సర్కారు సూచనలతోనే సాగు! | Experts Say Telangana Crop Cultivation System Should Be Regulated | Sakshi
Sakshi News home page

సర్కారు సూచనలతోనే సాగు!

Published Mon, May 11 2020 3:36 AM | Last Updated on Mon, May 11 2020 5:28 AM

Experts Say Telangana Crop Cultivation System Should Be Regulated - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులంతా ఒకే పంట వేసి నష్ట పోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధి కారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సూచిం చిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన పంట లకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయ వద్దని సూచించారు. తెలంగాణలో పంటల సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయిం చడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడ డం వంటి అంశాలపై ఆదివారం సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. సాగును లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలను నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటలకు మంచి ధర వస్తుందని చెప్పారు.
(చదవండి: వలసలతో టెన్షన్‌..టెన్షన్‌)

వ్యవసాయరంగ నిపుణుల సూచనలివీ...
రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ఉంది. అలా చేస్తే పండించిన పంటకు మంచి ధర రాదు. అందువల్ల మార్కెట్‌ డిమాండును బట్టి పంట పండించాలి. ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి. క్రమపద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. వ్యవసాయాధికారులు, యూనివర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలి. వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలి.
(చదవండి: రోజు విడిచి రోజు స్కూలుకు..)

► కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతం మానవీయ దక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతోంది. ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం సాధ్యం కాదు. పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటేనే ధర వస్తుంది. అందువల్ల మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరో మార్గం లేదు.
► తెలంగాణవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో కొంత నిర్ధారణకు వచ్చారు. ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 80–90 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో, కంది 10 లక్షల ఎకరాల్లో మక్కజొన్న 7 లక్షల ఎకరాల్లో, వివిధ రకాల విత్తనాలు 7 లక్షల ఎకరాల్లో, మిర్చి రెండున్నర లక్షల ఎకరాల్లో, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాల్లో, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాల్లో, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాల్లో, కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్‌ పండించడం ఉత్తమం. 
► ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడమే కాకుండా, 30–40 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్‌ సాగును తెలంగాణలో విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10వేల ఎకరాల్లో పామాయిల్‌ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువ ఉన్నందున తెలంగాణవ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్‌ సాగు చేయవచ్చు. 
► రాష్ట్రంలో 80–90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు. కాని ఇందులో కూడా మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు రకాలు పండించాలి. సన్నరకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలి. బియ్యం గింజ పొడవు 6.2 ఎంఎం అంతకన్నా ఎక్కువ ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నందున ఆ రకాలనూ పండించాలి. 
► తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్‌ ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివి. ఇందులో గ్లైసమిన్‌ ఇండెక్స్‌ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్‌ జర్నల్స్‌ కూడా ప్రచురించాయి. దీనిని ఈ వర్షాకాలం సీజన్‌లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలి.
► తెలంగాణవ్యాప్తంగా ఏ పంట ఎంత వేయాలో నిర్ణయించిన తర్వాత ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పండించలానే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలి.
► ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించన విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలి. విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలి. 
► రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలి. 

త్వరలో క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులతో సీఎం సమావేశం
రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో రైతులు ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేక మార్లు ఆయన చర్చించారు. ఇదే అంశంపై నేరుగా జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో సీఎం మాట్లాడతారు.

రైస్‌మిల్లులు సామర్థ్యం పెంచుకోవాలి...
తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఫలితంగా దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతీ ఏటా వరి పంట పండుతుంది. రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్‌ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలి. 

రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీల సంస్థగా పౌర సరఫరాల సంస్థ రూపాంతరం చెందాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు’అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండీ సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement