=అన్నదాతపై ప్రకృతి పగ
=మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్..
=ముంచుకొస్తున్న మరో ముప్పు
=అంతటా కమ్ముకున్న మేఘాలు
=అక్కడక్కడా చిరు జల్లులు
యలమంచిలి, న్యూస్‌లైన్: అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు తుపాను ముంచుకొస్తోంది. మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్‌కు వర్షాలు ముంచెత్తడంతో రైతులు కుదేలయ్యారు. మరో ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా నష్టాలను చవిచూస్తున్న తాము ఈ గండం నుంచి గట్టెక్కడమెలా అని కలవరపడుతున్నారు. శనివారం వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి.
అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తుపాన్లు రైతులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల్లో రెండు తుపాన్లు,అల్పపీడనం ఒకదాని వెంట ఒకటి అన్నదాతలను నిలువునా ముంచేశాయి. ఫై-లీన్ ప్రభావం పెద్దగా లేనప్పటికీ జిల్లా రైతాంగాన్ని అల్పపీడనం కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత హెలెన్‌తో కుదేలయ్యారు. మళ్లీ లెహర్ అన్నదాతలను భయపెడుతోంది. దీని ప్రభావం హెలెన్ కంటే తీవ్రంగా ఉంటుందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
నెలరోజులుగా వీరికి కంటిమీద కునుకు ఉండటంలేదు. పంటపొలాల్లోని వరద నీటిని బయటకు తరలించడానికి, వాలిపోయిన, నీటమునిగిన వరిని నిలబెట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో 27,285 హెక్టార్లలో ఆహార పంటలు, 1132 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. ఇంకా పంట నష్టం అంచనా పూర్తికాకుండానే మూడు రోజుల క్రితం హెలెన్ హడలెత్తించింది. జిల్లాలో పెద్దగా వర్షం పడనప్పటికీ, ఈదురు గాలులకు కోత దశలో వరిపంట నేలకొరిగింది.
ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా సాంబమసూరి, ఆర్‌జీఎల్ వరి రకాలను చేపట్టారు. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ ఈ పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 50శాతం పంటను రైతులు కోల్పోయినట్టే. ఇప్పటికే ఏజన్సీతో పాటు మైదానంలో వరి కోత దశలో ఉంది. పలు ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. హెలెన్ కారణంగా కోతలుపూర్తయి. పొలాల్లో ఉన్న వరిపనలు నీటమునిగాయి. వరితోపాటు చెరకు, పత్తి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ గాయం నుంచి తేరుకునే ప్రయత్నంలో రైతులు ఉండగా లెహెర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరో గండంరైతు గుండెల్లో లెహర్రర్
Published Mon, Nov 25 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement