హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ సేల్స్ జరిగే జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని చంచల్‌గూడ పెట్రోల్ బంక్‌కు కూడా వాహనాల తాకిడి తగ్గిపోయింది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కట్టాల్సిందే.. కానీ, కరోనా భయంతో వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గిపోయింది. పెట్రో సేల్స్ 40 శాతానికి, డీజిల్ 25 శాతానికి పడిపోయాయి. సాధారణంగా దినసరి పెట్రోల్ అమ్మకాలు 28 వేల లీటర్ల నుంచి 30 వేల లీటర్లకు గాను తాజాగా కరోనా నేపథ్యంలో 13 వేల నుంచి 14 వేల లీటర్లకు, అదేవిధంగా డీజిల్ 25 వేల నుంచి 28 వేల లీటర్ల వరకు గాను 7 వేల నుంచి 8 వేల లీటర్లకు చేరాయి. ఇక మిగిలిన పెట్రోల్ బంకుల పరిస్థితి అధ్వానంగా తయారైంది.
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి నగరవాసులను వణికిస్తోంది. రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీంతో ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. పెట్రోలు, డీజిల్ వాడకం గణనీయంగా తగ్గిపోయింది. పెట్రో ఉత్పత్తుల విక్రయాలు తగ్గడంతో ప్రభుత్వ ఖజానాపై కూడా ప్రభావం పడింది. పెట్రోలు, డీజిల్‌పై సమకూరే ‘విలువ ఆధారిత పన్ను(వ్యాట్)’ పూర్తిగా పడిపోయింది.
రోడ్డెక్కని వ్యక్తిగత వాహనాలు
ఉద్యోగుల రాకపోకల కోసం ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వాహనాలను వినియోగించేవి.. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. దాంతో వాహనాల వినియోగం తగ్గింది. ఆటోలు, క్యాబ్‌లకు గిరాకీ లేకుండా పోయింది. సరుకుల రవాణ కూడా పరిమితంగా సాగుతోంది. దీనికితోడు డీజిల్ ఎక్కువగా వినియోగించే ఆర్టీసీ సిటీ బస్సులు కూడా తిరగడం లేదు.
పడిపోయిన పెట్రో విక్రయాలు
నగరవ్యాప్తంగా 628 వరకు పెట్రోల్ బంకులు ఉండగా, శివార్లలోని ఘట్‌కేసర్, నాచారం, చర్లపల్లిలోని ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల టెర్మినల్ డిపోల నుంచి నిత్యం వందలాది ట్యాంకర్లలో సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా అయ్యేది. పెట్రోల్ బంకుల ద్వారా రోజూ 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో 40–50 శాతం, మేలో 30 శాతం వరకు తగ్గాయి. జూన్‌లో పెట్రోలు విక్రయాలు 24 శాతం, డీజిల్ విక్రయాలు 19 శాతం మేర తగ్గాయి. జూలై సైతం అదే తీరు సాగుతోంది.
తగ్గిన పన్నులు
ప్రభుత్వ ఖాజానాకు పెట్రోల్, డీజిల్ ద్వారా పన్ను రూపంలో రాబడి తగ్గిపోయింది. పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం మేర వ్యాట్ వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి నెలా రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు వ్యాట్ వసూలయ్యేది. లాక్‌డౌన్ నుంచి బాగా పడిపోయింది.
కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది
సాధారణంగా రోజుకు 12వేల లీటర్ల పెట్రోల్, అదేస్థాయిలో డీజిల్ సేల్స్ జరిగేవి.. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రోజూ 6 నుంచి 7 వేల లీటర్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. బంకుల నిర్వహణ భారంగా తయారైంది. – నగరంలోని ఒక పెట్రోల్ బంకు యాజమాని
Comments
Please login to add a commentAdd a comment