- ప్రభుత్వ విధానాలతో రైతన్నకు నష్టం
- మాఫీ కాని పాత రుణాలు
- కొత్త రుణాలివ్వని బ్యాంకులు
- రైతులు ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు
- ముగియనున్న గడువు
శ్రీకాకుళం అగ్రికల్చర్: తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతన్న పాలిట శాపంగా మారాయి. రుణమాఫీపై వ్యవహరిస్తున్న కప్పదాటు వైఖరి పంటల బీమాపై ధీమా లేకుండా చేస్తోంది. రైతులు తీసుకున్న పంట రుణాలు ఇంకా మాఫీ కాకపోవడం, బకాయిలను లబ్ధిదారులు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా ఖరీఫ్ పంటలకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతోంది. పంట బీమా కావాలంటే రైతులే సొంతంగా ప్రీమియం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ఈ నెల 15వ తేదీ వరకే గడువు ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇదీ సంగతి..
ప్రకృతి వైఫరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు రుణం తీసుకున్న వారికి ఈ పథకం దానంతట అదే వర్తిస్తోంది. రుణం తీసుకోని పక్షంలో రైతు సొంతంగా ప్రీమియం చెల్లించాలి. పంట సాగుకు ముందే ప్రీమియం చెల్లించాల్సి ఉండడంతో చాలామంది రైతులు ముందుకు రావడం లేదు. సాగు మదుపులకే అప్పులు చేస్తున్న తరుణంలో మళ్లీ వీటన్నింటికీ పెట్టుబడి పెట్టాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నదాత వాపోతున్నాడు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. రుణ మాఫీపై ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో బకాయిలున్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పంటల బీమా పథకం వర్తించే అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితిలో సొంతంగా బీమా ప్రీమియం చెల్లించడం వారికి భారంగా పరిణమిస్తోంది.
అటు ప్రభుత్వ విధానాలు, ఇటు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు జూలై 30వ తేదీ వరకే గడువు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా సమయూన్ని ఈ నెల 15వ తేదీ వరకూ పొడిగించారు. మరోసారి గడవు పొడిగించినా.. లేకపోరుునా రైతులు మాత్రలు జాగ్రత్త పడాలని, వెంటనే ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కౌలు రైతులదీ అదే పరిస్థితి
బీమా పథకం వర్తింపులో కౌలు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. రెవెన్యూ అధికారులు రుణ అర్హత కార్డులు ఇస్తేనే బీమా ప్రీమియం చెల్లించేందుకు వారికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంతవరకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయలేదు. ఫలితంగా కౌలు రైతులు సొంతంగా ప్రీమియం చెల్లించే పరిస్థితుల్లేవు.
‘బీమా’కు రుణమాఫీ గండం!
Published Sat, Sep 6 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM
Advertisement