జపాన్‌లో భూకంప తీవ్రతకు పగుళ్లిచ్చిన రోడ్లను చూస్తున్న జనం
టోక్యో: ద్వీప దేశమైన జపాన్‌లో నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం సంభవించింది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటల తరువాత పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి.
తొలుత సాయంత్రం 4.06 గంటల ప్రాంతంలో మొదలైన ప్రకంపనలు 4.32 గంటల వరకు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రత సాయంత్రం 4.10 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. భూకంపం దాటికి సముద్రంలో ఐదు అడుగుల మేర అలలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. పశి్చమ కోస్తా తీరంలోని ఇషిగావా, నిగాటా, టొమయా జిల్లాలకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ఇషిగావాకు మేజర్ సునామీ హెచ్చరిక, మిగిలిన పశి్చమ తీర ప్రాంతానికి తక్కువ తీవ్రత కలిగిన సునామీ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని గంటల తర్వాత సముద్రంలో అలల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సాధారణ సునామీ హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తీర ప్రాంతాల్లోని జనం తక్షణమే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించింది. నిగాటా, టొమయాలో 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రధాని కిషిడా చెప్పారు.
శిథిలాల కింద బాధితులు!
ఇషిగావా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. రాజధాని టోక్యోతోపాటు కాంటో ఏరియాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అధికారులతో పాటు సైన్యమూ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఉభయ కొరియాలతో పాటు రష్యాలోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బాధితులకు సమాచారం, సహాయం అందించేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment