కాకరకాయ పచ్చడి తయారీకి కావల్సినవి:
కాకరకాయలు – పెద్దవి రెండు; పచ్చిమిర్చి – పన్నెండు
చిన్న ఉల్లిపాయలు – పదిహేను; అల్లం – అంగుళం ముక్క
పచ్చికొబ్బరి తురుము – అరకప్పు ; గడ్డపెరుగు – రెండు కప్పులు
ఆవాలు – అరటీస్పూను, మెంతులు – పావు టీస్పూను
ఎండు మిర్చి – రెండు ; కరివేపాకు – ఐదు రెమ్మలు
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, కారం – చిటికెడు.
తయారీ విధానం ఇలా..
కాకరకాయలను నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అల్లం తొక్కతీసి సన్నగా తరగాలి. 10 పచ్చిమిర్చి, 12 ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేయాలి. కాకరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలో వేయాలి. దీనిలో కరివేపాకు, కొద్దిగా ఉప్పు, టీస్పూను నూనెవేసి చక్కగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమం మొత్తాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాలు పెద్దమంట మీద వేయించాలి. తరువాత మూతపెట్టి సన్న మంట మీద పది నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ అడుగంటితే మరో టీస్పూను నూనె వేయాలి. కొబ్బరి తురుముకు మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జోడించి పేస్టు చేయాలి.
బాణలిలో మగ్గుతున్న మిశ్రమంలో ఈ పేస్టు వేసి, కలిపి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. పెరుగుని సమంగా కలుపుకుని మగ్గిన మిశ్రమంలో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కలిపి తిప్పాలి. ∙మిగిలిన నూనెతో ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి. కరివేకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. చివరిగా కారం చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment