ప్రతీకాత్మక చిత్రం
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది.
అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది.
ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు...
కాయగూరలూ, ఆకుకూరలు :
►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది.
►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
వండకుండానే తినే వాటిల్లో :
►కిస్‌మిస్, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్‌రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు.
►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి.
►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి.
►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు.
►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు:
►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
►కూల్‌డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి.
►ఉప్పు బాగా తగ్గించాలి.
►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి.
►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు.
నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా..
Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment