కళింగపట్నానికి 980 కి.మీ. దూరంలో తుపాను
పెను తుపానుగా మారే అవకాశం
గురువారం నాటికి తీరం దాటే అవకాశం
గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు
నేడు భారీ వర్షాలు కురిసే సూచనలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను దూసుకొస్తోంది. ఇది పెను తుపానుగా మారొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లెహర్ మరింత బలపడితే ఇటీవల ఏర్పడిన పైలీన్, హెలెన్ తుపాన్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్ తుపాను సోమవారం రాత్రి నాటికి కళింగపట్నం తీరానికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అది ప్రస్తుతం తీవ్ర తుపానుగా ఉందని, మంగళవారం మధ్యాహ్నానికి.. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్ని బట్టి అది మరింత బలపడే అవకాశం ఉందని అంచనాకొచ్చారు. ప్రస్తుతం లెహర్ తుపాను పశ్చిమ వాయవ్యంగా కదులుతోందని, మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కు వచ్చేస్తే మంచిదని సూచించారు. లెహర్ కారణంగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అక్కడక్కడ భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాజాగా బులెటిన్ విడుదల చేశారు. బుధ, గురువారాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, గుడిసెలు ధ్వంసం కావడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడం, సమాచార వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడడం, వరదలు ఏర్పడే అవకాశం ఉంటుందని సూచించారు. వ్యవసాయానికి భారీగా నష్టం వాటిల్లవచ్చని అంచనా వేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టులకు వార్నింగ్ సిగ్నల్ నెంబర్-2తోపాటు సెక్షన్ సిగ్నల్ నెంబర్ 3, 5లను సూచించారు.
వరుస తుపాన్లు ఎందుకొస్తున్నాయి?
నెలరోజుల వ్యవధిలో వరుసగా పైలీన్, హెలెన్, లెహర్ తుపాన్లు దూసుకురావడానికి గల కారణాల్ని అధికారులు విశ్లేషిస్తున్నారు. తూర్పు తీరంలో తూర్పు దిశ నుంచి భారీగా గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. తుపాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలిస్తుండడం, పసిఫిక్ నుంచి బంగాళాఖాతానికి, కొన్నిసార్లు మలేసియా నుంచి గాలులు వీస్తుండడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. 1950కి ముందు ఇలాగే వరుస తుపాన్లు వచ్చేవని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. గత తుపాన్లన్నీ బంగాళాఖాతంలో తొలుత అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారేవి. లెహెర్ మాత్రం అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండగా మారి వెనువెంటనే తుపానుగా మారిపోయిందని మురళీకృష్ణ తెలిపారు
.
వర్షపాతం ఎక్కడెక్కడ?
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చిత్తూరులో 4సెం.మీ, మదిర, తిరుపతి, బాపట్ల, దర్శిలో 3సెం.మీ, గుడివాడ, బోధన్, నూజివీడు ప్రాంతాల్లో 2 సెం.మీ. చొప్పున వర్షాలు పడ్డాయి. మంగళవారం సాయంత్రం లోపు నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగానూ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అప్రమత్తంగా ఉండండి
లెహర్ తుపాను నేపథ్యంలో మందుస్తుగా సహాయ, పునరావాస చర్యలకు ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కోస్తా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుపాను సంసిద్ధతపై కోస్తా 9 జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సి.పార్థసారథి వివరాలు వెల్లడించారు. ఈ నెల 28న లెహర్ తుపాను కాకినాడ వద్ద తీరం దాటనుందని, ఈ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే 4 హెలికాప్టర్లను మోహరించామన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను మంగళవారం నుంచి సురక్షిత ప్రాంతాలను తరలిస్తామన్నారు. మొత్తం 32 ప్రకృతి విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించినట్టు చెప్పారు.
దూసుకొస్తున్న ‘లెహర్’
Published Tue, Nov 26 2013 12:57 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM
Advertisement
Advertisement