Cyclone Sitrang Hitting Coastal Area Close To Diwali - Sakshi
Sakshi News home page

భయపెడుతున్న తుఫాన్‌ సిత్రాంగ్‌.. దిశ మార్చుకుంటూ దడ పుట్టిస్తోంది!

Published Wed, Oct 19 2022 9:35 AM | Last Updated on Wed, Oct 19 2022 11:05 AM

Cyclone Sitrang Hitting Coastal Area Close To Diwali - Sakshi

భువనేశ్వర్‌: సిత్రాంగ్‌ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్‌ బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. తుఫాన్‌ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్టోబరు నెలలో పలు తుపానులు ఇప్పటికే ఇక్కడి ప్రజల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ భయంతోనే సిత్రాంగ్‌ తుపాను ఎటువంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

దీనిపై విపత్తు నిర్వహణ యంత్రాంగం సకాలంలో స్పందించేందుకు వాతావరణ విభాగం అనుక్షణం తాజా సమాచారం ముందస్తుగా జారీ చేస్తుంది. ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొంటోంది. తుపాను ముఖచిత్రం ఇంకా స్పష్టం కానందున సిత్రాంగ్‌ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టం కాలేదని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. ఇదిలాఉండగా ఈనెల 25వ తేదీ నాటికి సిత్రాంగ్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ జీఎఫ్‌ఎస్‌ మంగళవారం ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌) సంస్థ సిత్రాంగ్‌ తుపాను రాష్ట్రంలో బాలాసోర్‌ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. 
  
అత్యవసర సమావేశం 

విపత్తు నిర్వహణ విభాగం సిత్రాంగ్‌ తుపాను తీవ్రత నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా తుపాను తీరం దాటే సంకేతాలు క్రమంగా బలపడుతున్నట్లు ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 23వ తేదీ లేదా 24వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఖరారు అయ్యే సంకేతాలను ఈ కేంద్రం జారీ చేసింది. దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఏర్పడిన వాయుగుండం (సైక్లోనిక్‌ సర్క్యులేషన్‌) మంగళవారం నాటికి ఘనీభవించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తాండవిస్తుంది. 

దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఫలితంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈనెల 23వ తేదీ వరకు వర్షం కురుస్తుంది. ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి ఈ వాతావరణం తుపానుగా పరిణతి చెందుతుందని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ డాక్టరు మృత్యుంజయ మహాపాత్రో వెల్లడించారు. ప్రస్తుతానికి అల్ప పీడన ప్రాంతం స్పష్టం కానందున తుపాను తీవ్రత, తీరం దాటే ప్రాంతం వివరాలు ధ్రువీకరించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. తుపాను కదలికపై అనుక్షణం నిఘా వేసి ఉన్నట్లు తెలిపారు. క్రమంగా తుపాను వాతావరణం బలపడుతున్నందున గాలుల వేగం పుంజుకుంటుంది. ఈనెల 22వ తేదీ నుంచి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో వీచే గాలుల తీవ్రత గంటకు 65 కిలో మీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలిపారు.  
  
సమావేశం నిర్వహణ 

బెంబేలెత్తిస్తున్న సిత్రాంగ్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యేక సహాయ కమిషనర్‌ ఇన్‌చార్జి సత్యవ్రత సాహు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తుపాను తాకిడి ప్రతిపాదిత తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ వర్గం ఓస్డమా కార్య నిర్వాహక అధికారి జ్ఞానదాస్‌ తెలిపారు. దక్షిణ అండమాన్‌ సాగరం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఆవిర్భవించిన వాయుగుండం రానున్న 48 గంటల్లో మరింత ఘనీభవించి బుధవారం లేదా గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన క్షేత్రం స్పష్టమయ్యే సంకేతాలు బలపడుతున్నట్లు వాతావరణ విభాగం ముందస్తు సమాచారం జారీ చేసిందని జ్ఞానదాస్‌ వివరించారు.

అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ కేంద్రీయ, కేంద్ర బంగాళాఖాతం గుండా కదలిక పుంజుకుంటుంది. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో వానలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి అల్పపీడనం తుపాను రూపురేఖలు స్పష్టం అవుతాయని పేర్కొన్నారు. అల్పపీడనం స్పష్టమైతే తప్ప తుపాను తాకిడి, తీవ్రత వివరాలను అంచనా వేయడం అసాధ్యమని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement