పెను ప్రళయం సృష్టించనున్న లెహర్
లెహర్ తుఫాను పెను ప్రళయం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. దీని ప్రభావం వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు ఉందని, ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలపై తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని చెప్పారు. ఇంకా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు తదితర జిల్లాలపైనా తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు. దీని ప్రభావం వల్ల రేపు సాయంత్రం నుంచే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తుఫాను తీరం దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టిస్తుందని చెప్పారు. భారీగా పంట నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు, రైలు రవాణాపై నియంత్రణ అవసరమని, శ్రీకాకుళం, రణస్థలం తదితర ప్రాంతాలపై లెహర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో అధికారులందరినీ ఆయన అప్రమత్తం చేశారు.
ఇక విశాఖ జిల్లా యంత్రాంగం కూడా తుఫాను ముప్పు బారి నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వ సన్నద్ధం అవుతోంది. లెహర్ నేపథ్యంలో విశాఖ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను తీరం దాటుతుందని భావిస్తున్న 28వ తేదీన పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటించారు. ఆర్మీ, నేవీ బృందాలను అప్రమత్తం చేశారు. దాదాపు 48 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పెను గాలుల వల్ల కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతినకుండా చూసేందుకు ముందుగానే సెల్ ప్రొవైడర్లతో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ సమావేశం నిర్వహించారు.
మరోవైపు లెహర్ తుఫాను నేపథ్యంలో రేపు రాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం 127 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 30 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌ల సాయం తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.