జోరు తగ్గిన లెహర్ అయినా..అటెన్షన్
Published Thu, Nov 28 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:లెహర్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమయింది. నష్టాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపట్టింది. తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్ శోభ పర్యటించి మత్స్యకారుల్లో అవగాహన కల్పించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఆరు తీర ప్రాంతాలకు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. అనుబంధంగా 19 గ్రామాలకు సైతం మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. జిల్లావ్యాప్తంగా 34 పునరావాస కేంద్రాలను గుర్తించారు. వీటిలో 14 తీరప్రాంత గ్రామాల్లో ఉన్నాయి. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభావం అంతంత మాత్రమే...
లెహర్ తుఫాన్ ప్రభావం జిల్లాపై తక్కువగా ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లెహర్ మచిలీపట్నం వైపు కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. గురువారం మధ్యాహ్నానికి తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రకటించిన విధంగా గంటకు 200కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం లేదు.
అధికారులకు సెలవులు రద్దు
తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అధికారులకు సెలవులు రద్దు చేశారు. వీఆర్వో స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో 08963-221006, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 08922-236947, కలెక్టరేట్‌లో 08922-236947 నంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఫిర్యాదులు స్వీకరించేందుకు 08922-222942 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటల పాటూ అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేకాధికారుల నియామకం
భోగాపురం మండలంలోని చేపలకంచేరు గ్రామానికి జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, కొంగవానిపాలేనికి డ్వామా పీడీ ఎస్.అప్పలనాయుడులను నియమించారు. పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి మెప్మా పీడీ రమణ, కోనాడకు డీఆర్‌డీఏ పీడీ ఎన్.జ్యోతి, చింతపల్లికి హౌసింగ్ ఈఈ నారాయణస్వామి, కొల్లాయి వలస గ్రామానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి, పతివాడకు డీసీసీబీ సీఈఓ శివశంకర్ ప్రసాద్‌లను నియమించారు.
జేసీబీలు సన్నద్ధం.
వర్షాలు, ఈదురు గాలులు వస్తే రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడానికి వీలుగా ఆర్‌అండ్‌బీ అధికారులు జేసీబీలను సిద్ధం చే శారు. అలాగే నీరు బయటకు వచ్చే అవకాశం ఉన్న చెరువులకు గండ్లు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వాగులు పొంగి నీరు ప్రవహించే సమయంలో రాకపోకలు సాగించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ ప్రయాణాలు రద్దుచేసుకోవాలని కోరారు. సముద్రంలోకి వెళ్లిన 116 బోట్లు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement