
చిక్కిపోయిన రబీ
నిండుకున్న నీటి నిల్వలు
రుణాలివ్వని బ్యాంకర్లు
అప్పులు పుట్టక అవస్థలు
సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం
బోర్ల కింద ఆయకట్టు సాగుకు దూరం
10 వేల ఎకరాలకు మించని వరి
అపరాల పరిస్థితీ అంతే
అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఒక వైపు హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడింది. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. మరో పక్క వరుణుడు ముఖం చాటేయడంతో చుక్కనీరు లేని పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం చిన్నచూపు, బ్యాంకర్ల వివక్షతల కారణంగా చిల్లగవ్వ కూడా అప్పు పుట్టని పరిస్థితి. ఇలా ముప్పే టి దాడితో రైతన్నలు రబీకి సాగుకు రాంరాం చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి రబీ జాడ కనుమరుగైపోయింది.
విశాఖపట్నం: జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం1.35లక్షల ఎకరాలు. వీటిలో 35వేల ఎకరాల్లో వరి సాగవుతుంటే, 70వేల ఎకరాల్లో అపరాలు, 10వేల ఎకరాల్లో వేరుశనగ, 10వేల ఎకరాల్లో మొక్క జొన్న, 5వేల ఎకరాల్లో నువ్వులు సాగవుతుంటాయి. మరో ఐదారువేల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తుంటారు. ఏటా సుమారు 50వేల మందికి పైగా రైతులు రెండవ పంట వేస్తుంటారు.
సీజన్ ముగుస్తున్నా..
సాధారణంగా అక్టోబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే రబీ సీజన్ ఫిబ్రవరితో ముగుస్తుంది. వరైతే డిసెంబర్‌లో నారుమళ్లు పోసి జనవరిలో ఊడుస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా కనీసం 30 శాతం వరి ఊడ్పులు కూడా పూర్తి కాలేదు. అపరాల మాత్రమే 65 శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఇక ఇతర పంటలసాగు ఎక్కడా కనిపించడం లేదు. రబీలో 35 వేలఎకరాలకుపైగా వరిసాగవ్వాల్సి ఉండగా ప్రస్తుతం అతికష్టమ్మీద 10వేల ఎకరాలు కూడా దాటలేదు.
ఇక అపరాలైతే 70వేల ఎకరాలకు 40వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి. మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు పంటలైతే రబీ సీజన్‌లో 40వేల ఎకరాలకు 15వేల ఎకరాలకు మించలేదు. మొత్తంమీద లక్షా 25 వేల ఎకరాలకు 65వేల ఎకరాలకు మించి రబీ సాగు జరగడం లేదు. ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యుత్ సరఫరా లేకే..
జిల్లాలో 20 వేలకు పైగా ఇరిగేషన్ బోర్‌వెల్స్ ఉన్నాయి. వీటి కిందే ఏకంగా లక్ష ఎకరాల వరకు సాగవుతుంటుంది. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా జనవరి వరకు వీటికి విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో వీటి కింద సాగయ్యే ఆయకట్టు ప్రస్తుతం రెండవ పంటసాగుకు దూరమైపోయింది. మరో పక్క అక్టోబర్ తర్వాత కనీస వర్షపాతం కూడా నమోదుకాలేదు. రెండవ పంట పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. మిగులు నీరు ఉంటేనే రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు అనుమతిస్తారు.
ముఖం చాటేసిన బ్యాంకర్లు
ఒక పక్క హుద్‌హుద్ దెబ్బకు గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్ డామ్‌లు, కాలువలు, చెరువుల గట్లు దెబ్బతినడంతో రబీసాగుకు సరిపడా నీటి నిల్వలు నిండుకున్నాయి. మరో వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా రుణమాఫీ పుణ్యమాని బ్యాంకర్లు పూర్తిగా ముఖం చాటేయడంతో అప్పుపుట్టడం లేదు. దీంతో రబీ సాగుకు దూరంగా ఉండడమే మేలని మెజార్టీ రైతులు నిర్ణయించుకున్నారు.