బలహీనపడుతున్న లెహర్ అయినా అలర్‌‌ట | The faltering Lehar alarta | Sakshi
Sakshi News home page

బలహీనపడుతున్న లెహర్ అయినా అలర్‌‌ట

Published Thu, Nov 28 2013 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

The faltering Lehar alarta

=దిశ మార్చుకున్న తుపాను
 =మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
 =ఇంకా ప్రమాదం పొంచిఉంది: కలెక్టర్
 =నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను దిశమారినప్పటికీ జిల్లాకు ముప్పు పొంచి ఉంది. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నా..దాని ప్రభావం విశాఖపై కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దాని ఛాయలు కనిపించనప్పటికీ గురువారం తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 180 నుంచి 200 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. ఈమేరకు అధికారులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్ లిఫ్టింగ్ కోసం రెండు హెలికాప్టర్‌లను కూడా రప్పించారు. గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
 
మండలాలకు బృందాలు : తుపాను ప్రభావ మండలాలకు నియమించిన జిల్లా స్థాయి ప్రత్యేకాధికారులతో పాటు
మండల స్థాయి అధికారులు గ్రామాల్లోనే ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా మండల కేంద్రాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనిస్తున్నాయి. అధికారులు గ్రామస్తులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. 120 మందితో కూడిన ఆర్మీ బృందం గురువారం తెల్లవారుజామున జిల్లాకు చేరుకోనుంది. వీరితో పాటు 20 నావికాదళ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖకు చెందిన 20 బృందాలు కూడా మండలాల్లో మకాం వేశాయి.
 
పునరావాస కేంద్రాలకు ససేమిరా : లెహర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో 55 గ్రామాలను తరలించాలని అధికారులు భావించారు. బుధవారం నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రయత్నించారు. అయితే జనం కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా అంత ప్రమాదకరంగా లేకపోవడంతో అధికారులు కూడా ప్రజలపై ఒత్తిడి తీసుకురావడం లేదు.

ఏ మాత్రం వర్షాలు పడినా వెంటనే వారినితరలించడానికి వీలుగా వాహనాలను కూడా సిద్ధం చేశారు. వెళ్లని వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. అధికారులు హెచ్చరించినా కొందరు మత్స్యకారులు బుధవారం వేటకు వెళ్లారు. ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోట్లు చాలా వరకు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా 40 బోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా బోట్ల యాజమాన్యాలతో అధికారులు మాట్లాడి వాటిని వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
 
లక్ష గోనె సంచెల్చు : ఇటీవల వచ్చిన వరదలకు మూడు రిజర్వాయర్ల పరిధిలో గట్లకు గండ్లు పడ్డాయి. వాటికి ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. లెహర్ తుపాను కారణంగా భారీ వర్షాలు సంభవిస్తే మరోసారి గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాల మేరకు అధికారులు లక్ష గోనె సంచులను కొనుగోలు చేశారు. వాటిని జిల్లాలోని అయిదు నీటి పారుదల శాఖ సర్కిళ్లకు పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement