిందితుడిగా ఉన్న ఓ మైనర్ పోలీసుల విచారణలో ఆ గాయాలు ‘టూత్ టాటూ’లు అంటూ బయటపెట్టాడని సమాచారం. బాలికతో వేర్వేరుగా సన్నిహితంగా మెలిగిన తర్వాత అలా మెడపై కొరికి గాయపరిచామని, వీటినే తాము టూత్ టాటూలు అంటామని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. నరగంలోని అనేక సమూహాల్లో ఈ విష సంస్కృతి ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధి ఫాంహౌస్‌లో తలదాచుకుని..! జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారును పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్‌లో స్వా«దీనం చేసుకున్నారు. ఆ ఫామ్‌హౌజ్ మొయినాబాద్ మండలంలోని ఓ ప్రజాప్రతినిధికి చెందినదని.. నిందితులు ఘటన జరిగిన రోజు రాత్రే అక్కడికి వెళ్లి తలదాచుకున్నారని తెలిసింది. తర్వాతి రోజు నిందితులు పరారైనట్టు సమాచారం. అయితే మండలంలోని ఏ గ్రామంలో, ఏ ఫాంహౌస్‌లో కారును స్వాధీనం చేసుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై నివేదిక ఇవ్వండి – సీఎస్, డీజీపీలకు గవర్నర్ తమిళిసై ఆదేశం సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. 17 ఏళ్ల బాలికపై దురాగతం జరగటం పట్ల గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వచి్చన వార్తలను పరిశీలించిన అనంతరం గవర్నర్ నివేదిక కోరారని రాజ్‌భవన్ అధికారులు ప్రకటించారు. -
నడిరోడ్డుపై బ్యాగ్ కలకలం.. అందులో నుంచి ఏడుపు శబ్దం
హర్యానా: ఫరీదాబాద్‌లోని సెక్టార్25 రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై ఓ నల్లబ్యాగ్ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలలోకి వెళితే.. ఒక పాదచారుడు బ్రిడ్జిపై నడుచుకుంటూ ఉదయాన్నే వెళుతున్నాడు. అలా వెళుతున్న అతనికి రోడ్డు పక్కన ఒక నల్లని బ్యాగ్ నుంచి చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూశాడు. బ్యాగ్‌లో నుంచే ఆ ఏడుపు వినిపిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. వెంటనే బ్యాగ్ తెరిచి చూస్తే అందులో ఓ పసికందు గట్టిగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకి సమాచారం అందించాడు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి కొన్ని గంటల క్రితం పుట్టిన పాపను బ్యాగ్‌లో పెట్టి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని, పాప ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేవని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ.. ఆ పాపకు పాలిచ్చి ఆకలి తీర్చిందని పోలీసులు పేర్కొన్నారు. పాపను అక్కడ వదిలేసి వెళ్లింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ పసికందును వదిలేసి వెళ్లిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పసికందును అలా నడిరోడ్డుపై బ్యాగ్‌లో వదిలేసి వెళ్లారనే విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ పాపను దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. అయితే దానికి న్యాయపరమైన ప్రక్రియ ఉంటుందని, అలా దత్తత తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదని పోలీసులు వారికి తెలిపారు. ఇక దాంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుందామని వచ్చినవారు నిరాశ చెందారు. -
జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు
లండన్: ఇరాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లో ఉండి అరెస్టయిన కెప్టెన్ సహా నలుగురు భారత సిబ్బందిపై పోలీసుల విచారణ ముగిసి వారు జిబ్రాల్టర్‌లో గురువారం విడుదలయ్యారు. స్పెయిన్‌కు దక్షిణాన, సముద్ర తీరంలో ఉండే బ్రిటిష్ ప్రాంతమే ఈ జిబ్రాల్టర్. పనామా జెండా కలిగిన ఈ ఆయిల్ ట్యాంకర్ జిబ్రాల్టర్ జలాల్లోని ఐరోపా పాయింట్ వద్ద ఉండగా, గత నెల 4వ తేదీన జిబ్రాల్టర్ అధికారులు వారిని అడ్డగించి ట్యాంకర్‌ను తమ అధీనంలోకి తీసుకుని అందులోని 28 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయులే. సిరియాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలున్నాయి. ఈ ఆయిల్ ట్యాంకర్ ద్వారా సిరియాకు ముడి చమురును తీసుకెళ్తున్నారనే అనుమానంతో జిబ్రాల్టర్ అధికారులు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే అది సిరియాకు వెళ్తున్నది కాదని అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం, ట్యాంకర్ సిబ్బంది చెబుతూనే ఉన్నారు. దీంతో తాజాగా నలుగురు భారతీయులపై పోలీసులు విచారణ ముగించి, వారిని జిబ్రాల్టర్‌లో విడుదల చేశారు. -
కాంట్రాక్టుల పేరుతో ఘరానా మోసం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిసానంటూ పెద్ద మొత్తంలో నగదు వసూలుచేసిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ–2 అప్పలనాయుడు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భవానీపురం నూరి మసీదు వీధికి చెందిన సలాది రామ్‌గోపాల్ కొంతకాలంగా నెట్ సెంటర్ నడుపుతున్నాడు. తరచూ అక్కడికి వెళ్లే భవానీపురం హెచ్‌బీ కాలనీవాసి బూసా సత్యసూర్యకిరణ్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను గవర్న్Ðమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (న్యూఢిల్లీ) విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొన్నాడు. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లో స్వచ్ఛ భారత్ కింద జిల్లాలవారీగా మ్యాన్‌పవర్ సప్లై కాంట్రాక్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు చెప్పి సత్యసూర్యకిరణ్ని కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయాలని సూచించాడు. లక్షల్లో వసూలు అతని మాయమాటలు నమ్మిన సత్యసూర్యకిరణ్ తన స్నేహితులు 15 మందితో కలిసి మొత్తం రూ.52,50,000ను, అతనికి తెలిసిన చిన్న వెంకటేశ్వరరావు వద్ద రూ.29 లక్షలు (స్టేట్ వైడ్ మెడికల్ సప్లై కాంట్రాక్ట్ కోసం), చిన వెంకటేశ్వరరావుకు తెలిసిన కండెపు లక్ష్మీపెరుమాళ్లు వద్ద నుంచి రూ.17లక్షలు (జిల్లావారీగా మ్యాన్‌పవర్ సప్లై కాంట్రాక్ట్ కోసం), సంపతి రాజగోపాల్ వద్ద రూ.28 లక్షలు (స్టేట్ వైడ్ మ్యాన్‌పవర్ సప్లై కాంటాక్ట్ కోసం), శ్రీకాంత్ దగ్గర రూ.2.50 లక్షలు (అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం) మొత్తం సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ స్టాంప్‌లు చూపించడంతో వారందరూ నమ్మి మోసపోయారు. ఈ నగదు వసూళ్లలో నిందితుడి భార్య సలాది రేవతి, బావమరిది దొడ్డి కిరణ్, డ్రైవర్ యాళ్ల రాము సహకరించారు. బాధితులందరూ కలిసి నిందితుడ్ని నిలదీయడంతో న్యూ ఢిల్లీలోని నిర్మల్ భవన్లో ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పి గతేడాది అక్టోబర్ 24వ తేదీన తీసుకెళ్లాడు. తర్వాత ఇంటర్వ్యూలు రద్దయ్యాయని, ఆర్డర్స్ మీ వద్దకే వస్తాయని నమ్మబలికాడు. ఈ క్రమంలో నవంబర్ 29వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బాధితులను చూసి రామ్‌గోపాల్ పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి నిందితుడికి సహకరించిన సలాది రేవతి, దొడ్డి కిరణ్, యాళ్ల రాములను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన నిందితుడు రామ్‌గోపాల్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న నేపథ్యంలో సోమవారం వన్‌టౌన్ శివాలయం వీధిలో తిరుగుతుండగా అరెస్ట్‌చేశారు. విచారణలో తేలిందేంటంటే.. 