సిద్దిపేట : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టు వీడడం లేదు. దీంతో పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందరావు సంఘీభావం తెలిపారు. ఆ సమయంలో డిపోలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య ఘర్షణ జరిగింది. సమ్మెకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందరావు మీడియాతో మాట్లాడుతూ.. గురువారం రోజున మహిళా ఆర్టీసీ కార్మికులపై జరిగిన దాడులకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలనసాగుతోందన్నారు.
నాటి ధృతరాష్ట్రుడి పాలనలో ద్రౌపతికి జరిగిన అన్యాయం నేడు తెలంగాణలో మహిళా ఆర్టీసీ కార్మికులకు జరిగింది. మహిళల హక్కులను కాలరాసే విధంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారులందరిపైన ఇండియన్ పీనల్ కోడ్‌లో మహిళలను వేధిస్తే ఏ శిక్షను వేస్తారో ఆ శిక్షను వెంటనే అమలు పరచాలన్నారు. గతంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెలామణి అయిన శ్రీనివాస్ గౌడ్ నేడు మంత్రి పదవి రాగానే.. ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ సంఘాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించి కార్మిక సంఘాలలో చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. మీ మంత్రి పదవుల కోసం కార్మిక సంఘాల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉద్యోగ, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మీ పోరాటానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కార్మిక, ఉద్యోగ సంఘాలకు ఎల్లప్పుడూ సహకరిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment