home delivery services
-
వీళ్లకు న్యాయం దక్కేనా?
అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ..జొమాటో.. ఊబర్.. ఓలా.. అర్బన్ క్లాప్.. బిగ్ బాస్కెట్.. కంట్రీ డిలైట్.. ఒక్కటేంటి.. ఏ పని కావాలన్నా యాప్‌లే. స్మార్ట్ ఫోన్ టచ్ దూరంలో ఆ సర్వీసులు.. మారిన కాలం అందిస్తున్న సౌకర్యాలు! ఈ డెలివరీ సర్వీసెస్‌కు కస్టమర్స్ నుంచి రేటింగ్ ఉంది.. యాజమాన్యాల నుంచే భద్రత, భరోసా ఉందా అన్నిరకాలుగా? మేడే సందర్భంగా ఓ కథనం.. ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. అరచేతి పట్టే స్మార్ట్ ఫోన్‌తో అన్నీ అనుకున్న టైమ్‌లో.. కోరుకున్నట్లుగానే మన చెంతకే వచ్చేస్తున్నాయి. ఉప్పు, పప్పు, పాల దగ్గరి నుంచి ఇంటికి, మనిషికి అవసరమైన ప్రతీది గుమ్మం ముందే వాలిపోతున్నాయి. ఇలాంటి సేవల కోసమే రోజుకో యాప్ స్టార్టప్ పుట్టుకొస్తోంది. యూజర్ల కోసం.. యూజర్ల చెంతకే.. యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందిస్తోంది. పైసా, టైమ్ కలిసొస్తుండడంతో అలవాటు పడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. మరి ఆ సేవలను మోసుకొస్తోంది ఎవరు? డెలివరీ సర్వీస్ ఉద్యోగులు. కొండంత భారాన్ని భుజాన వేసుకుని బయలుదేరే బాహుబలులు వాళ్లు. చదవుకున్నోడు.. చదువులేనోడు, వయసు తారతమ్యం, ఆడామగా తేడా ఉండదు అక్కడ. పార్ట్ టైమ్ కావొచ్చు ఫుల్‌టైం కావొచ్చు.. మోడర్న్ ఏజ్‌లో అత్యంత ఈజీగా దొరికే జాబ్‌లు ఇవి. బడుగు జీవుల నుంచి కాస్త ఉన్నోడి దాకా! అంతా పైసా కోసమే ఉరుకులు పరుగులు. ఎండనక వాననక రేయింబవళ్లు నిబద్ధత చూపించే నైజం వాళ్లది. వందలు కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారు అలాంటి శ్రమజీవులు. సోషల్ మీడియా హీరోలు..షీరోలు డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ప్రతి సేవనూ అందించే డెలివరీ, సర్వీస్ పార్ట్‌నర్స్‌తో కంపెనీలకు పని మరింత సులువు అయిపోయింది. ఏ విభాగంలో పని చేసినా ఒక కమిట్మెంట్తోనే సాగుతుంది వీళ్ల ప్రయాణం. ఒకరకంగా కరోనా టైమ్ నుంచి వీళ్ల గొప్పదనం ఏంటో.. మొత్తం ప్రపంచమే గుర్తించింది. ‘అన్నా, సార్, మేడమ్..’ పిలుపు ఏదైనా వాళ్లు కోరుకునేది ఒక్కటే.. తమ సేవలకుగానూ మంచి రేటింగ్ ఇవ్వమని! కాస్త ఆలస్యమైతే ఎంత తిట్టుకుంటారో అనే ఆలోచన.. వాళ్లను స్థిమితంగా ఉండనివ్వదు. కస్టమర్ల అసహనం తప్పించుకునేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎండను ఓర్చుకుంటారు. వానల్ని, వరదల్ని లెక్క చేయరు. చలిని లెక్కచేయరు. పగలు రాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా.. చివరకు ఆకలి, అనారోగ్యాల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే బతుకు జీవులు వీళ్లు. అందుకే మీడియాలో.. సోషల్ మీడియాలో ‘హీరోలు, షీరోలు’గా వీళ్ల కథలను, వ్యథలను చూడగలుగుతున్నాం. వీళ్లకంటూ ఓ పేరుంది, కానీ.. ప్రత్యేక కాల పరిమితితో అంటే పార్ట్ టైమ్ లేదంటే ఫ్రీలాన్స్‌గా పనిచేసే ఈ ఉద్యోగులను గిగ్స్గా పరిగణిస్తుంటారు. 20వ శతాబ్దంలో ‘జాజ్’ యాస నుంచి గిగ్ అనే పదం పుట్టింది.పేరుకు ‘గిగ్’ సేవా రంగం పరిధిలో ఉన్నప్పటికీ.. వీళ్లు ఉద్యోగులా? కార్మికులా? వ్యాపారులా? భాగస్వాములా? కిందిస్థాయి ఉద్యోగులా? ఇలా వీళ్లకు ఓ గుర్తింపంటూ లేదు. కంపెనీల దృష్టిలో కేవలం డెలివరీ పార్ట్నర్స్ మాత్రమే! ‘అత్యవసరాల’ పేరిట అంతా కలసి అద్భుతాలు చేస్తారు. కానీ, కష్టం వస్తే.. భాగస్వాములు కాదు కదా.. వాళ్లను ఎలా పిలవాలో తెలియని పరిస్థితి మన దేశంలో. జనాలకు బాగా దగ్గరైన వీళ్లకంటూ చట్టాల్లో ఒక నిర్వచనం, ఉద్యోగ భద్రత, హక్కులు లేకపోవడం.. నయా జమానా ఉపాధిగా గిగ్ ఎకానమీ మోసుకొచ్చిన కొత్త చిక్కు. క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారం కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. డెలవరీ సర్వీసుల్లో ఉద్యోగినులు! టూమచ్ వర్క్.. జీతం? ఈ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఒక షిఫ్ట్, ఒక టైమింగ్ అంటూ ఉండదు. జీతం బదులు తమ వాటా కట్ చేసుకుని కమిషన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అంటే గిగ్ వర్కర్లకు.. అవసరం కొద్దీ పని.. అందుకు తగ్గట్లు డబ్బు సంపాదన ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కోసారి అది ఆశించినట్లు ఉండకపోవచ్చు కూడా. టైమ్‌కు పని జరగకపోతే.. కోతే. జీతం, కమిషన్ల సంగతి పక్కనపెడితే.. ఇతర సౌకర్యాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని స్టార్టప్ యాప్‌లు(కంపెనీలు). ఫెయిర్‌వర్క్ లిస్ట్‌లో ఆయా కంపెనీలకు ప్రతి ఏటా దక్కుతున్న మార్కులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. లైఫ్ ఒక రేస్ డెలివరీ బాయ్స్ కాలంతో పాటే పరిగెత్తాలి. కాస్త ఆలస్యమైనా కస్టమర్ల నుంచి తిట్లు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లు తప్పవు. ఒక్కోసారి ఇది వాళ్లకు దక్కే ప్రతిఫలం(కమిషన్, జీతం..) మీద కూడా పడుతుంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్, సరైన రోడ్లు ఉండవు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. సిగ్నల్స్ జంప్ చేసినా.. వేగంగా వెళ్తే పడే ట్రాఫిక్ చలాన్లు.. అదనపు తలనొప్పులు. వీటికి తోడు వివక్షలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఫలానా కమ్యూనిటీ అనగానే ఫుడ్ క్యాన్సిల్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించొద్దంటూ చిన్నచూపు చూడడం లాంటి ఘటనలు చూస్తున్నవే. వీటికి అదనంగా ‘నిమిషాల్లోనే డెలివరీ..’ అంటూ తమ ప్రకటనలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ స్టార్టప్‌లు. ఇలాంటివి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. మరి వాళ్ల భద్రతకు ఆయా కంపెనీలు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాయా? అసలు ఇన్సూరెన్స్‌ల పరిధిలోకి వీళ్లను తీసుకొస్తున్నాయా? లేదు.. చట్టంలో అలాంటిదేం లేదు. కేవలం ఏదో ఒకటి, రెండు ఘటనల్లో మొక్కుబడి సాయం అందుతోంది అంతే. అందుకే పెరుగుతున్న రేట్లు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమ బతుకులూ బాగుపడాలని, తమకేమైనా జరిగితే కుటుంబాలకు భద్రత అందాలని ఆశిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఎర్రటి ఎండలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన దుర్గా మీనాగా శర్మ అనే గ్రాడ్యుయేట్‌కు క్రౌడ్ ఫండిగ్ ద్వారా బైక్‌ను అందించాడు ఆదిత్య శర్మ అనే కుర్రాడు. రాజాస్థాన్‌లో ఇటీవల జరిగిన విషయం ఇది. మార్గదర్శకాలు ఉండాల్సిందే! ఆ మధ్య గురుగ్రామ్‌లో మానిక్యూర్ నుంచి కార్పెట్ క్లీనింగ్ దాకా సేవలు అందించే ఓ కంపెనీలో.. మహిళా ఉద్యోగులకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. కంపెనీ తెచ్చిన కొత్త నిబంధనలు తమ ఆదాయానికి గణనీయంగా గండి కొడుతున్నాయని ఆఫీస్ ముందే టెంట్లు వేసుకుని నిరసనలకు దిగారు. ఆ సమయంలో సదరు కంపెనీ.. వాళ్లను ఉద్యోగులుగా కాకుండా భాగస్వాములుగా పేర్కొని(భాగస్వాములు కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు కదా!) కోర్టు ఆదేశాలతో ఆ నిరసనలను నిర్వీర్యం చేయించింది. మరి భాగస్వాములుగా వాళ్లకు అందాల్సినవన్నీ అందించిందా? అంటే అదీ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో, అంతెందుకు జీడీపీలోనూ ఉడతాసాయంగా వీళ్ల భాగం ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గిగ్ ఎకానమీతో ఆదుకుంటున్నారు కాబట్టే వీళ్ల రక్షణ కోసం మార్గదర్శకాలు కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే క్రమక్రమంగా ఈ రంగానికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ భాగస్వాముల ప్రమాదాలపై స్పందిస్తూ.. ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంట్లో స్వయంగా ఇదే గళం వినిపించారు కూడా. డెలివరీలు చేసేది కంపెనీలు కాదు.. అందులో పని చేసేవాళ్లు. వ్యక్తిగత వాహనాల మీద వెళ్తూ యాక్సిడెంట్లలో గాయపడినా.. చనిపోయినా.. అవి కమర్షియల్ వాహనాలు అనే వంక చూపిస్తూ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి బీమా కంపెనీలు. కాబట్టి, వాళ్ల రక్షణకు మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తు చేశారాయన. తమ హక్కుల కోసం సమ్మెకు దిగిన డెలివరీ సర్వీస్ ఉద్యోగులు.. వానలు, వరదల్లోనూ తప్పని డెలివరీ సర్వీస్ తిప్పలు! కరోనా టైమ్‌లో కుదేలు కరోనా అనే వైరస్.. వందల కోట్ల మంది బతుకుల్ని మార్చి పడేసింది. చాలామందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఈ చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగులూ ఉన్నారు. లాక్డౌన్లతో ఎందరికో పని లేకుండా పోయింది. పూట గడవక వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో యాజమాన్య యాప్ కంపెనీలు.. మొండి చేయి చూపించాయి. కార్మిక చట్టంలో తమకంటూ ఓ పేజీ లేకుండా పోయేసరికి అభద్రతా భావంలోకి కూరుకుపోయారు వాళ్లు. అందుకే మేల్కొని తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు. ఎందుకు కష్టమవుతోంది? ఎదుగూ బొదుగూలేని జీవితాలు ఎవరికైనా సహిస్తాయా? కనీసం కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని అనుకుంటారు. కానీ, లక్షల్లో ఉన్న గిగ్ వర్కర్లు తమ బతుకులకు ఓ భరోసా.. హక్కులకు కనీస రక్షణ ఉంటే చాలని కోరుతున్నారు. మన దేశంలో ఒక నిర్దిష్టత అంటూ లేని ఉద్యోగుల కోసం అసంఘటిత కార్మికుల సామాజిక సంక్షేమ భద్రత చట్టంఒకటి ఉంది. కానీ, గిగ్ వర్కర్లను ఈ చట్టం కింద చేర్చలేదు. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వాళ్లు కావడంతో.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన, నిర్దిష్టమైన డేటా ఉండడం లేదనేది ప్రభుత్వాల వాదన. అయినప్పటికీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. నవంబర్ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కింద డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. ఇలాంటి ఉద్యోగులను.. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. కానీ, అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు. సాధారణంగా యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఇలాంటి గిగ్ వర్కర్లను నేరుగా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి ఆదుకుంటున్నాయి.మన దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకవేళ వర్తింపచేయాలనుకున్నా.. స్టార్టప్ యాప్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయమని న్యాయ నిపుణలు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ, లేదంటే కనీసం నిబంధనలతోనైనా గిగ్ ఉద్యోగుల భధ్రతకు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సి ఉంది. లక్షల మంది శ్రమ జీవుల ఎదురు చూపులు ఎప్పటికీ ఫలిస్తాయో మరి! -భాస్కర్ శ్రీపతి -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్జీని ఇంటివద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చమురు కంపెనీలకు త్వరలోనే అనుమతినివ్వనుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నలాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న (శుక్రవారం) తెలిపారు. డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కాగా భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2018లో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు కొనుగోలుదారు ఇండియాలో కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోయింది. ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70 శాతం తగ్గింది. మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, మొబైల్ పెట్రోల్ పంపుల సాయంతో ఇంటి వద్దకే పెట్రోలు అందించనున్నామని ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ తెలిపింది. చదవండి : రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు -
ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్జీ: ప్రధాన్
న్యూఢిల్లీ: డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎల్పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్ వ్యాన్ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. -
15 వేల లీటర్లు నేల‘ పాలు’
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. కిరాణా, మందులు, ఆహారం వంటి నిత్యావసరాలను పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ ప్రజలకు, ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సందర్బంగా కొన్ని ఆన్లైన్ సరఫరా సంస్థలు సంచలన ఆరోపణలు చేశాయి. ఈ సంక్షోభ సమయంలో సేవలందిస్తున్నతాము సెక్యూరిటీ గార్డుల నుంచి దాడులు, పోలీసులనుంచి వేధింపులను ఎదుర్కొంటున్నామని ఆరోపించాయి. అంతేకాకుండా పోలీసుల అత్యుత్సాహం వల్ల ఏకంగా 15 వేల లీటర్ల పాలు, 10వేల కిలోల కూరగాయలను పారవేయవలసి వచ్చిందని వెల్లడించాయి. పాలు, కూరగాయలు, మందులు, ఆహారం, తదితర సరుకులును డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులను పోలీసులు వేధిస్తున్నారని , డెలివరీ బాయ్స్ పై భౌతిక దాడులు కూడా చేశారని ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. తద్వారా లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో అటు జనం, ఇటు తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపింది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసర జోక్యం చేసుకోవాలని ఆన్ లైన్ రీటైలర్స్ కోరారు. గడిచిన కొన్ని రోజులుగా పోలీసులు తమను దూషించడం, కొట్టడమే కాకుండా, డెలివరీ ఏజెంట్‌ను అరెస్ట్ కూడా చేశారని బిగ్ బాస్కెట్, ప్రెష్ మెనూ, పోర్టియా మెడికల్ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ప్రమోటర్ గణేష్ చెప్పారు. దీంతో తమ కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) ‘అన్ని చోట్ల పోలీసులకు ఇది ఒక ముఖ్యమైన సేవ అని తెలియదు, అందుకే వారు చాలా సందర్భాల్లో, కఠినంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలను కొడుతున్నారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను కొట్టవద్దు’ అని గణేష్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్న మా రైడర్లను వేధిస్తున్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా చూసుకోవాలి కదా అంటూ కెప్టెన్ గ్రబ్‌కు చెందిన కరణ్ నంబియార్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేరళలో, రోగికి సేవ చేయడానికి వెళుతున్న తమ ఆరోగ్య కార్యకర్తలలో ఒకరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. డెలివరీని అత్యవసర సేవగా ప్రకటించమని అభ్యర్థిస్తున్నామని హోమ్ డెలివరీ అసోసియేట్స్ ప్రతినిధి సౌరభ్ కుమార్ కోరారు.(కశ్మీర్లో కరోనా తొలి మరణం) అత్యవసర సర్వీసులను మాత్రం మినహాయింపు ఉన్నప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. లాక్ డౌన్ ప్రకటించిన 2 వ రోజు స్థానిక అధికారుల అంతరాయాలు కారణంగా 15 వేల లీటర్ల పాలు, 10,000 కిలోల కూరగాయలను బలవంతంగా పారవేయవలసి వచ్చిందని, కిరాణా, పాల డెలివరీ వెబ్సైట్ మిల్క్ బాస్కెట్ ప్రకటించింది. అలాగే గుర్గావ్, నోయిడా, హైదరాబాద్ లలో తాజా పాలను అందించలేమని ఆన్లైన్ గ్రాసరీ రీటైలర్ గ్రోఫర్స్ అండ్ మీట్ డెలివరీ ప్లాట్‌ఫాం ప్రెష్ హోం తెలిపింది. (కరోనాపై యుద్ధం : భారత్‌పై చైనా ప్రశంసలు) మరోవైపు హోం డెలివరీ సందర్బంల్లో తలెత్తుతున్న ఆటంకాలపై స్పందించిన నీతి ఆయోగ్ సీఈవో సంస్థ గుర్తింపు కార్డులు ఉన్న హోం డెలివరీ ప్రతినిధులను అడ్డుకోవద్దని బుధవారం ప్రకటించారు. సంబంధిత ఆదేశాలను అధికారులకు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో అవసరమైన సామాగ్రి ప్రజలకు చేరేలా కూరగాయల అమ్మకందారులకు, కిరాణా దుకాణదారులకు ఈ-పాసులు జారీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజా సంబంధాల అధికారి ఎంఎస్ రంధావా తెలిపారు. -
త్వరలో కుక్కలతో డెలివరీ!
గల్లీలో ఓ కారాగింది. ఆ కారుకు డ్రైవర్ లేడు! అందులోంచి నాలుగు కుక్కలు గబగబా దిగాయి. దిగి నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్లాయి. వాటి వెన్నుపై బ్యాగులు కూడా ఉన్నాయి. కాసేపటికి అవి మళ్లీ తిరిగొచ్చి ఆ కారులోనే కూర్చున్నాయి. ఇంతకవేం చేశాయనేగా సందేహం? హోం డెలివరీ! కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల్ని డోర్‌స్టెప్ వద్ద డెలివరీ చేసే డెలివరీ డాగ్స్ అవి! ఫ్యూచర్లో డెలివరీ బాయ్స్ స్థానంలో కుక్కలొస్తాయట! అయితే, అవి నిజమైన కుక్కలు కావండోయ్. ఈ ఫొటోలో కనిపించేవి రోబో డాగ్స్, వాటి పక్కనున్నదేమో రోబో టాక్సీ. ఇలాంటి సన్నివేశం ఊహిస్తేనే గమ్మత్తుగా ఉంది కదూ? తొందర్లోనే ఈ కల నిజమయ్యే అవకాశం ఉంది. ఈ రోబోట్‌ను స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జురిచ్ వర్సిటీకి చెందిన రొబిటిక్స్ ల్యాబ్ శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. ఇటీవలే విజయవంతంగా ట్రయిల్ కూడా నిర్వహించారు. ఆ ట్రయిల్ వీడియోలు నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. త్వరలోనే ఇవి డెలివరీ డాగ్స్‌గా ప్రపంచానికి పరిచయం కాబోతున్నట్లు వారు ప్రకటించారు. 30 కిలోలుండే ఈ రోబో డాగ్స్ పది కిలోల వరకు బరువు మోయగలవు. మామూలుగా ఐదో ఫ్లోర్లో ఉన్న ఇంటికి డెలివరీ చేయాలంటే డెలివరీ బాయ్ విసుక్కుంటాడు కదా? ఈ రోబో డాగ్స్ మాత్రం ఎన్ని మెట్లున్నా ఎక్కగలవు. కృత్రిమ డోర్ బెల్‌తో సిగ్నల్ ఇచ్చి కస్టమర్‌కు వస్తువునిచ్చి.. డ్యాన్స్ చేసి వారిని సంతోష పెడతాయట! -
పుణెలో ప్లాస్టిక్ బ్యాన్ ఎఫెక్ట్
-
రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే...
పుణె : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై జరిమానాలు విధిస్తూ కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే జరిమానా తప్పించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యయ్యేందుకు పుణేకు చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న యత్నం చేస్తోంది. తమ రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకువెళ్లే కస్టమర్లకు కవర్లకు బదులుగా స్టీల్ డబ్బాల్లో భోజనాన్ని అందిస్తోంది. ఇందుకుగానూ రూ. 200 కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. బాక్స్‌లను రిటర్న్ చేయగానే ఆ డిపాజిట్ ఎమౌంట్‌ను తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం మరికొన్ని రెస్టారెంట్లు ఇదే ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైపోయాయి. మంచి నిర్ణయమే కానీ, ప్లాస్టిక్ బ్యాన్పై మహా సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా వ్యాపారస్థులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ‘పర్యావరణ హితం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. అయితే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కావాలంటే అందుకు తగిన ప్రత్యామ్నాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయని.. దీని వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటోందని’ రెస్టారెంట్ ఓనర్ గణేశ్ శెట్టి చెబుతున్నారు. -
ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టదలుచుకున్న ‘హోం డెలివరీ’ పథకానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ పథకం అమలుకు నో చెప్పడంతో ఢిల్లీ ప్రభుత్వం షాక్‌కు గురైంది. దీంతో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఎల్జీపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఎన్నో ప్రయాసలకు ఒనగూర్చి ప్రజలకు మంచి చేద్దామనుకుంటే అనిల్ బైజల్ అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు సక్రమమైన పాలన అందించడం ఎల్జీకి ఇష్టం లేదని అన్నారు. అందుకే అవినీతి రహిత పాలనను అందించాలనుకుంటున్న ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రజా అవసరాలు కలిగి ఉన్న విషయాల్లో ఎల్జీ అధికారాలు ఉండటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ఈ సమస్య వల్ల కేజ్రీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం వద్ద మళ్లీ కోల్డ్ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకాన్ని తిరస్కరించలేదని, కేవలం పునః సమీక్షించమని కోరినట్లు ఎల్జీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఏంటీ ‘హోం డెలివరీ’ పథకం హోం డెలివరీ పథకాన్ని నెల రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న బేసిక్ సర్వీసుల నుంచి పథకాల వరకూ ప్రజల ఇళ్లకు వెళ్లి సర్వీసులు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. కేజ్రీవాల్ పథకాన్ని ప్రకటించిన అనంతరం ఢిల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న 40 రకాల సర్వీసుల్లో 35 సర్వీసులను హోం డెలివరీ పథకం కిందకు తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ సర్వీసులు ఉన్నాయి కదా..? ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉండగా హోం డెలివరీ పథకం ప్రాముఖ్యం ఏంటని ఎల్జీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆన్లైన్ సర్వీసులు ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. హోం డెలివరీ పథకం వల్ల ప్రజలు గంటల కొద్దీ ప్రభుత్వ కార్యాలయాల్లో నిల్చొవాల్సిన బాధ తప్పుతుందని చెప్పింది.