వాహనదారులకు గుడ్ న్యూస్ | Oil companies may provide all fuels at doorstep : Dharmendra Pradhan  | Sakshi
Sakshi News home page

ఇక ఇంటి వద్దకే పెట్రోల్‌,సీఎన్‌జీ

Published Sat, May 30 2020 1:04 PM | Last Updated on Sat, May 30 2020 1:30 PM

Oil companies may provide all fuels at doorstep : Dharmendra Pradhan  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులకు ఊరటనిచ్చేలా పెట్రోలు కూడా ఇకపై డోర్ డెలివరీ కానుంది. ప్రజల సహాయార్ధం పెట్రోల్ సీఎన్‌జీని ఇంటివద్దకే పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చమురు కంపెనీలకు త్వరలోనే అనుమతినివ్వనుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్నలాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  నిన్న (శుక్రవారం) తెలిపారు.

డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, పెట్రోల్, సీఎన్‌జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. 

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించే కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో వినియోగదారులు ఇంటి వద్దకే ఇంధనాలను తెప్పించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. 2018 సెప్టెంబర్‌ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్‌ వ్యాన్‌ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అయితే, పెట్రోల్, సీఎన్‌జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్‌ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

కాగా భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2018లో భారతదేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు కొనుగోలుదారు ఇండియాలో కరోనా కారణంగా డిమాండ్ భారీగా పడిపోయింది. ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70 శాతం తగ్గింది. మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, మొబైల్ పెట్రోల్ పంపుల సాయంతో ఇంటి వద్దకే పెట్రోలు అందించనున్నామని ఇటీవల ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ  తెలిపింది. చదవండి : రెమెడిసివిర్‌పై గిలియడ్ మరో కీలక అడుగు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement