సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక న్యాయవ్యాదిగా ఉద్యమంలో వెళ్తున్నప్పుడు తోటి మిత్రులు మీకెందుకు ఇదంతా అన్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధనలో చురుకుగా పాల్గొన్న నాపై అనేక కేసులున్నాయని అన్నారు. ఈ మేరకు రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఉద్యమంలో పని చేసే అవకాశం లభించింది. అనేక మంది మిత్రులు నాతో తెలంగాణ వచ్చేదా సచ్చేదా ఎందుకు ఉద్యమంలో పాల్గొంటున్నావు అన్నారు. స్వామి గౌడ్, విఠల్, నాలాంటి ఎంతో మంది నాయకులు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఉద్యమ ద్రోహులు పదవులు అనుభవిస్తున్నారు.
పార్టీలకతీతంగా పని చేశాం
తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు కానీ వారెవరికీ సరైన గౌరవం లభించలేదు. 1969 ఉద్యమంలో అమరులైన వారికి అమరవీరుల స్థూపం చెక్కిన యాదగిరిని కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ కనీసం అమరవీరుల స్థూపం ప్రారంభించేందుకు రాలేదు. నేడు దాన్ని వదిలేసి కొత్తగా కోట్లు పెట్టి స్థూపం పెడుతున్నారు. తెలంగాణలో చెక్కిన స్థూపం పనికి రాదు కానీ చైనాకు డిజైన్ అప్పజెప్పారు. తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా పని చేశామని రఘునందన్‌రావు అన్నారు.
చదవండి: (Hyderabad: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు)
శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి
ఉద్యమ సమయంలో హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది తప్ప అగ్గిపెట్టె దొరకలేదు. ఇది చూసి శ్రీకాంతా చారి నిజంగా హరీశ్‌రావు ఆత్మహత్య చేసుకుంటాన్నాడేమో అని శ్రీకాంతాచారి అమరుడాయ్యాడు. చివరి క్షణాల్లో శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. నాటి శ్రీకాంతాచారి మొదలు కొని దాదాపు 1200 మంది అమరులయ్యారు. రంగారెడ్డికి చెందిన యాదిరెడ్డి ఢిల్లీలో ఉరి వేసుకొని అమరుడయ్యాడు. సోనియా గాంధీ 2004 ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది అమరులయ్యారు. అనేక రంగాలకు చెందిన చాలా మంది ఈ ఉద్యమంలో అమరులయ్యారు.
నాడు అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయి?
ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వలేదు. ఆనాడు ఉద్యమ ద్రోహులు ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారు. మీరు ఆత్మబలిదానాలు ఆపాలని అనాడు సుష్మ స్వరాజ్ చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన పదవులు ఇస్తామని మొదటి అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాట ఏమైంది?. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కా యాదగిరి చెక్కిన అమరవీరుల స్థూపాన్ని వీలయితే ప్రధానమంత్రితో ప్రారంభించేందుకు కృషి చేస్తాం' అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment