సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అడవి కాకర (బోద కాకర) సాగుపై జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని శాస్త్రీయ నామం మైమోర్డికా డయాయిక కుకుర్బుటేసి. ఇవి సాధారణ కాకరకు అతిదగ్గర పోలికలుండగా రుచి వేరుగా ఉంటుంది. కాయ సుమారు 4 నుంచి 6 సెం.మీ. పొడవు, 30–40 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో అధిక పోషక విలువలుంటాయి. రక్తంలోని చక్కెర శాతం తగ్గడం, కంటిచూపు వృద్ధి చెందడం, క్యాన్సర్ నుంచి రక్షణ, మూత్రపిండాల్లోని రాళ్లని కరిగించడం, మొలలను నివారించడం, అధికంగా చెమట రాకుండా చేయడం, దగ్గు నివారణ, జీర్ణశక్తి పెంచడం వంటి ఉపయోగాలు అడవి కాకర వినియోగంతో ఉంటాయి.
జిల్లాలో సాగు ఇలా..
సీతంపేట, వీరఘట్టం, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో సుమారు 20 హెక్టార్లలో అడవి కాకరను సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. పదివేల నుంచి 20 వేల రూపాయల వరకూ ఖర్చువుతుండగా.. వెయ్యి నుంచి 1500 కిలోల దిగుబడి వస్తోంది. ఎకరా సాగు చేస్తే సుమారు రూ. 60 వేల నుంచి 80 వేల రూపాయల వరకూ రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంది. మామూలు రకంకంటే ఎక్కువ రుచి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
మేలైన రకాలు
ఇండియా కంకొడ (ఆర్‌ఎమ్‌ఎఫ్–37) రకాన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ రకం చీడపీడలను తట్టుకుంటుంది. దుంపలను నాటితే సుమారు 35– 40 రోజులకు, అదే విత్తనం ద్వారా 70–80 రోజుల కు పంట కోతకు వస్తోంది. మొదటి సంవత్సరంలో ఎకరాకు 4 క్వింటాళ్లు, రెండో ఏటా 6 క్వింటాళ్లు, మూడో సంవత్సరం 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోంది.
నేలల స్వభావం
ఇది ఉష్ణమండల పంట. అధిక దిగుబడికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉష్ణ ప్రాంతాలు అనుకూలం. ఒండ్రు ఇసుక కలిపిన ఉదజని సూచిక 5.5 నుంచి 7.0 ఉండి.. సేంద్రియ పదార్ధం అధికంగా ఉన్న నేలలు సాగుకు మేలు. ఆమ్ల, క్షార స్వభావం ఉండి, మురుగునీటి వసతి లేని చౌడునేలలు సాగుకు పనికి రావు.
నాటడం ఇలా..
ఎకరాకు 1.5 నుంచి 3 కిలోల విత్తనం లేదా 3000 నుంచి 5000 దుంపలు కావాలి. వేసవి, వర్షాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా వేసవి పంటను జనవరి–ఫిబ్రవరిలో, వర్షాకాలం పంటను జూలై–ఆగస్టు నెలల్లో నాటుతారు. దుంపలు నాటేందుకు ఫిబ్రవరి–మార్చి నెలలు అనుకూలం. 2–3 విత్తనాలు ఎత్తయిన మడుల మీద 2 సెం.మీ., దుంపలైతే 3 సెం.మీ. లోతులో వరుసల మధ్య 2 మీట ర్లు, వరుసల్లో మొక్కల మధ్య 70–80 సెం.మీ. దూరం ఉండేలా నాటుకోవాలి.
నీటి యాజమాన్యం: వర్షాకాలంలో నీటి అవసరం ఉండదు. బెట్ట పరిస్థితుల్లో 3–4 రోజులకోసారి పెట్టాలి. ఎక్కువ నీటిని పారిస్తే తీగలు చనిపోతా యి. మురుగునీరు నిల్వలేకుండా చూసుకోవాలి.
ఎరువులు: ఎకరాకు 6 నుంచి 8 టన్నులు బాగా కుళ్లిన సేంద్రియ ఎరువులు ఆఖరి దుక్కిల్లో చేయాలి. విత్తనం లేదా దుంపలు నాటేముందు ఎకరాకు 32 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 కిలోలో నత్రజనిని తీగ ఎగబాకే ముందు, మరో 24 కిలోల నత్రజనిని పూతకు ముందు భూమిలో వేసుకోవాలి.
కలుపు నివారణ: నాటిన 24 గంటల్లోగా పిండిమిథాలిన్ 5 మి.లీటర్లు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే కూలీలతో, యంత్ర పరికరాలతో కలుపుతీసి పోలాన్ని శుభ్రంగా ఉండాలి.
సస్యరక్షణ: అడవి కాకరను ఎక్కువగా పండు ఈగ లు, నులిపురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 20–30 ఫిరమోన్ ఎరలను అమర్చాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 1.5 మి.లీ. లేదా డైక్లోరావాస్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నులిపురుగుల నిర్ధారణకు 5 కిలోల పాసిలోమైసిస్, ట్రైకోడెర్మా హర్జియానం, పోచానియా వంటివి ఒక టన్ను పశువుల ఎరువు – 100 కిలోల వేపపిండి మిశ్రమా నికి కలిపి 15 రోజులు నీడలో ఉంచి వృద్ధిచేసి ఎకరా పొలానికి చేసుకోవాలి.
దిగుబడి మొదటి సంవత్సరం నాటిన 75–80 రోజుల్లో కోతకు వస్తుంది. రెండో సంవత్సరం మొలకెత్తిన 35–40 రోజుల్లో కోతకు వస్తుంది. కాయ లేతగా, ఆకుపచ్చని రంగులో ఉన్న ప్పుడే కోయాలి. ప్రతి రెండు రోజులకోసారి కాయలు తెంపాలి. ఆలస్యం చేస్తే కాయలు ముదిరి మార్కె ట్ విలువ తగ్గుతుంది. కాయలు తెంపేటప్పుడు తీగకు నష్టం కలుగకుండా చూడాలి. విత్తనం కోసమై తే కాయ పూర్తిగా పసుపు రంగుకు మారి, విత్తనం ఎరుపు రంగు వచ్చినప్పుడు కోయాలి. వీటిని మంచినీటిలో కడిగి నీడలో ఆరబెట్టి బూడిదతో కలిపి నిల్వ ఉంచుకోవచ్చు.
అవగాహన పెంచుకొని సాగు చేయాలి
అడవి కాకర సాగుపై రైతు లు ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత సాగు చేయాలి. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది.
– వై.రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానశాఖ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment