అవసరానికి మించి ఎరువులను వాడడం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్నాయి. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు నేల పరిస్థితి. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని వదిలేశారు. ఈ పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది. దాన్ని వదిలి, వరి లేదా గోధుమ పంటలకే పరిమితమయ్యారు.
వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం–ప్రణామ్ పేరుతో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ పోషకాల వాడకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. పర్యావరణానికి హాని కలిగిస్తున్న రసాయన ఎరు వుల స్థానంలో సేంద్రీయ, జీవ సంబంధిత ఎరువులను వాడే మంచి ఉద్దేశంతో మొదలైందీ పథకం. అవసరానికి మించి ఎరువులను వాడటం వల్ల నేలలోని పోషకాలు క్షీణిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదం హరిత విప్లవం మొదలైన పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే తీవ్రంగా ఉండటం గమనార్హం. వృద్ధులైన వాళ్లు ప్రమాదకరమైన స్టెరాయిడ్లపై బతుకుతున్నట్లు ఉందిప్పుడు ఈ రాష్ట్రాల్లోని నేల పరిస్థితి. పని జరుగుతూంటుంది కానీ, నేల డొల్లగా మారిపోతూ ఉంటుంది. నేల సామర్థ్యం, పంట దిగుబడులు క్రమేపీ తగ్గిపోతాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ నేల పరిస్థితి ఇలాగే ఉందనడంలో సందేహం ఏమీ లేదు.
ప్రమాదకరమైన రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ, జీవ సంబంధిత ఎరువులను వాడేందుకు ప్రభుత్వం పీఎం–ప్రణామ్ పథకాన్ని ప్రారంభించడం ఆహ్వానిందగ్గ పరిణామమే. కానీ, అమ లుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, ఈ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం. ప్రస్తుతం రైతులకు అందించే ఎరువుల సబ్సిడీలోంచే ఈ పథకానికి కావాల్సిన మొత్తాలను సర్దుకోవాలి.
ఇందుకు తగ్గట్టుగా సహజసిద్ధమైన ఎరువు లను వాడేలా రైతులను ప్రోత్సహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్రం ఆశిస్తోంది. ఇలా మిగిల్చిన ఎరువుల సబ్సిడీ మొత్తంలో యాభై శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందివ్వనుంది. ఈ మొత్తాలతో సహజ ఎరువులపై అవగాహన పెంచడం, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేపట్టాలి.
రాష్ట్రాలకు ఈ మార్పును సమర్థంగా అమలుచేయగల సత్తా ఉందా? భారీ స్థాయిలో సహజ ఎరువులు వాడేలా చేయగలదా? అలాంటి సూచనలు ఇప్పటికైతే ఏమీ కనిపించలేదు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం, సహజ ఎరువుల రంగం పూర్తిగా నిరక్ష్యానికి గురైంది. నియంత్రణల్లేవు. అసంఘటితంగా ఉంది.
కేంద్రం సహజ ఎరువులను ప్రోత్సహించేందుకు అందిస్తున్న నిధులు చాలావరకూ మురిగిపోతున్నాయి. సహజ ఎరువుల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది. పైగా ఉత్పత్తి అవుతున్న వాటి నాణ్యత కూడా నాసిగా ఉంది. చాలా రాష్ట్రాల్లో తగిన పరిశోధనాశాలలూ లేవు.
ప్రాంతీయ స్థాయిలోని ఆర్గానిక్ ఫార్మింగ్ లాబొరేటరీలను కూడా 2019–20 సంవత్సరంలో వాటి సామర్థ్యంలో మూడో వంతు మాత్రమే వినియోగించుకున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బయో ఫర్టిలైజర్ నమూనాల పరీక్షలు ఏటికేడాదీ పెరగాల్సింది పోయి తగ్గిపోతున్నాయి. 2013–14లో ఏడాదికి 654 నమూనాలు పరీక్షిస్తే, 2019–20లో ఈ సంఖ్య 483కు పడిపోయింది. అదే సమయంలో ఈ పరీక్షలను తట్టుకుని వాడకానికి సిద్ధమైన ఎరువుల శాతం ఒకటి నుంచి 44 శాతం కావడం గమనార్హం. అంటే నకిలీ బయో ఫర్టిలైజర్లు పెరిగిపోయాయన్నమాట.
పీఎం – ప్రమాణ్ పథకం మొత్తం రైతులు సహజ ఎరువుల వాడకానికి మొగ్గు చూపుతారన్న అంచనాపై మొదలైంది. లాభాలు లేని పక్షంలో రైతులు వీటి వాడకానికి ఎందుకు మొగ్గు చూపుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. సహజ ఎరువుల వాడకం వల్ల మట్టి ఆరోగ్యం పెరగాలి. సాగు, పంట ఖర్చులు తగ్గాలి. దిగుబడులు పెర గాలి. తద్వారా ఆదాయమూ ఎక్కువ కావాలి.
ఇప్పటివరకూ ఒక స్థాయి జీవనశైలిని అలవర్చుకున్న రైతులు ఇప్పుడు తక్కువ ఆదాయం, దిగుబడి వస్తుందంటే సహజ ఎరువులవైపు మళ్లే అవకాశా లుండవు. అందుకే ప్రభుత్వం సహజ ఎరువుల లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఉత్పత్తి, సరఫరాల సామర్థ్యాలను కూడా పెంచు కోవాలి. రసాయనిక ఎరువులకు దీటుగా దిగుబడి ఇవ్వగల సమర్థ మైన, నాణ్యమైన సహజ ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలి.
ఇవన్నీ చేసినప్పటికీ నేల సారాన్ని పెంచేందుకు, పునరుజ్జీవింప చేసేందుకు పీఎం – ప్రణామ్ సరిపోదు. ఎందుకంటే దేశంలో మట్టి సారం అంతగా దిగజారిపోయింది. రసాయనిక ఎరువుల వాడకంతో పాటు, అతిగా సాగు చేయడమూ దీనికి కారణం. దేశంలో హరిత విప్లవం మొదలైన రాష్ట్రాల్లో రైతులు పంట మార్పిడి పద్ధతిని ఎప్పుడో వదిలేశారు. ఈ పంట మార్పిడి పద్ధతి నేల, నీరు, ఎరువులను సమతుల పద్ధతిలో ఉపయోగించుకునేందుకు ఉద్దేశించినది.
దాన్ని వదిలే సుకుని వరి లేదా గోధుమ పంటలకు మాత్రమే పరిమితమయ్యారు! అప్పట్లో ప్రభుత్వానికి ఈ రెండు ధాన్యాల అవసరం ఎక్కువగా ఉండింది కాబట్టి ఆ పంటలు ఎక్కువ పండించేలా రైతులను ప్రోత్సహించింది. మొక్కజొన్న, చిరుధాన్యాలతో పోలిస్తే ఈ రెండు పంటలకూ నీటి అవసరం చాలా ఎక్కువ. వరి, గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమంటే నదీ, భూగర్భ జలాలను అతిగా వాడుకోవడమే. దీనివల్ల నీటి లవణత కూడా పెరిగి పోషకాలు తగ్గి పోతాయి.
అంటే ఈ సమస్య మూలం వరి, గోధుమల సాగులోనే ఉందన్నమాట. నైట్రోజన్ , ఫాస్పరస్, పొటాషియం, సేంద్రీయ కర్బనం, జింక్, ఐరన్ , మాంగనీస్ వంటి పోషకాలన్నీ కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. రైతులు వరి, గోధుమ పంటల సాగును తగ్గించుకుని వైవిధ్యభరితమైన ఇతర పంటలను సాగు చేయకపోతే రసాయన ఎరువులు, నీటిపై వారు మరింత ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి.
రైతులు మారాలంటే వారి పంటలకు కనీస మద్దతు ధర లభించాలి. ఏడు రకాల ధాన్యాలు, ఐదు పప్పులు, ఏడు నూనె గింజలు, నాలుగు వాణిజ్యం పంటలకు కేంద్రం ఏటా కనీస ధరను నిర్ణయిస్తూంటుంది. ఈ పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయనవసరం లేనప్పటికీ వాటికి కనీస మద్దతు ధరను నిర్ణయించడం అవసరం.
హరియాణాలో ఇటీవల పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రం క్వింటాల్‌కు రూ.6,400 కనీస మద్దతు ధర నిర్ణయించినా, ప్రైవేట్ వ్యాపారులు రూ.4,200కు మించి చెల్లించడం లేదన్నది రైతుల ఆరోపణ. ఇంకోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలు కొనుగోలు చేయడం నిలిపివేసింది. ఈ విషయమై రైతులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు పంటను క్వింటాల్‌కు రూ.4,800 ధర చెల్లించేందుకు ఒప్పుకుంది.
కనీస మద్దతు ధరకు, ఈ మొత్తానికి ఉన్న తేడాను తగ్గించేందుకు ప్రతి క్వింటాల్‌కు అదనంగా ఇంకో వెయ్యి రూపాయలు చెల్లించేందుకు సరేనంది. అయినప్పటికీ ఈ మొత్తం కనీస మద్దతు ధర కంటే ఆరు వందల రూపాయలు తక్కువగా ఉండటం గమనార్హం. రైతులు దీనికీ ఒప్పుకోకుండా చండీగఢ్ –ఢిల్లీ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆఖరుకు ప్రభుత్వం ధర ఇంకో రెండు వందల రూపాయలు పెంచింది.
ఈ విషయంలో రైతులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వారు తమ పొలాల్లో వేర్వేరు పంటలు వేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. పొద్దు తిరుగుడు పంటనే తీసుకుంటే, 2018–19లో కేవలం 9,440 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూండగా, 2020–21కి ఇది 12,290 హెక్టా ర్లకు పెరిగింది. ఆ తరువాతి సంవత్సరం 13,020 హెక్టార్లకు, 2022– 23 నాటికి 14,160 హెక్టార్లకు పెరగడం గమనార్హం. ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతులకు ఆకర్షణీయంగా ప్రకటించగలిగితే పొద్దుతిరు గుడు సాగు మరింత ఎక్కువగా జరిగేందుకు అవకాశముంది. అలాగే మొక్కజొన్న, చిరుధాన్యాల సాగు కూడా ఊపందుకుంటుంది.
అరుణ్ సిన్హా
వ్యాసకర్త ‘ఎగైనెస్ట్ ద ఫ్యూ:
స్ట్రగుల్స్ ఆఫ్ ఇండియాస్ రూరల్‌పూర్’ గ్రంథ రచయిత
(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment