పుణె : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ కవర్లు వాడే రీటైలర్స్, షాపు ఓనర్లపై జరిమానాలు విధిస్తూ కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై రీటైలర్ అసోసియేషన్ సమ్మె చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే జరిమానా తప్పించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యయ్యేందుకు పుణేకు చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న యత్నం చేస్తోంది. తమ రెస్టారెంట్ నుంచి పార్శిల్ తీసుకువెళ్లే కస్టమర్లకు కవర్లకు బదులుగా స్టీల్ డబ్బాల్లో భోజనాన్ని అందిస్తోంది. ఇందుకుగానూ రూ. 200 కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. బాక్స్‌లను రిటర్న్ చేయగానే ఆ డిపాజిట్ ఎమౌంట్‌ను తిరిగి ఇచ్చేస్తారు. ప్రస్తుతం మరికొన్ని రెస్టారెంట్లు ఇదే ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమైపోయాయి.
మంచి నిర్ణయమే కానీ,
ప్లాస్టిక్ బ్యాన్‌పై మహా సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా వ్యాపారస్థులు మాత్రం ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ‘పర్యావరణ హితం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. అయితే ప్లాస్టిక్ నిషేధం సరిగ్గా అమలు కావాలంటే అందుకు తగిన ప్రత్యామ్నాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయని.. దీని వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటోందని’ రెస్టారెంట్ ఓనర్ గణేశ్ శెట్టి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment