
టెక్సాస్: అన్నదాత చారిటీస్ సంస్థ నెల వారీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శనివారం (జూన్ 15) ఆయన మాట్లాడుతూ.. 'ప్రముఖ సంఘ సేవకుడు భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ‘అన్నదాత’ ను 2011లో స్థాపించారని అన్నారు. అటు భారత్ లోను ఇటు అమెరికాలోను అన్నార్తులకు ఆపన్న హస్తం అందించే ఒక పెద్ద సంస్థగా ఎదగడం సంతోషదాయకమన్నారు. డాలస్, ఫోర్టువర్త్ నగరాలలో నేపాల్, భూటాన్, బర్మా లాంటి దేశాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది శరణార్థులకు ప్రతి నెలా మూడో శనివారం నిత్యావసర వస్తువులను అందజేయటం అభినందనీయమన్నారు.
సాటి మనిషికి సాయం చేయాలనే మానవతావాద దృక్పధం ఉన్నతమైనదని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు పూర్ణా నెహ్రు మాట్లాడుతూ కేవలం నిత్యావసర వస్తువులే గాక దుస్తులు, కుట్టు మెషిన్లు, కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ చేస్తూ అర్హులైన వారికి తగు తర్ఫీదు ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. అన్నదాత చారిటీస్ వ్యవస్థాపకుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు వందల డాలర్ల ఖర్చుతో స్థాపించబడిన సంస్థ ఇప్పుడు నెలకు 5,000 డాలర్ల వ్యయంతో 200 మందికి పైగా సహాయపడే విధంగా ఎదగడం ఆనందదాయకమన్నారు.
ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ (ఫ్రిస్కో నగరం), షిరిడీ సాయిబాబా టెంపుల్ (ప్లానో నగరం), షిరిడీ సాయిబాబా మందిర్ (ఇర్వింగ్ నగరం) యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్న స్వచ్చంద సేవకులు రాజా రెడ్డి, పూర్ణా నెహ్రు, ప్రసాద్ గుజ్జు, రజని, సురేష్, అర్జున్, పులిగండ్ల విశ్వనాధం, మురళి తుమ్మల, శంకరన్, వివేక్ దత్త, శివాజీ, మీనా శర్మ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.