రేప్‌ ఘటనపై రాజకీయ దుమారం! | Political Scandal In Amnesia Gangrape Case | Sakshi
Sakshi News home page

రేప్‌ ఘటనపై రాజకీయ దుమారం!

Published Sun, Jun 5 2022 4:17 AM | Last Updated on Sun, Jun 5 2022 8:29 AM

Political Scandal In Amnesia Gangrape Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రొమేనియా బాలికపై అత్యాచార ఘటన.. అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండటం.. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు.. రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బాలికతో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ పలు ఫొటోలు, వీడియోలు బయటికి మరింత అలజడికి కారణమవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనకు సంబంధించిన ఆధారాలను, ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ.. టీఆర్‌ఎస్‌ సర్కారు, ఎంఐఎంలపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీ ప్రతినిధి బృందం శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ, అనుబంధ సంఘాలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.

బాలికపై రేప్‌ ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్‌ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కుమ్మౖక్కై కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే కారులో బాలిక ఉన్న వీడియోలను రఘునందన్‌రావు విడుదల చేశారని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహం వద్ద యూత్‌ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు నిరసన తెలిపాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. వెంటనే సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. 

టీఆర్‌ఎస్, ఎంఐఎం.. సైలెంట్‌! 
బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎంఐఎం ఎక్కడా స్పందించలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానీ, నాయకులు కానీ ఘటనపై నోరు మెదపలేదు. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దంటూ మంత్రి కేటీఆర్‌ పోలీసులను కోరుతూ చేసిన ట్వీట్‌ మినహా టీఆర్‌ఎస్‌ ఈ ఘటన గురించి అధికారికంగా మాట్లాడలేదు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాత్రం పోలీసులు ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నారని, ఘటనతో సంబంధమున్న వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి
జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన దారుణమని, దీనిపై సమగ్ర విచారణ జరి పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులు ఏ స్థాయివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్న పబ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహ రించాలన్నారు. ఈ లైంగిక దాడి రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు ఉన్నారని ఆరోపించారు. 

అత్యాచారంపై సీబీఐ విచారణ జరపాలి
బాలి కపై అత్యాచారం అమా నుషమని, ఈ ఘట నపై రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వ కుం డా సీబీఐ విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. అత్యాచార ఘటనపై సీబీఐ అధికా రులు, కేంద్ర హోంమంత్రి, మహిళా సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో మాట్లాడాన న్నారు. కాగా, ప్రజాశాంతి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం ఇప్పటి వరకు 19,000 మంది పోటీలో ఉన్నట్లు పాల్‌ చెప్పారు. ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మె ల్యేలు ముగ్గురు తనతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తండ్రి వెంకటాచారి ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు చంపేస్తా మంటూ ఆయనకు బెదిరింపులు వస్తున్నాయ న్నారు. ఆయనకు ఏదైనా జరిగితే కేసీఆర్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

అత్యాచారంపై సీబీఐ విచారణకు డిమాండ్‌
మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం సంఘటనలో అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రమేయం, సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును సీబీఐకు బదిలీ చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, ఎన్‌.రామచంద్ర రావు, బంగారు శ్రుతి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయంలో మహేందర్‌రెడ్డికి బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు బయటకు రావడంతో పాటు నిందితులు ఎంత పెద్దవారైనా తప్పుచేస్తే చట్టపరంగా కఠిన శిక్ష తప్పదనే సందేశం వెలువడుతుందన్నారు.

ఈ సంఘటన జరిగి అయిదు రోజులు గడిచాక తప్ప పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వల్ల నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు రాగా, అతనికి సంబంధం లేదంటూ పోలీసులు ముందుగానే ప్రకటించడంతో ఈ ఘటనలో ఏదో జరిగిందనేది స్పష్టమౌతోందన్నారు. పబ్‌లు, రెస్టారెంట్ల నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఏర్పడుతోందని డీజీపీకి వివరించారు.

పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి
అశ్వాపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, పోలీసులు పని చేస్తున్నారా, హోంమంత్రి ఉన్నారా లేరా అని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన రాజ్యాధికార యాత్ర శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా అశ్వాపురంలో మాట్లాడుతూ.. గతనెల 28న హైదరాబాద్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బాధాకరమన్నారు.

నిందితులు అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకుల బం ధువులని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని, హోం మంత్రి, ముఖ్యమంత్రితో నిందితులు ఫొటోలు దిగినట్టు సోషల్‌ మీడియాలో వస్తున్నాయన్నారు. బాలికపై అత్యాచార ఘటన విషయంలో అత్యున్నత సిట్‌ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రాబోయే బహుజన రాజ్యంలో బెల్ట్‌షాపులు పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేశ్‌ తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement