లెహర్ దడ
Published Mon, Nov 25 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
అమలాపురం, న్యూస్‌లైన్ :‘హెలెన్’ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోని జిల్లాను మరో తుపాను గండం తరుముకొస్తోంది. అసలే కుదేలైన జిల్లావాసులను..‘లెహర్ ’ తుపాను విరుచుకుపడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక పిడుగుపాటులా భయకంపితులను చేస్తోంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన లెహర్ మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈనెల 28న తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమకు మరో తుపాను ఎదుర్కొనే శక్తిలేదని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. తాజా తుపాను మరింత బలపడితే తీరం వెంబడి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది. తుపాను కనుక ఈప్రాంతంలో ప్రభావం చూపిస్తే ఈసారి నష్టం అంచనాలకు అందనంతగా ఉంటుందని అధికార యంత్రాంగం కలవరపడుతోంది. హెలెన్ తుపాను ప్రభావంతో 110 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులే కోనసీమ రూపురేఖలను, అన్నదాతల తలరాతలను మార్చివేశాయి. ఈ సమయంలో లెహర్ తుపాను దాడి చేస్తే జిల్లా మరింత అతలాకుతలమవుతుంది.
తిప్పలు పడుతుండగానే..
హెలెన్ తుపాను కొట్టిన దెబ్బ నుంచి జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. గ్రామాల్లో రహదారులపై పడ్డ చెట్లను తొలగించడంతో అన్ని గ్రామాలకూ రెండు రోజుల తరువాత రాకపోకలు మొదలయ్యాయి. అయినప్పటికీ కోనసీమలోని అమలాపురం మున్సిపాలిటీ, రావులపాలెం, రాజోలుతో పాటు కొన్ని మండల కేంద్రాలకు మినహా మిగిలిన ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. ఇప్పటికీ కోనసీమలో 275 గ్రామాలు చిమ్మచీకట్లో మగ్గుతున్నాయి. వరి రైతులు పంటపై ఆశలు వదులుకోగా, కొబ్బరి రైతులు తోటల్లో పడిపోయిన చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ప్రభుత్వాధికారులు వచ్చి నష్టం నమోదు చేసుకునే అవకాశం ఉందని పడిపోయిన ఇళ్లను సరి చేసుకునేందుకు ప్రయత్నించని బాధితులు సామాన్లను మాత్రం మరోచోటకు తరలిస్తున్నారు.
సతమతమవుతున్న అధికారులు
మరోవైపు అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. తుపాను ప్రత్యేకాధికారి ఎం.రవిచంద్ర, కలెక్టర్ నీతూ ప్రసాద్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కోనసీమలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం నమోదు, ఇళ్ల నష్టాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలనుపై సమీక్ష జరిపారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనాలు సైతం పూర్తి చేయలేని పరిస్థితుల్లో మరో తుపాను ముప్పు పొంచి ఉండడం అధికార యంత్రాంగానికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. హెలెన్ నష్టం నమోదును పక్కనబెట్టి, లెహర్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాల్సి రావడంతో సతమతమవుతున్నారు.
మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొద్దిరోజులుగా వేటలేక పూట గడవని దుస్థితిలో అవస్థలు పడుతున్న మత్స్యకారులకు తాజా హెచ్చరికలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. లెహర్ తుపాను ప్రభావంపై తీరప్రాంత మండలాల్లోని గ్రామాల్లో టాంటాం వేయించాలని ఆయా తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమె కాట్రేనికోన మండలం చిర్రయానాం, నీళ్లరేవు, పల్లంకుర్రు గ్రామాల్లో పర్యటించి హెలెన్ తుపాను నష్టాన్ని పరిశీలిస్తూనే రాబోయే లెహర్ తుపాను వల్ల నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లావాసులకు.. ముఖ్యంగా తీరప్రాంతాల వారిని కంటికి కునుకు పట్టనివ్వని భీతి వెన్నాడుతోంది.
Advertisement
Advertisement