2006లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వెంకటనారాయణ అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన రామ్‌గోపాల్.. తాను కూడా అలాగే ప్రజలను మోసం చేశాడు. విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో మకాంలు మారుస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై ఆయా ప్రాంతాల్లో 22 కేసులు నమోదయ్యాయి. విజయవాడ భవానీపురం, సత్యనారాయణపురం, పెనమలూరు, పటమట, కృష్ణలంక, తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుని వద్ద నుంచి 272 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, కారు, బైక్, ల్యాప్‌టాప్, నాలుగు సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు, అగ్రిమెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వెస్ట్ ఏసీపీ సుధాకర్, భవానీపురం సీఐ డీకెఎన్ మోహన్‌రెడ్డి, ఎస్ఐ చినస్వామి పాల్గొన్నారు. -
‘క్రికెట్ ఆపెయ్యండి .. కావాలంటే పాకిస్తాన్ వెళ్లిపోండి’
గురుగ్రామ్: దేశ రాజధాని సమీపంలో ఓ ముస్లిం కుంటుంబంపై మూకదాడి జరిగింది. గురుగ్రామ్‌లోని ధమ్సాపూర్ గ్రామంలో నివసిస్తున్న మహ్మద్ సాజిద్ నివాసంలోకి చొరబడిన సుమారు 20 మంది యువకులు శుక్రవారం మూకదాడికి పాల్పడ్డారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సాజిద్ గత మూడేళ్లుగా ధమ్సాపూర్లో భార్య సమీనా, ఆరుగురు పిల్లలతో కలిసి నివసముంటున్నాడు. సాజిద్ ఇంటికి వచ్చిన బంధువులు.. ఫ్లాట్ ఆవరణలో క్రికెట్ ఆడుతున్నారు. అదే సమయంలో అక్కడికి బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించారు. ‘మీరు పాకిస్థాన్ వెళ్లి ఆడుకోండి. ఇక్కడ ఆటలాడొద్దు’ అని బెదించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసి చితకబాదారు. సాజిద్ మేనల్లుడు దిల్ఫాద్ మాట్లాడుతూ...‘మమ్మల్ని కొడుతున్నప్పుడు మామయ్య అడ్డుకునేందుకు యత్నించడంతో.. ఆయనను కూడా కొట్టారు. కొద్దిపేపటి తర్వాత మరికొంతమంది వచ్చి రెండోసారి దాడి చేశారు. వాళ్లకు భయపడి మేం ఇంట్లోకి పారిపోయాం. బయటికి రాకపోతే చంపేస్తామని బెదిరించారు. మేం ఎంతకూ బయటకు రాకపోయేసరికి మా ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చి మళ్లీ కొట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కర్రలు, ఇనుప రాడ్లతో సాజిద్ కుంటుంబంపై మూకదాడి జరిగినట్టు తెలుస్తోంది. బతిమిలాడినా వినలేదు దాడి సమయంలో తాను వంటగదిలో ఉన్నానని, అరుపులు వినిపించడంతో బయటికొచ్చానని సాజిద్ భార్య సమీనా తెలిపారు. ‘కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. మాపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని బంగారు గొలుసు, చెవి దుద్దుల్లాంటి ఖరీదైన వస్తువులను తీసుకెళ్లారు. కారు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు’ అని ఆమె వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు దుండగులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొంతమంది ఆచూకి దొరికిందని వారిని పట్టుకుంటామని, పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక భోండ్సీ పోలీసు అధికారి సురేందర్ కుమార్ తెలిపారు. -
కుప్పంలో పోలీసుల విచారణ
కుప్పం : కుప్పం సర్కిల్ కార్యాలయంలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. ఏఎస్పీ అభిషేక్ మొహంతి, చిత్తూరు ఎస్బీఐ ఎస్ఐ రవిబాబు, చిత్తూరు ఏఎస్ఐ వసంత కుప్పం చేరుకుని సీఐ కార్యాలయంలో ఉదయం 9.20 గంటల నుంచి 5 గంటలు విచారణ చేపట్టారు. కుప్పం సర్కిల్లోని మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో మాట్లాడారు. సీఐ రాజశేఖర్ మహిళా కానిస్టేబుల్ నిర్మలను వేధింపులకు గురిచేశారా, ఈ వేధింపులకు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసిందా, సిబ్బందిపై సీఐ ప్రవర్తన ఎలా ఉంటుంది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ప్రత్యేక ఛాంబర్లో విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.