
ఏర్పేడు: తమ పంటను దొంగల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ రైతు ఆదివారం వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. ‘దొంగతనం పాపం.. ఓం నమశ్శివాయ’ అంటూ ప్లకార్డులపై రాయించి వాటిని పొలంలో ఏర్పాటు చేశాడు. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొండ్రాజుపల్లికి చెందిన రామ్మూర్తినాయుడు శ్రీకాళహస్తిలో ఉంటూ పదేళ్లుగా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలో కూరగాయలు పండిస్తున్నాడు.
ప్రస్తుతం కాకర పంట వేశాడు. అప్పుడప్పుడు బైక్‌పై వెళ్లి కాకర పంటను చూసుకుంటున్నాడు. అయితే పలువురు తోటలోని కాకర కాయలను దొంగిలిస్తున్నారు. దీంతో రామ్మూర్తినాయుడు పైవిధంగా ప్లకార్డులు ఏర్పాటు చేశాడు. మరి ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.