సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. కిరాణా, మందులు, ఆహారం వంటి నిత్యావసరాలను పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ ప్రజలకు, ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సందర్బంగా కొన్ని ఆన్‌లైన్ సరఫరా సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ సంక్షోభ సమయంలో సేవలందిస్తున్నతాము సెక్యూరిటీ గార్డుల నుంచి దాడులు, పోలీసులనుంచి వేధింపులను ఎదుర్కొంటున్నామని ఆరోపించాయి. అంతేకాకుండా పోలీసుల అత్యుత్సాహం వల్ల ఏకంగా 15 వేల లీటర్ల పాలు, 10వేల కిలోల కూరగాయలను పారవేయవలసి వచ్చిందని వెల్లడించాయి.
పాలు, కూరగాయలు, మందులు, ఆహారం, తదితర సరుకులును డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులను పోలీసులు వేధిస్తున్నారని , డెలివరీ బాయ్స్ పై భౌతిక దాడులు కూడా చేశారని ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. తద్వారా లాక్‌డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో అటు జనం, ఇటు తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరారు. గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు తమను దూషించడం, కొట్టడమే కాకుండా, డెలివరీ ఏజెంట్‌ను అరెస్ట్ కూడా చేశారని బిగ్ బాస్కెట్, ప్రెష్ మెనూ, పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ గణేష్ చెప్పారు. దీంతో తమ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?)
‘అన్ని చోట్ల పోలీసులకు ఇది ఒక ముఖ్యమైన సేవ అని తెలియదు, అందుకే వారు చాలా సందర్భాల్లో, కఠినంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలను కొడుతున్నారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కొట్టవద్దు’ అని గణేష్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్న మా రైడర్‌లను వేధిస్తున్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూసుకోవాలి కదా అంటూ కెప్టెన్ గ్రబ్‌కు చెందిన కరణ్ నంబియార్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేరళలో, రోగికి సేవ చేయడానికి వెళుతున్న తమ ఆరోగ్య కార్యకర్తలలో ఒకరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. డెలివరీని అత్యవసర సేవగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నామని హోమ్ డెలివరీ అసోసియేట్స్ ప్రతినిధి సౌరభ్ కుమార్ కోరారు.(కశ్మీర్లో కరోనా తొలి మరణం)
అత్యవసర సర్వీసులను మాత్రం మినహాయింపు ఉన్నప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 2 వ రోజు స్థానిక అధికారుల అంతరాయాలు కారణంగా 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంతంగా పారవేయవలసి వచ్చిందని, కిరాణా, పాల డెలివరీ వెబ్‌సైట్ మిల్క్ బాస్కెట్ ప్రకటించింది. అలాగే గుర్గావ్, నోయిడా, హైదరాబాద్ లలో తాజా పాలను అందించలేమని ఆన్‌లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం ప్రెష్ హోం తెలిపింది. (కరోనాపై యుద్ధం : భారత్పై చైనా ప్రశంసలు)
మరోవైపు హోం డెలివరీ సందర్బంల్లో తలెత్తుతున్న ఆటంకాలపై స్పందించిన నీతి ఆయోగ్ సీఈవో సంస్థ గుర్తింపు కార్డులు ఉన్న హోం డెలివరీ ప్రతినిధులను అడ్డుకోవద్దని బుధవారం ప్రకటించారు. సంబంధిత ఆదేశాలను అధికారులకు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో అవసరమైన సామాగ్రి ప్రజలకు చేరేలా కూరగాయల అమ్మకందారులకు, కిరాణా దుకాణదారులకు ఈ-పాసులు జారీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి ఎంఎస్ రంధావా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment