వాతావరణం చల్లబడినట్లే ఉంది. పొడిగా ఉండడం అవసరం. పొడులు తినడమూ అవసరం.వర్షాలు వెళ్లే వరకూరోజూ ఒక ముద్ద కారప్పొడితో తింటే..అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. పేరుకు కారాలే గానీ..రుచికరమైన ఆరోగ్య కారకాలే ఇవన్నీ!
కాకరకాయ కారం
కావలసినవి: కాకరకాయలు ఒక కిలో; ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత
తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ.
కరివేపాకు కారం
కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత.
తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది.
కంది కారం
కావలసినవి: కందిపప్పు: 100గ్రా‘‘; ఎండు మిరపకాయలు: 50గ్రా‘‘; శనగపప్పు: ఒక స్పూను; పెసరపప్పు: ఒక స్పూను; ఇంగువపొడి: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: తగినంత.
తయారి: కందిపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు ఒకదాని తర్వాత మరొకటి వేయించుకుని పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, ఇంగువ పొడి వేయాలి. దీనిని అన్నంలోకి కలుపుకోవచ్చు. వేపుడు కూరలలో చివరగా రెండు స్పూన్ల కారం చల్లితే ఆ రుచే వేరు.
నల్ల కారం
కావలసినవి: ఎండుమిరపకాయలు: 100 గ్రా; చింతపండు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా; ధనియాలు: 50 గ్రా; పచ్చిశనగపప్పు: ఒక స్పూన్; మినప్పప్పు: ఒక స్పూన్; కరివేపాకు: కొద్దిగా; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు: తగినంత; నూనె: వేయించడానికి కావలసినంత.
తయారి: బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ విడివిడిగా వేయించాలి. వేడి చల్లారిన తర్వాత అన్నింటినీ కలిపి పొడి చేసుకోవాలి. ఇది అన్నంలోకి,
ఇడ్లీలోకి బాగుంటుంది.
కొబ్బరి కారం
కావలసినవి: పచ్చికొబ్బరి: ఒక కాయ నుంచి తీసినది; ఎండు మిర్చి: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగపప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె: తగినంత.
తయారి: పచ్చికొబ్బరి తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఎండు మిర్చి వేయించిన తర్వాత కొబ్బరి తురుమును వేయించాలి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కూడ వేయించుకుని అన్నీ కలిపి ఉప్పు చేర్చి పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేపుడు కూరలలో వేసుకుంటారు. ఈ కారంపొడిలో నెయ్యి కలిపితే ఇడ్లీకి మంచి కాంబినేషన్.
ఇడ్లీ కారం
కావలసినవి: వేయించిన శనగపప్పు(పుట్నాలు): 100 గ్రా‘‘; ఎండు కొబ్బరి: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ఎండు మిర్చి: 50గ్రా‘‘; ఉప్పు: రుచికి తగినంత; నూనె: వేయించడానికి సరిపడినంత.
తయారి: నూనె వేడయ్యాక ముందుగా ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని శనగపప్పు, జీలకర్ర ఒకదాని తర్వాత మరొకటి వేయించాలి. ముందుగా మిరపకాయలను గ్రైండ్ చేసి దానిలో పుట్నాలు, ఎండుకొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. పేరుకి ఇది ఇడ్లీకారమే అయినా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కారం కలిపి తింటే ఇక వేరే కూరలేవీ రుచించవు.
కూర కారాలు
కూర కారం
కావలసినవి:ఎండు మిర్చి: ఒక కిలో; ధనియాలు: పావు కిలో వెల్లుల్లి: పావుకిలో; జీలకర్ర: 150గ్రా‘‘ మెంతులు: 50గ్రా‘‘; ఉప్పు: పావుకిలో
తయారి: కూరకారానికి ఎండుమిర్చి వేయించకూడదు. ధనియాలు, జీలకర్ర విడివిడిగా వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి, ఉప్పు చేర్చుకోవాలి. దీనిని పులుసుల్లో వేసుకుంటే రుచి పెరగడమే కాక, ఘుమఘుమలాడుతుంది. కూరకారం, ఇగురుకారం ఆరు నెలల పాటు నిలవ ఉంటాయి
నువ్వుల పొడి
కావలసినవి: తెల్ల నువ్వులు: 100గ్రా‘‘; చింతపండు : 50గ్రా‘‘; ధనియాలు : 50గ్రా‘‘; మినప్పప్పు: ఒక స్పూను; శనగ పప్పు: ఒక స్పూను; జీలకర్ర: రెండు స్పూన్లు; ఉప్పు, నూనె : తగినంత.
తయారి: నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రలను విడివిడిగా వేయించి అన్నింటినీ కలిపి పొడి చేసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇది అన్నంలోకి ఇడ్లీకి మంచి కాంబినేషన్. దీనిని ఎక్కువగా శీతాకాలంలో చేసుకుంటారు. వర్షాకాలంలో కూడ చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా శరీరానికి అందించాల్సిన ఔషధాలను ఆహార రూపంలో అందించడమే మన రుచుల ప్రత్యేకత.
ఇగురుకారం
కావలసినవి: ఎండుమిర్చి: ఒక కిలో జీలకర్ర: పావుకిలో వెల్లుల్లి: పావుకిలో నూనె: వేయించడానికి కావలసినంత
తయారి: మిరపకాయలను నూనెలో వేయించి చల్లారిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. దీనిని కూరలు, వేపుళ్లలో వేసుకుంటే వంటల రుచి మరింత ఇనుమడిస్తుంది.
నాన్ వెజ్
రొయ్యల కారం
కావలసినవి: ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పుఎండు రొయ్యలు– అర కప్పుఉల్లిపాయ ముక్కలు– పావు కప్పుఅల్లం తరుగు – ఒక టీ స్పూనుకరివేపాకు – మూడురెమ్మలుఎండు మిరపకాయలు– ఆరునల్ల మిరియాలు– 15చింతపండు– పెద్ద ఉసిరికాయంతఉప్పు– రుచికి తగినంత
తయారి: ఎండు రొయ్యలను పెనంలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొబ్బరి తురుమును, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో చింతపండు, ఉప్పు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
పల్లీ కారం
పల్లీకారం: కొబ్బరికారంలో వేసిన దినుసులన్నీ వేసుకుని కొబ్బరికి బదులుగా వందగ్రాముల వేరుశనగ పప్పు వాడాలి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం అన్నింటిలోకి మంచి ఆధరువు.
కరివేపాకు కారానికి వాడిన దినుసులన్నీ వేసుకుంటూ కరివేపాకు బదులుగా పుదీనా వాడాలి. కొత్తిమీర పొడికి కూడ ఇదే పద్ధతి.
Comments
Please login to add a commentAdd a comment