వానమ్మా .. వేల వందనాలమ్మా..
* వానలతో అన్నదాతల్లో ఆనందం..
* పంటపొలాల్లో సందడి..
జగదేవ్‌పూర్: చినుకు చిందేయడంతో అన్నదాతల్లో అనందం అంబరాన్నంటుతోంది. పంటపొలాల్లో సందడి ప్రారంభమైంది. వ్యవసాయ పనుల్లో ఇంటల్లిపాది తలమునకలయ్యారు..వానమ్మ వానమ్మా..నీకు వేల వేల వందనాలమ్మా అంటూ పల్లె జనం పదం కలుపుతూ వడివడిగా నాట్లు వేస్తున్నారు..
చినుకు చిందేసింది. నెలతల్లి పూర్తిగా తడిపేసింది. అన్నదాతను అనందంలో ముంచేసింది. పుడమి వాకిట కొత్త బంగారులోకాన్ని సృష్టిస్తూ ఏరువాకకు సాగమని అప్పగించింది. నాలుగు రోజులుగా పడుతున్న ఖరీఫ్ వర్షాలతో రైతన్న ఉత్సాహంతో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నడం నాట్లు వేయడం, గట్లు సిద్దం చేసుకొవడం ఇలా ఎవుసం పనులతో ఉత్సాహపూరితంగా సాగుతున్నారు. ముసురు పడుతునే పంట చేలలో కూలీలు మునుము కొనసాగిస్తున్నారు. ఓ వైపు కలుపు, మరో వైపు నాట్లు పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే చిన్నారులు సైతం కన్నవాళ్లకు అసరాగా ఎవుసం పనుల్లో మేం సైతం అంటూ పాల్గొంటున్నారు.