గురుగ్రామ్: దేశ రాజధాని సమీపంలో ఓ ముస్లిం కుంటుంబంపై మూకదాడి జరిగింది. గురుగ్రామ్‌లోని ధమ్సాపూర్ గ్రామంలో నివసిస్తున్న మహ్మద్ సాజిద్ నివాసంలోకి చొరబడిన సుమారు 20 మంది యువకులు శుక్రవారం మూకదాడికి పాల్పడ్డారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సాజిద్ గత మూడేళ్లుగా ధమ్సాపూర్లో భార్య సమీనా, ఆరుగురు పిల్లలతో కలిసి నివసముంటున్నాడు. సాజిద్ ఇంటికి వచ్చిన బంధువులు.. ఫ్లాట్ ఆవరణలో క్రికెట్ ఆడుతున్నారు. అదే సమయంలో అక్కడికి బైక్‌లపై వచ్చిన కొందరు యువకులు వారిపట్ల అమానుషంగా వ్యవహరించారు. ‘మీరు పాకిస్థాన్ వెళ్లి ఆడుకోండి. ఇక్కడ ఆటలాడొద్దు’ అని బెదించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసి చితకబాదారు.
సాజిద్ మేనల్లుడు దిల్ఫాద్ మాట్లాడుతూ...‘మమ్మల్ని కొడుతున్నప్పుడు మామయ్య అడ్డుకునేందుకు యత్నించడంతో.. ఆయనను కూడా కొట్టారు. కొద్దిపేపటి తర్వాత మరికొంతమంది వచ్చి రెండోసారి దాడి చేశారు. వాళ్లకు భయపడి మేం ఇంట్లోకి పారిపోయాం. బయటికి రాకపోతే చంపేస్తామని బెదిరించారు. మేం ఎంతకూ బయటకు రాకపోయేసరికి మా ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చి మళ్లీ కొట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కర్రలు, ఇనుప రాడ్లతో సాజిద్ కుంటుంబంపై మూకదాడి జరిగినట్టు తెలుస్తోంది.
బతిమిలాడినా వినలేదు
దాడి సమయంలో తాను వంటగదిలో ఉన్నానని, అరుపులు వినిపించడంతో బయటికొచ్చానని సాజిద్ భార్య సమీనా తెలిపారు. ‘కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. మాపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని బంగారు గొలుసు, చెవి దుద్దుల్లాంటి ఖరీదైన వస్తువులను తీసుకెళ్లారు. కారు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు’ అని ఆమె వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు దుండగులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొంతమంది ఆచూకి దొరికిందని వారిని పట్టుకుంటామని, పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానిక భోండ్సీ పోలీసు అధికారి సురేందర్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment