నడిరోడ్డుపై బ్యాగ్ కలకలం.. అందులో నుంచి ఏడుపు శబ్దం | Haryana Faridabad Black Bag Infant Baby | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై బ్యాగ్ కలకలం.. అందులో నుంచి ఏడుపు శబ్దం

Published Thu, Oct 21 2021 12:15 AM | Last Updated on Thu, Oct 21 2021 12:22 AM

Haryana Faridabad Black Bag Infant Baby - Sakshi

హర్యానా: ఫరీదాబాద్‌లోని సెక్టార్25 రోడ్డులో ఉన్న బ్రిడ్జిపై ఓ నల్లబ్యాగ్‌ కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలలోకి వెళితే.. ఒక పాదచారుడు బ్రిడ్జిపై నడుచుకుంటూ ఉదయాన్నే వెళుతున్నాడు. అలా వెళుతున్న అతనికి రోడ్డు పక్కన ఒక నల్లని బ్యాగ్ నుంచి చిన్న పాప ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో ఆ బ్యాగ్ దగ్గరకు వెళ్లి చూశాడు. బ్యాగ్‌లో నుంచే ఆ ఏడుపు వినిపిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. వెంటనే బ్యాగ్‌ తెరిచి చూస్తే అందులో ఓ పసికందు గట్టిగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకి సమాచారం అందించాడు.

ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి కొన్ని గంటల క్రితం పుట్టిన పాపను బ్యాగ్‌లో పెట్టి అక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని, పాప ఒంటిపై కనీసం దుస్తులు కూడా లేవని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ మహిళ.. ఆ పాపకు పాలిచ్చి ఆకలి తీర్చిందని పోలీసులు పేర్కొన్నారు. పాపను అక్కడ వదిలేసి వెళ్లింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ పసికందును వదిలేసి వెళ్లిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా పసికందును అలా నడిరోడ్డుపై బ్యాగ్‌లో వదిలేసి వెళ్లారనే విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆ పాపను దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. అయితే దానికి న్యాయపరమైన ప్రక్రియ ఉంటుందని, అలా దత్తత తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదని పోలీసులు వారికి తెలిపారు. ఇక దాంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుందామని వచ్చినవారు నిరాశ చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement