bitter gourd
-
కాకర : చక్కెరకు చెక్ పెడుతుందా?
డయాబెటిస్ ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటుంటే చక్కెర అదుపులో ఉంటుందన్న అభిప్రాయం కొందరిలో ఉంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. అయితే ఇందులో కాస్తంత పాక్షిక సత్యమూ లేకపోలేదు. కాకరలో ‘కరాటిన్’, ‘మమోర్డిసిస్’ అనే పోషకాలు ప్రధానంగా ఉంటాయి. వాటికి కొంతవరకు చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉంది. ఇక కాకర గింజల్లోనూ పాలీపెపెప్టైడ్–పీ’ అనే ఇన్సులిన్‌ను పోలిన ఫైటోకెమికల్ ఉంటుంది. దీనికి కూడా కొంతవరకు ఇన్సులిన్‌లాగా పనిచేసే గుణం ఉండటంతో అది కొంతవరకు చక్కెరను అదుపు చేస్తుంది. కానీ కాకరకాయతో చేసే వంటలతోనే చక్కెర పూర్తిగా అదుపులో ఉండటమన్నది అసాధ్యం. వాళ్లు డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సిందే. ఉపయోగపడే పోషకాలెన్నెన్నో... అయితే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు కాకరలో ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకు కాకరలో విటమిన్ బి1, బి2, బి3, సి ల తోపాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. ‘సి’ విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (కేన్సర్ కారక కణాలు) తొలగి΄ోయి... కేన్సర్లు నివారితమవుతాయి. కాకర గింజలకు కొవ్వును కరిగించే గుణం ఉండటంతో గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో పీచు చాలా ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని రాకుండా చూస్తూ ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. (చదవండి: చెదురుతున్న గుండెకు అండగా...!) -
కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!
కరేలా ఆయిల్ లేదా కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా హెయిర్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? కాకర తినడమే కష్టం.. కాకరకాయ హెయిర్ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి. కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్ గురించి తెలుసుకుందాం.కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్‌ను బిట్టర్ గార్డ్ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది. ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది, దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.జుట్టు తెల్లబడకుండాకరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు, కాలిన గాయాలకు తొందరగా నయమవుతాయి. -
కాకరకాయ.. వీటితో కలిపి అస్సలు తినకండి
కాకరకాయలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహులకు ఇవి దివ్యౌషధంలాంటివి. అయితే చాలామంది కాకరను తినకూడని వాటితో కలిపి తింటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఏయే ఆహార పదార్థాల్లో కాకరను కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం. పాలు కాకరకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. పెరుగుతో... కాకరకాయలను తిన్న తర్వాత పెరుగన్నం తినడం శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్, కాకరలో ఉండే పోషకాలు కలవడం వల్ల చర్మ సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. మామిడితో... వేసవి కాలంలో అందరూ మామిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కాకరతో తయారు చేసిన ఆహారాల్లో మామిడిని వినియోగించి తీసుకోవడం తీవ్ర ఉదర సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల వాంతులు, మంట, వికారం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ముల్లంగితో... కాకరకాయ, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో ఎసిడిటీ, కఫం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కలిపి తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. -
వేడివేడి అన్నంలో కాకరకాయ పచ్చడితో ఇలా టేస్టీగా..
కాకరకాయ పచ్చడి తయారీకి కావల్సినవి: కాకరకాయలు – పెద్దవి రెండు; పచ్చిమిర్చి – పన్నెండు చిన్న ఉల్లిపాయలు – పదిహేను; అల్లం – అంగుళం ముక్క పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ; గడ్డపెరుగు – రెండు కప్పులు ఆవాలు – అరటీస్పూను, మెంతులు – పావు టీస్పూను ఎండు మిర్చి – రెండు ; కరివేపాకు – ఐదు రెమ్మలు నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, కారం – చిటికెడు. తయారీ విధానం ఇలా.. కాకరకాయలను నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం తొక్కతీసి సన్నగా తరగాలి. 10 పచ్చిమిర్చి, 12 ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేయాలి. కాకరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. దీనిలో కరివేపాకు, కొద్దిగా ఉప్పు, టీస్పూను నూనెవేసి చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. తరువాత మూతపెట్టి సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ అడుగంటితే మరో టీస్పూను నూనె వేయాలి. కొబ్బరి తురుముకు మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జోడించి పేస్టు చేయాలి. బాణలిలో మగ్గుతున్న మిశ్రమంలో ఈ పేస్టు వేసి, కలిపి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. పెరుగుని సమంగా కలుపుకుని మగ్గిన మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కలిపి తిప్పాలి. ∙మిగిలిన నూనెతో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి. కరివేకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చివరిగా కారం చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. -
చేదు లేకుండా కాకరకాయ ఆమ్లెట్ తయారీ ఇలా..
ఎంతమంచి వంటకం అయినా నోటికి రుచిగా లేకపోతే అస్సలు తినబుద్దికాదు. ఇక చేదుగా ఉండే కాకర కాయ డిష్ అంటే..‘‘అమ్మో కాకరకాయ’’ అంటూ ముఖం మాడ్చేస్తారు. అనేక పోషకాలున్న కాకరకాయను మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఎలా వండాలో చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... బిట్టర్ ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి.. కాకకర కాయ – మీడియం సైజుది ఒకటి గుడ్లు – మూడు ఉప్పు – రెండు టీస్పూన్లు గరం మసాలా – అరటీస్పూను నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ విధానమిలా.. కాకర కాయను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసేసి సన్నగా తరగాలి. మరుగుతోన్న నీళ్లలో కొద్దిగా నూనె, టీస్పూను సాల్ట్ , కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన ముక్కలను నీటినుంచి వేరుచేసి, తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో గుడ్లసొనను వేసి చక్కగా కలపాలి. ఈ సొనలో రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. పెనం మీద నూనెవేసి, వేడెక్కిన తరువాత గుడ్ల మిశ్రమం వేసి రెండు వైపులా చక్కగా కాల్చితే బిట్టర్ ఆమ్లెట్ రెడీ. -
ఆరోగ్యాన్నిచ్చే కాకరతో.. కేరళ కర్రీ ‘తోరన్’ తయారీ ఇలా! ఒక్కసారి తింటే..
Kakarakaya Health Benefits: కాకర డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు... వాపులను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది... మంచి ఊపిరినిస్తుంది. కళ్లు... ఎముకలు... లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. సెల్ డ్యామేజ్‌ని అడ్డుకుని చర్మానికి మేలు చేస్తుంది. ఇన్ని ‘మేళ్లు’ చేయడం కాకరకాయకే సాధ్యం. అందుకే... ఈ చేదు రుచులను స్వాగతిద్దాం. ఈ వారం మన ‘వంటిల్లు’ను కాకరకు వేదిక చేద్దాం. తోరన్... కావలసినవి: ►కాకరకాయలు – అర కేజీ ►పచ్చి కొబ్బరి తురుము – పావు కేజీ ►పచ్చి మిర్చి– 10 (సన్నగా తరగాలి) ►బెల్లం లేదా బెల్లం పొడి– 3 టేబుల్ స్పూన్లు ►ఉప్పు – టీ స్పూన్ ►పసుపు– అర టీ స్పూన్ ►కరివేపాకు – 2 రెమ్మలు ►నూనె– 5 టేబుల్ స్పూన్లు. తయారీ: ►కాకరకాయలను శుభ్రంగా కడగాలి. చివరలు తొలగించి కాయను నిలువుగా చీల్చాలి. ►స్పూన్‌తో కాయలోని గింజలను, మెత్తటి భాగాన్ని తీసేయాలి. కాయ పై భాగాలను చిన్న ముక్కలుగా తరగాలి. ►ఈ ముక్కలను మందపాటి పాత్రలో వేయాలి. అందులో బెల్లం, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తురుము వేసి (నీరు పోయకుండా) సన్న మంట మీద ఉడికించాలి. ►కొద్దిగా వేడెక్కిన తర్వాత పసుపు, పసుపు, నూనె కూడా వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ►ఆ తరవాత తరచూ కలుపుతూ ఉడికించాలి. ►అవసరం అనిపిస్తే మరికొద్దిగా నూనె వేయాలి. ►కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ►ఈ కేరళ కర్రీ అన్నంలోకి రొట్టెల్లోకి కూడా మంచి కాంబినేషన్. -
షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం! పరగడుపున ఒక చెంచా రసం తాగితే
కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనానికై ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న చిట్కాలివి. 1.అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. 2.నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి 3. ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. 4.వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి. స్థూలకాయం తగ్గి 5. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 6. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు. తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు మేలు 7.అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాలతో కలిపి పుచ్చుకుంటే నరాలకు మేలు చేస్తాయి. 8.కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతుంది. కడుపు నొప్పి ఉంటే 9.రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది. 10.తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. పేను కొరుకుడు వేధిస్తోందా 11.దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న వాళ్లకి తక్షణం పనిచేస్తుంది. 12.ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. చుండ్రు నివారణకు 13.మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది. 14.కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. మడమ నొప్పి తగ్గాలంటే 15.చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. 16.జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉంటే 17.శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 18.రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం 19.మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. 20.ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం. పార్శ్వపు నొప్పి తగ్గటానికి 21.పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది. 22. తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్య నిపుణులు నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
‘దొంగతనం పాపం’ రా బాబులు!
ఏర్పేడు: తమ పంటను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రైతు ఆదివారం వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. ‘దొంగతనం పాపం.. ఓం నమశ్శివాయ’ అంటూ ప్లకార్డులపై రాయించి వాటిని పొలంలో ఏర్పాటు చేశాడు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొండ్రాజుపల్లికి చెందిన రామ్మూర్తినాయుడు శ్రీకాళహస్తిలో ఉంటూ పదేళ్లుగా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలో కూరగాయలు పండిస్తున్నాడు. ప్రస్తుతం కాకర పంట వేశాడు. అప్పుడప్పుడు బైక్‌పై వెళ్లి కాకర పంటను చూసుకుంటున్నాడు. అయితే పలువురు తోటలోని కాకర కాయలను దొంగిలిస్తున్నారు. దీంతో రామ్మూర్తినాయుడు పైవిధంగా ప్లకార్డులు ఏర్పాటు చేశాడు. మరి ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. -
Health: ఆస్తమా ఉందా? కాకర, గుమ్మడి, లవంగాలు.. తరచుగా తింటున్నారా? అయితే
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది. ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు... కాయగూరలూ, ఆకుకూరలు : ►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. ►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వండకుండానే తినే వాటిల్లో : ►కిస్మిస్, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు. ►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి. ►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి. ►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు: ►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ►కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
అడవి కాకరపై రైతన్న దృష్టి .. ఉపయోగాలెన్నో..
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అడవి కాకర (బోద కాకర) సాగుపై జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. దీని శాస్త్రీయ నామం మైమోర్డికా డయాయిక కుకుర్బుటేసి. ఇవి సాధారణ కాకరకు అతిదగ్గర పోలికలుండగా రుచి వేరుగా ఉంటుంది. కాయ సుమారు 4 నుంచి 6 సెం.మీ. పొడవు, 30–40 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో అధిక పోషక విలువలుంటాయి. రక్తంలోని చక్కెర శాతం తగ్గడం, కంటిచూపు వృద్ధి చెందడం, క్యాన్సర్ నుంచి రక్షణ, మూత్రపిండాల్లోని రాళ్లని కరిగించడం, మొలలను నివారించడం, అధికంగా చెమట రాకుండా చేయడం, దగ్గు నివారణ, జీర్ణశక్తి పెంచడం వంటి ఉపయోగాలు అడవి కాకర వినియోగంతో ఉంటాయి. జిల్లాలో సాగు ఇలా.. సీతంపేట, వీరఘట్టం, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో సుమారు 20 హెక్టార్లలో అడవి కాకరను సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. పదివేల నుంచి 20 వేల రూపాయల వరకూ ఖర్చువుతుండగా.. వెయ్యి నుంచి 1500 కిలోల దిగుబడి వస్తోంది. ఎకరా సాగు చేస్తే సుమారు రూ. 60 వేల నుంచి 80 వేల రూపాయల వరకూ రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంది. మామూలు రకంకంటే ఎక్కువ రుచి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మేలైన రకాలు ఇండియా కంకొడ (ఆర్‌ఎమ్‌ఎఫ్–37) రకాన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. ఈ రకం చీడపీడలను తట్టుకుంటుంది. దుంపలను నాటితే సుమారు 35– 40 రోజులకు, అదే విత్తనం ద్వారా 70–80 రోజుల కు పంట కోతకు వస్తోంది. మొదటి సంవత్సరంలో ఎకరాకు 4 క్వింటాళ్లు, రెండో ఏటా 6 క్వింటాళ్లు, మూడో సంవత్సరం 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తోంది. నేలల స్వభావం ఇది ఉష్ణమండల పంట. అధిక దిగుబడికి సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉష్ణ ప్రాంతాలు అనుకూలం. ఒండ్రు ఇసుక కలిపిన ఉదజని సూచిక 5.5 నుంచి 7.0 ఉండి.. సేంద్రియ పదార్ధం అధికంగా ఉన్న నేలలు సాగుకు మేలు. ఆమ్ల, క్షార స్వభావం ఉండి, మురుగునీటి వసతి లేని చౌడునేలలు సాగుకు పనికి రావు. నాటడం ఇలా.. ఎకరాకు 1.5 నుంచి 3 కిలోల విత్తనం లేదా 3000 నుంచి 5000 దుంపలు కావాలి. వేసవి, వర్షాకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. సాధారణంగా వేసవి పంటను జనవరి–ఫిబ్రవరిలో, వర్షాకాలం పంటను జూలై–ఆగస్టు నెలల్లో నాటుతారు. దుంపలు నాటేందుకు ఫిబ్రవరి–మార్చి నెలలు అనుకూలం. 2–3 విత్తనాలు ఎత్తయిన మడుల మీద 2 సెం.మీ., దుంపలైతే 3 సెం.మీ. లోతులో వరుసల మధ్య 2 మీట ర్లు, వరుసల్లో మొక్కల మధ్య 70–80 సెం.మీ. దూరం ఉండేలా నాటుకోవాలి. నీటి యాజమాన్యం: వర్షాకాలంలో నీటి అవసరం ఉండదు. బెట్ట పరిస్థితుల్లో 3–4 రోజులకోసారి పెట్టాలి. ఎక్కువ నీటిని పారిస్తే తీగలు చనిపోతా యి. మురుగునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. ఎరువులు: ఎకరాకు 6 నుంచి 8 టన్నులు బాగా కుళ్లిన సేంద్రియ ఎరువులు ఆఖరి దుక్కిల్లో చేయాలి. విత్తనం లేదా దుంపలు నాటేముందు ఎకరాకు 32 కిలోల భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 కిలోలో నత్రజనిని తీగ ఎగబాకే ముందు, మరో 24 కిలోల నత్రజనిని పూతకు ముందు భూమిలో వేసుకోవాలి. కలుపు నివారణ: నాటిన 24 గంటల్లోగా పిండిమిథాలిన్ 5 మి.లీటర్లు.. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే కూలీలతో, యంత్ర పరికరాలతో కలుపుతీసి పోలాన్ని శుభ్రంగా ఉండాలి. సస్యరక్షణ: అడవి కాకరను ఎక్కువగా పండు ఈగ లు, నులిపురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పండు ఈగ నివారణకు ఎకరాకు 20–30 ఫిరమోన్ ఎరలను అమర్చాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మలాథియాన్ 1.5 మి.లీ. లేదా డైక్లోరావాస్ ఒక మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నులిపురుగుల నిర్ధారణకు 5 కిలోల పాసిలోమైసిస్, ట్రైకోడెర్మా హర్జియానం, పోచానియా వంటివి ఒక టన్ను పశువుల ఎరువు – 100 కిలోల వేపపిండి మిశ్రమా నికి కలిపి 15 రోజులు నీడలో ఉంచి వృద్ధిచేసి ఎకరా పొలానికి చేసుకోవాలి. దిగుబడి మొదటి సంవత్సరం నాటిన 75–80 రోజుల్లో కోతకు వస్తుంది. రెండో సంవత్సరం మొలకెత్తిన 35–40 రోజుల్లో కోతకు వస్తుంది. కాయ లేతగా, ఆకుపచ్చని రంగులో ఉన్న ప్పుడే కోయాలి. ప్రతి రెండు రోజులకోసారి కాయలు తెంపాలి. ఆలస్యం చేస్తే కాయలు ముదిరి మార్కె ట్ విలువ తగ్గుతుంది. కాయలు తెంపేటప్పుడు తీగకు నష్టం కలుగకుండా చూడాలి. విత్తనం కోసమై తే కాయ పూర్తిగా పసుపు రంగుకు మారి, విత్తనం ఎరుపు రంగు వచ్చినప్పుడు కోయాలి. వీటిని మంచినీటిలో కడిగి నీడలో ఆరబెట్టి బూడిదతో కలిపి నిల్వ ఉంచుకోవచ్చు. అవగాహన పెంచుకొని సాగు చేయాలి అడవి కాకర సాగుపై రైతు లు ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆ తరువాత సాగు చేయాలి. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది. – వై.రామారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఉద్యానశాఖ, శ్రీకాకుళం -
కాకరకాయ కూర తరచూ తింటే షుగర్ అదుపులోకి వస్తుందా?
చక్కెరవ్యాధి ఉన్నవారు తరచూ కాకరకాయ కూర తింటూ ఉండటంగానీ లేదా రోజూ కాకరను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల... చక్కెర అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. ఇది ఒకరకంగా అపోహ లేదా పాక్షిక సత్యం మాత్రమే అని చెప్పవచ్చు. నిజానికి కాకరలో ఉండే రెండు ప్రధాన పోషకాలైన ‘కరాటిన్’, ‘మమోర్డిసిన్’లకు రక్తంలోని చక్కెరపాళ్లను కొంతవరకు తగ్గించే సామర్థ్యం ఉన్నమాట వాస్తవమే. అలాగే కాకర గింజలలో పాలీపెపై్టడ్–పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం కూడా ఉంటుంది. అది కూడా ఇన్సులిన్‌లాగా ప్రవర్తించి కొంతవరకు చక్కెరపాళ్లను అదుపు చేస్తుంది. అయితే... ఒకసారి డయాబెటిస్ వ్యాధి వచ్చిదంటే... అది కేవలం కాకరకాయ తినడం వల్ల మాత్రమే అదుపులో ఉండడమన్నది జరగదు. డయాబెటిస్ రోగులు కాకరకాయ కూర తింటున్నా చక్కెరను నియంత్రించే మందులు తీసుకోవాల్సిందే. కాకపోతే కాకరలో ఇంకా అద్భుతమైన గుణాలున్నాయి. ఆరోగ్యాన్ని సమకూర్చి పెట్టే కాకరలో పోషకాలు చాలా ఎక్కువ. పీచు పుష్కలం. క్యాలరీలు చాలా తక్కువ. పోషకాల విషయానికి వస్తే విటమిన్ బి1, బి2, బి3, సి లతో పాటు జీర్ణ వ్యవస్థను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచే ఫైబర్‌తో పాటు మెగ్నీషియమ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. కాకర గింజలు కొవ్వును కరిగించి గుండె గదులు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తాయి. అలా గుండె పనితీరును క్రమబద్ధం చేస్తాయి. సి విటమిన్ చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో అది దేహంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. ఆ ప్రక్రియతో మాలిగ్నంట్ కణాల (క్యాన్సర్ కారక కణాలు) తొలగిపోయి... క్యాన్సర్లు నివారితమవుతాయి. ఇలా అనేక రకాలుగా కాకర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. చదవండి : కరోనా వచ్చిన తర్వాత నిద్రలేమా?.. ఇలా చేయండి! -
కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..
కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. న్యూట్రిషన్ విలువలు ► మొత్త కాలరీలు-16 ►ఆహార ఫైబర్ - 2.6 గ్రా ►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా ►కొవ్వులు - 158 మి.గ్రా ►నీటి శాతం - 87.4 గ్రా ►ప్రోటీన్ - 930 మి.గ్రా అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది. 1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు. 2. డయాబెటిస్ కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్‌లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. 3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. 4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాకరకు గల యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు. 5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్.. ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 6. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 7. అధిక బరువును తగ్గిస్తుంది. కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. 8. జుట్టుకు మెరుపు అందిస్తుంది. కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్‌ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్‌గా ఉండటంలో సహాయపడుతుంది. 9. చర్మాన్ని అందంగా చేస్తుంది మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది. -
ఆరోగ్య కారకం
వాతావరణం చల్లబడినట్లే ఉంది. పొడిగా ఉండడం అవసరం. పొడులు తినడమూ అవసరం.వర్షాలు వెళ్లే వరకూరోజూ ఒక ముద్ద కారప్పొడితో తింటే..అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పేరుకు కారాలే గానీ..రుచికరమైన ఆరోగ్య కారకాలే ఇవన్నీ! కాకరకాయ కారం కావలసినవి: కాకరకాయలు ఒక కిలో; ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ. కరివేపాకు కారం కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. కంది కారం కావలసినవి: కందిపప్పు: 100గ్రా‘‘; ఎండు మిరపకాయలు: 50గ్రా‘‘; శనగపప్పు: ఒక స్పూను; పెసరపప్పు: ఒక స్పూను; ఇంగువపొడి: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: తగినంత. తయారి: కందిపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు. నల్ల కారం కావలసినవి: ఎండుమిరపకాయలు: 100 గ్రా; చింతపండు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా; ధనియాలు: 50 గ్రా; పచ్చిశనగపప్పు: ఒక స్పూన్; మినప్పప్పు: ఒక స్పూన్; కరివేపాకు: కొద్దిగా; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: వేయించడానికి కావలసినంత. తయారి: బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ విడివిడిగా వేయించాలి. వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది. కొబ్బరి కారం కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత. తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్. ఇడ్లీ కారం కావలసినవి: వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా‘‘; ఎండు కొబ్బరి: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ఎండు మిర్చి: 50గ్రా‘‘; ఉప్పు: రుచికి తగినంత; నూనె: వేయించడానికి సరిపడినంత. తయారి: నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రైండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీకారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు. కూర కారాలు కూర కారం కావలసినవి:ఎండు మిర్చి: ఒక కిలో; ధనియాలు: పావు కిలో వెల్లుల్లి: పావుకిలో; జీలకర్ర: 150గ్రా‘‘ మెంతులు: 50గ్రా‘‘; ఉప్పు: పావుకిలో తయారి: కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసుకుంటే రుచి పెరగడమే కాక, ఘుమఘుమలాడుతుంది. కూరకారం, ఇగురుకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటాయి నువ్వుల పొడి కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత. తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత. ఇగురుకారం కావలసినవి: ఎండుమిర్చి: ఒక కిలో జీలకర్ర: పావుకిలో వెల్లుల్లి: పావుకిలో నూనె: వేయించడానికి కావలసినంత తయారి: మిరపకాయలను నూనెలో వేయించి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. దీనిని కూరలు, వేపుళ్లలో వేసుకుంటే వంటల రుచి మరింత ఇనుమడిస్తుంది. నాన్ వెజ్ రొయ్యల కారం కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పుఎండు రొయ్యలు– అర కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుఅల్లం తరుగు – ఒక టీ స్పూనుకరివేపాకు – మూడురెమ్మలుఎండు మిరపకాయలు– ఆరునల్ల మిరియాలు– 15చింతపండు– పెద్ద ఉసిరికాయంతఉప్పు– రుచికి తగినంత తయారి: ఎండు రొయ్యలను పెనంలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొబ్బరి తురుమును, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పల్లీ కారం పల్లీకారం: కొబ్బరికారంలో వేసిన దినుసులన్నీ వేసుకుని కొబ్బరికి బదులుగా వందగ్రాముల వేరుశనగ పప్పు వాడాలి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం అన్నింటిలోకి మంచి ఆధరువు. కరివేపాకు కారానికి వాడిన దినుసులన్నీ వేసుకుంటూ కరివేపాకు బదులుగా పుదీనా వాడాలి. కొత్తిమీర పొడికి కూడ ఇదే పద్ధతి. -
మంత్రి కామినేనిని నిలదీసిన స్ధానికులు
-
చక్కెర వ్యాధికి చేదుమందు కాకర!
చేదుగా ఉన్నప్పటికీ చాలా మంది కాకరకాయను ఇష్టపడుతుంటారు. దానిలోని చేదు విరిచేసేలా ఫ్రై చేయడమో, మజ్జిగలో వేసి ఉడికించడమో లేదా కోశాక ఉప్పు, పసుపు వేయడమో చేస్తారు. కాకరకాయ డయాబెటిస్ రోగులకు ఎక్కువ మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెరను నియంత్రించే గుణం కాకరలో ఉంది. అంతేకాదు... కాకరతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని... ♦ కాకరకాయలో ఇన్సులిన్ లాంటి రసాయనం (కాంపౌండ్) ఉంటుంది. దీన్ని పాలిపెపై్టడ్–పీ లేదా పీ–ఇన్సులిన్ అంటారు. ఇది స్వాభావికంగా చక్కెరవ్యాధిని నియంత్రిస్తుంది. టైప్–1 డయాబెటిస్ ఉన్న చిన్న పిల్లల్లో సైతం ఇది చక్కెరను నియంత్రిస్తుందని తేలింది. ♦ కాకర రక్తంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సమర్థంగా నివారిస్తుంది. గుండెపోటును నివారిస్తుంది. ♦ కాకరలో పొటాషియమ్ పాళ్లు పుష్కలం. ఇది రక్తపోటును నియంత్రించి, పక్షవాతాన్ని నివారిస్తుంది. ♦ కాకరలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్–ఏ, విటమిన్–సి, బయోటిన్, జింక్ వల్ల చర్మంలో నిగారింపు వస్తుంది. ఇది మొటిమలను నివారించడంతో పాటు ఎగ్జిమా, సోరియాసిస్ చికిత్స ప్రక్రియల్లో కొంతమేర సహాయపడుతుంది. ♦ మద్యం తాగిన మర్నాడు కాకర కూర తినడం లేదా కాకర రసం తాగడం మంచిది. మద్యం దుష్ప్రభావానికి కారణమయ్యే... కాలేయంలో పోగుపడ్డ విషాలను కాకర ప్రక్షాళన చేస్తుంది. ♦ కాకరకాయలో కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు), క్యాలరీలు తక్కువ. అందుకే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకున్న వారు కాకరకాయ కూర తినడం మంచిది. ♦ కాకరకాయ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, హానికారక వైరస్లు, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. ♦ కాకరలోని యాంటీఆక్సిడెంట్లు చాలా శక్తిమంతమైనవి. అనేక రకాల క్యాన్సర్లను ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. ♦ కాకరలో విటమిన్–ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటికి మేలు చేయడంతో పాటు క్యాటరాక్ట్‌ను సమర్థంగా నివారిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కాకర దేహాన్ని కండిషన్లో ఉంచుతుంది. -
టీటీడీపీ నేతలకు చుక్కెదురు
-
రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
-
జన్మభూమిలో టీడీపీకి చేదు అనుభవం
-
మహిళలను గెంటివేయించిన ఎమ్మెల్యే
-
ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు
-
వంటిప్స్
కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.అప్పడాలు వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగదు.మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి. బంగాళదుంపల మధ్యలో కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.బెండకాయలు తాజాగా, ముదిరిపోకుండా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది. దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. -
ఇంటిప్స్
కాకరకాయ కూరలో సోంపుగింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగానూ ఉంటుంది. బంగాళదుంపలను వెల్లుల్లితో కలిపి ఉంచితే అవి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. పాల నుంచి జున్ను వడకట్టినప్పుడు ఆ నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు లేదా గ్రేవీకూరలో పోసి ఉడికిస్తే ఆ వంటకానికి మంచి రుచి వస్తుంది . అప్పడాలు వేయించే రోజున వాటిని ఎండలో పెడితే నూనె ఎక్కువ పట్టదు. బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇడ్లీ, దోసె పిండి చేయడానికి ముందు బియ్యం కొద్దిగా వేయించి తర్వాత నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తాయి. పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. దోసె, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలుపోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు కలపాలి. ఆ వంటకాలు రుచిగా, కరకరలాడుతూంంటాయి. -
తాజాగా.. మృదువుగా..!
ఇంటిప్స్ కాకరకాయలను మధ్యలో చీరి ఉప్పు, శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత వండితే చేదు తగ్గుతుంది, రుచి ఇనుమడిస్తుంది. మిరప్పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే దానిని నిలవ ఉంచిన పాత్రలో చిన్న ఇంగువ ముక్క లేదా కొద్దిగా ఇంగువ పొడి వేయాలి. అల్యూమినియం పాత్రలో వండితే పుట్టగొడుగులు నల్లబడతాయి. స్టీలు లేదా నాన్‌స్టిక్ పాత్రలు వాడితే మంచిది. ఆపిల్స్, అరటిపండ్లు కలిపి ఒకే సంచిలో ఉంచితే అరటిపండ్లు త్వరగా పండుతాయి. అరటిపండ్లు మూడు నాలుగు రోజులు నిల్వ ఉండాలంటే రెండింటినీ కలిపి నిలవ చేయకూడదు. మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే వేరుచేయాలి. మాంసం ఉడికించేటప్పుడు చిన్నముక్క కొబ్బరి వేస్తే త్వరగా ఉడుకుతుంది, మృదువుగా కూడ ఉంటుంది. కేక్ ఎగ్ వాసన రాకుండా ఉండాలంటే కోడిగుడ్డును గిలక్కొట్టేటప్పుడు కొద్దిగా తేనె కలపాలి. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మెత్తబడతాయి. -
తిండి గోల
బెటర్ గార్డ్ కాకరకాయ పేరు వింటేనే ముఖం అదోలా పెడతారు చాలామంది. ఆరోగ్యప్రదాయిని అని హెచ్చరిస్తే తప్పదన్నట్టు కాస్త కూరను భోజనంలో వడ్డించుకుంటారు. రుచి చూశాక మాత్రం ‘సూపర్’ అని కితాబులిచ్చేస్తారు. బిటర్గార్డ్, బిటర్ మెలన్ అంటూ విదేశీయులు దీనికి చాలా పేర్లే పెట్టారు. ఆసియా, ఆఫ్రికా మైదానాలలో విపరీతంగాపెరిగే తీగజాతి మొక్క కాకర. మనదేశం నుంచి 14వ శాతాబ్దంలో చైనాలోకి అడుగుపెట్టింది. కాకర సాగుబడి ద్రాక్ష తోటల పెంపకం మాదిరిగానే ఉంటుంది. జూన్, జులై మాసాలలో పువ్వులతో సింగారించుకున్న ఈ మొక్క సెప్టెంబర్ నుంచి నవంబర్ నాటికి కాయలను ఇస్తుంది. చాలా వరకు వీటిని పచ్చగా ఉన్నప్పుడే కాయగూరగా వాడుతారు. పండుగా మారిన తర్వాత బాగా నీరుపట్టి ఇంచుమించు దోసకాయలా ఉంటుంది. వంటగానే కాక కొన్ని దేశాలలో నాటు వైద్యంగా కాకర రసాన్ని ఉపయోగిస్తారు. -
బెటర్ గార్డ్
రీడర్స్ కిచెన్ తీపి చేదులు కలిస్తేనే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది అంటారు పెద్దలు. ఆహారం కూడా అంతే. తీపితో పాటు చేదు కూడా అప్పుడప్పుడూ తగులుతూ ఉంటేనే ఆహారంలోని మాధుర్యం అర్థమవుతుంది. అయినా సరిగ్గా వండాలే కానీ... కాకరలోని చేదు కూడా జిహ్వకు తీయగానే తగులుతుంది అంటున్నారు మన పాఠకులు కొందరు. కాకరకాయతో మీదైన ఓ వెరైటీ వంటకాన్ని రాసి పంపమని కోరగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పంపించారు. వాటిలో నాలుగు ఉత్తమ వంటకాలు ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో మీకోసం... 1. కాకరకాయ వడలు కావలసినవి: కాకరకాయలు - 2, మైదా - అర కప్పు, కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు, పెరుగు - అరకప్పు, ఉల్లిపాయ - 1, తరిగిన పుదీనా - 2 చెంచాలు, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, కారం - 2 చెంచాలు, వేయించిన వేరుశనగల పొడి - 2 చెంచాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - అర చెంచా, ధనియాల పొడి - అర చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, గుండ్రని చక్రాల్లా కోసుకోవాలి; ఓ బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి; ఈ మిశ్రమంలో కాకరకాక ముక్కల్ని వేసి అరగంటపాటు ఉంచాలి; ఆ తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్, వేరుశనగ పొడి, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి; వేడెక్కాక... పిండిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించాలి. 2. కాకరకాయ టిక్కీ కావలసినవి: కాకరకాయలు (పెద్దవి) - 2, క్యారెట్ - 1, బఠాణీలు - పావుకప్పు, బియ్యపు పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ - పావుకప్పు, కొత్తిమీర - పావుకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, ధనియాల పొడి - 1, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా తయారీ: క్యారెట్‌ను తురుముకుని పక్కన పెట్టాలి; బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి; ఉల్లిపాయల్ని, గింజలు తీసేసిన కాకరకాయల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి (మరీ మెత్తగా అవ్వకూడదు); ఓ బౌల్లో ఉల్లి ముద్ద, కాకరకాయ ముద్ద, బఠాణీ-కొత్తిమీర-పచ్చిమిర్చి ముద్ద, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి; తర్వాత బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, టిక్కీల్లాగా ఒత్తుకోవాలి; స్టౌ మీద అట్ల రేకు పెట్టి, కాసింత నూనె వేసి, రెండు వైపులా ఎరుపురంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. 3. కాకరకాయ ఉల్లికారం కావలసినవి: కాకరకాయలు - 4, ఉల్లిపాయలు (పెద్దవి) - 2, ఎండుమిర్చి - 7, జీలకర్ర - 2 చెంచాలు, నువ్వులు - 2 చెంచాలు, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - తగినంత తయారీ: ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి; కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ పేస్టును పచ్చి వాసన పోయేవరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి; కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, నాలుగు పాయలుగా చీలి, గింజలు తీసేయాలి; తర్వాత ఈ కాయల్లో ఉల్లిపాయ పేస్టును కూరాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి; అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోవాలి; ఎరుపురంగులోకి మారాక ఓ ప్లేటులోకి తీసుకుని, పైన నువ్వుల్ని చల్లి వడ్డించాలి. 4. కాకరకాయ పోళీ కావలసినవి: కాకరకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి శనగపప్పు - 2 చెంచాలు, ధనియాలు - 2 చెంచాలు, వేయించిన కొబ్బరిపొడి - 2 చెంచాలు, వేయించిన నువ్వుల పొడి - 2 చెంచాలు, మెంతులు - 1 చెంచా, చింతపండు గుజ్జు - 4 చెంచాలు, బెల్లం తరుగు - 1 చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత తయారీ: స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక గుండ్రంగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి; పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి; బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి; బ్రౌన్ కలర్ వచ్చాక కాకర కాయ ముక్కలు వేయాలి; రెండు నిమిషాలు వేయించాక... మిక్సీ పట్టిన పొడితో పాటు కొబ్బరిపొడి, నువ్వుల పొడి కూడా వేయాలి; కాస్త మగ్గాక బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి మూతపెట్టాలి; నీరు ఇగిరిపోయి బాగా దగ్గరగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించుకుని దించేసుకోవాలి. కాకరలో పోషకాలు ఎక్కువే! కాకరకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. బీ1, బీ2, బీ3, సీ విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్ మెండుగా ఉంటాయి. బ్రకోలీ కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్, పాలకూరలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండులో కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి. ఇందులో ఉండే ‘పోలీపెప్టైడ్ పి’.. ఇన్సులిన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అందుకే మధుమేహ రోగులు తరచుగా తినాలి. కాకరకు ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు... కడుపులో మంట, గుండె మంట, అల్సర్ల వంటివి తగ్గుతాయి. అయితే గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు కాకరను తినకపోవడం ఉత్తమం. ఇందులో ఉండే క్వినైన్, మోరోడైసిన్, సపోనిక్ గ్లైకోసైడ్స్ వంటివి పడక కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. స్వల్ప మోతాదులో ఉండే విషపూరిత టాక్సిన్లు కడుపునొప్పి, వాంతులు, డయేరియా, నరాల బలహీనత తదితర ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి వండే ముందు ఓ పది నిమిషాలు ఉప్పునీటిలో నానబెట్టి వండుకుంటే మంచిది. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ రీడర్స్ కిచెన్ ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి. ఈ వారం ‘పచ్చి మామిడికాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి. మా చిరునామా: రీడర్స్ కిచెన్, సాక్షి దినపత్రిక, 2-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: sakshi.cookery@gmail.com