సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు పడిపోయాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 90 శాతం వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యవసర సేవల అంబులెన్సులు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, వైద్య, పోలీసు, పౌరసరఫరాల విభాగం, మార్కెటింగ్ వాహనాల తప్ప మిగితావి రోడ్డు ఎక్కడం లేదు. వ్యక్తిగత వాహనాలు ఐదు శాతం బయటికి వచ్చినా.. నామమాత్రపు రాకపోకలకు పరిమితమవుతున్నాయి. దీంతో గడచిన పక్షం రోజులుగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలు నెలచూపు చూస్తున్నాయి.
గత నెల జనతా కర్ఫ్యూ మరసటి రోజు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు విపరీతంగా పెరిగినా ఆ తర్వాత పడిపోయాయి. ప్రస్తుతం నగరంలో పెట్రోల్ 10 శాతం, డీజిల్ 20 శాతానికి మించి అమ్మకాలు సాగడం లేదని పెట్రోల డీలర్ల సంఘం ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని బంకులకు సాధారణ అమ్మకాల్లో కనీసం రెండు శాతం కూడా జరగని పరిస్థితి నెలకొంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం 24 గంటలపాటు పెట్రోల్ బంకులు సేవలు అందిస్తున్నట్లు పెట్రోల్ బంకుల యాజమానులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్, నాచారం, చర్లపల్లిలోని ఐవోసీ, బీపీసీ, హెచ్‌పీసీఎల్ ఆయిల్ కంపెనీల టెర్మినల్ డిపోల నుంచి నిత్యం వందలాది ట్యాంకర్లలో సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా అవుతుండేది. దీంతో పెట్రోల్ బంకుల ద్వారా రోజూ 40 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగేవి. లాక్‌డౌన్ నేపథ్యంలో గత పక్షం రోజులుగా అమ్మకాలు నేల చూపులు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment