ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి.
ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు.
గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది.
ఆలోచన... ఆసక్తి!
‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది.
ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్‌న్‌షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్‌లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.
మేధ సమాజానికి ఉపయోగపడాలి!
నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం.
పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment