అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ..జొమాటో.. ఊబర్.. ఓలా.. అర్బన్ క్లాప్.. బిగ్ బాస్కెట్.. కంట్రీ డిలైట్.. ఒక్కటేంటి.. ఏ పని కావాలన్నా యాప్‌లే. స్మార్ట్ ఫోన్ టచ్ దూరంలో ఆ సర్వీసులు.. మారిన కాలం అందిస్తున్న సౌకర్యాలు! ఈ డెలివరీ సర్వీసెస్‌కు కస్టమర్స్ నుంచి రేటింగ్ ఉంది.. యాజమాన్యాల నుంచే భద్రత, భరోసా ఉందా అన్నిరకాలుగా? మేడే సందర్భంగా ఓ కథనం..
ప్రపంచం ఇప్పుడు చిన్నదైపోయింది. అరచేతి పట్టే స్మార్ట్ ఫోన్‌తో అన్నీ అనుకున్న టైమ్‌లో.. కోరుకున్నట్లుగానే మన చెంతకే వచ్చేస్తున్నాయి. ఉప్పు, పప్పు, పాల దగ్గరి నుంచి ఇంటికి, మనిషికి అవసరమైన ప్రతీది గుమ్మం ముందే వాలిపోతున్నాయి. ఇలాంటి సేవల కోసమే రోజుకో యాప్ స్టార్టప్ పుట్టుకొస్తోంది. యూజర్ల కోసం.. యూజర్ల చెంతకే.. యూజర్ ఫ్రెండ్లీ సేవలను అందిస్తోంది. పైసా, టైమ్ కలిసొస్తుండడంతో అలవాటు పడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. మరి ఆ సేవలను మోసుకొస్తోంది ఎవరు? డెలివరీ సర్వీస్ ఉద్యోగులు.
కొండంత భారాన్ని భుజాన వేసుకుని బయలుదేరే బాహుబలులు వాళ్లు. చదవుకున్నోడు.. చదువులేనోడు, వయసు తారతమ్యం, ఆడామగా తేడా ఉండదు అక్కడ. పార్ట్ టైమ్ కావొచ్చు ఫుల్‌టైం కావొచ్చు.. మోడర్న్ ఏజ్‌లో అత్యంత ఈజీగా దొరికే జాబ్‌లు ఇవి. బడుగు జీవుల నుంచి కాస్త ఉన్నోడి దాకా! అంతా పైసా కోసమే ఉరుకులు పరుగులు. ఎండనక వాననక రేయింబవళ్లు నిబద్ధత చూపించే నైజం వాళ్లది. వందలు కాదు.. వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నారు అలాంటి శ్రమజీవులు.
సోషల్ మీడియా హీరోలు..షీరోలు
డెలివరీ సేవలు పెరగడం, ఇంటి వద్దకే ప్రతి సేవనూ అందించే డెలివరీ, సర్వీస్ పార్ట్‌నర్స్‌తో కంపెనీలకు పని మరింత సులువు అయిపోయింది. ఏ విభాగంలో పని చేసినా ఒక కమిట్‌మెంట్‌తోనే సాగుతుంది వీళ్ల ప్రయాణం. ఒకరకంగా కరోనా టైమ్ నుంచి వీళ్ల గొప్పదనం ఏంటో.. మొత్తం ప్రపంచమే గుర్తించింది. ‘అన్నా, సార్, మేడమ్..’ పిలుపు ఏదైనా వాళ్లు కోరుకునేది ఒక్కటే.. తమ సేవలకుగానూ మంచి రేటింగ్ ఇవ్వమని! కాస్త ఆలస్యమైతే ఎంత తిట్టుకుంటారో అనే ఆలోచన.. వాళ్లను స్థిమితంగా ఉండనివ్వదు. కస్టమర్ల అసహనం తప్పించుకునేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఎండను ఓర్చుకుంటారు. వానల్ని, వరదల్ని లెక్క చేయరు. చలిని లెక్కచేయరు. పగలు రాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా.. చివరకు ఆకలి, అనారోగ్యాల్ని సైతం లెక్కచేయకుండా శ్రమించే బతుకు జీవులు వీళ్లు. అందుకే మీడియాలో.. సోషల్ మీడియాలో ‘హీరోలు, షీరోలు’గా వీళ్ల కథలను, వ్యథలను చూడగలుగుతున్నాం.
వీళ్లకంటూ ఓ పేరుంది, కానీ..
ప్రత్యేక కాల పరిమితితో అంటే పార్ట్ టైమ్ లేదంటే ఫ్రీలాన్స్‌గా పనిచేసే ఈ ఉద్యోగులను గిగ్స్‌గా పరిగణిస్తుంటారు. 20వ శతాబ్దంలో ‘జాజ్’ యాస నుంచి గిగ్ అనే పదం పుట్టింది.పేరుకు ‘గిగ్’ సేవా రంగం పరిధిలో ఉన్నప్పటికీ.. వీళ్లు ఉద్యోగులా? కార్మికులా? వ్యాపారులా? భాగస్వాములా? కిందిస్థాయి ఉద్యోగులా? ఇలా వీళ్లకు ఓ గుర్తింపంటూ లేదు. కంపెనీల దృష్టిలో కేవలం డెలివరీ పార్ట్‌నర్స్ మాత్రమే! ‘అత్యవసరాల’ పేరిట అంతా కలసి అద్భుతాలు చేస్తారు. కానీ, కష్టం వస్తే.. భాగస్వాములు కాదు కదా.. వాళ్లను ఎలా పిలవాలో తెలియని పరిస్థితి మన దేశంలో. జనాలకు బాగా దగ్గరైన వీళ్లకంటూ చట్టాల్లో ఒక నిర్వచనం, ఉద్యోగ భద్రత, హక్కులు లేకపోవడం.. నయా జమానా ఉపాధిగా గిగ్ ఎకానమీ మోసుకొచ్చిన కొత్త చిక్కు. క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారం కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు.
డెలవరీ సర్వీసుల్లో ఉద్యోగినులు!
టూమచ్ వర్క్.. జీతం?
ఈ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఒక షిఫ్ట్, ఒక టైమింగ్ అంటూ ఉండదు. జీతం బదులు తమ వాటా కట్ చేసుకుని కమిషన్లు ఇస్తుంటాయి కంపెనీలు. అంటే గిగ్ వర్కర్లకు.. అవసరం కొద్దీ పని.. అందుకు తగ్గట్లు డబ్బు సంపాదన ఉంటుందనుకోవడం భ్రమే. ఒక్కోసారి అది ఆశించినట్లు ఉండకపోవచ్చు కూడా. టైమ్‌కు పని జరగకపోతే.. కోతే. జీతం, కమిషన్ల సంగతి పక్కనపెడితే.. ఇతర సౌకర్యాల విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని స్టార్టప్ యాప్‌లు(కంపెనీలు). ఫెయిర్‌వర్క్ లిస్ట్‌లో ఆయా కంపెనీలకు ప్రతి ఏటా దక్కుతున్న మార్కులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
లైఫ్ ఒక రేస్
డెలివరీ బాయ్స్ కాలంతో పాటే పరిగెత్తాలి. కాస్త ఆలస్యమైనా కస్టమర్ల నుంచి తిట్లు, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లు తప్పవు. ఒక్కోసారి ఇది వాళ్లకు దక్కే ప్రతిఫలం(కమిషన్, జీతం..) మీద కూడా పడుతుంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్స్, సరైన రోడ్లు ఉండవు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. సిగ్నల్స్ జంప్ చేసినా.. వేగంగా వెళ్తే పడే ట్రాఫిక్ చలాన్లు.. అదనపు తలనొప్పులు. వీటికి తోడు వివక్షలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఫలానా కమ్యూనిటీ అనగానే ఫుడ్ క్యాన్సిల్ చేయడం, లిఫ్ట్ ఉపయోగించొద్దంటూ చిన్నచూపు చూడడం లాంటి ఘటనలు చూస్తున్నవే.
వీటికి అదనంగా ‘నిమిషాల్లోనే డెలివరీ..’ అంటూ తమ ప్రకటనలతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ స్టార్టప్‌లు. ఇలాంటివి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నాయి. మరి వాళ్ల భద్రతకు ఆయా కంపెనీలు గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాయా? అసలు ఇన్సూరెన్స్‌ల పరిధిలోకి వీళ్లను తీసుకొస్తున్నాయా? లేదు.. చట్టంలో అలాంటిదేం లేదు. కేవలం ఏదో ఒకటి, రెండు ఘటనల్లో మొక్కుబడి సాయం అందుతోంది అంతే. అందుకే పెరుగుతున్న రేట్లు, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు తమ బతుకులూ బాగుపడాలని, తమకేమైనా జరిగితే కుటుంబాలకు భద్రత అందాలని ఆశిస్తూ రోడ్డెక్కుతున్నారు.
ఎర్రటి ఎండలో సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసిన దుర్గా మీనాగా శర్మ అనే గ్రాడ్యుయేట్‌కు క్రౌడ్ ఫండిగ్ ద్వారా బైక్‌ను అందించాడు ఆదిత్య శర్మ అనే కుర్రాడు. రాజాస్థాన్‌లో ఇటీవల జరిగిన విషయం ఇది.
మార్గదర్శకాలు ఉండాల్సిందే!
ఆ మధ్య గురుగ్రామ్‌లో మానిక్యూర్ నుంచి కార్పెట్ క్లీనింగ్ దాకా సేవలు అందించే ఓ కంపెనీలో.. మహిళా ఉద్యోగులకు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. కంపెనీ తెచ్చిన కొత్త నిబంధనలు తమ ఆదాయానికి గణనీయంగా గండి కొడుతున్నాయని ఆఫీస్ ముందే టెంట్లు వేసుకుని నిరసనలకు దిగారు. ఆ సమయంలో సదరు కంపెనీ.. వాళ్లను ఉద్యోగులుగా కాకుండా భాగస్వాములుగా పేర్కొని(భాగస్వాములు కంపెనీకి వ్యతిరేకంగా పోరాడకూడదు కదా!) కోర్టు ఆదేశాలతో ఆ నిరసనలను నిర్వీర్యం చేయించింది. మరి భాగస్వాములుగా వాళ్లకు అందాల్సినవన్నీ అందించిందా? అంటే అదీ లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థలో, అంతెందుకు జీడీపీలోనూ ఉడతాసాయంగా వీళ్ల భాగం ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గిగ్ ఎకానమీతో ఆదుకుంటున్నారు కాబట్టే వీళ్ల రక్షణ కోసం మార్గదర్శకాలు కావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే క్రమక్రమంగా ఈ రంగానికి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డెలివరీ భాగస్వాముల ప్రమాదాలపై స్పందిస్తూ.. ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంట్‌లో స్వయంగా ఇదే గళం వినిపించారు కూడా. డెలివరీలు చేసేది కంపెనీలు కాదు.. అందులో పని చేసేవాళ్లు. వ్యక్తిగత వాహనాల మీద వెళ్తూ యాక్సిడెంట్‌లలో గాయపడినా.. చనిపోయినా.. అవి కమర్షియల్ వాహనాలు అనే వంక చూపిస్తూ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి బీమా కంపెనీలు. కాబట్టి, వాళ్ల రక్షణకు మార్గదర్శకాలు అవసరం ఉందని గుర్తు చేశారాయన.
తమ హక్కుల కోసం సమ్మెకు దిగిన డెలివరీ సర్వీస్ ఉద్యోగులు..
వానలు, వరదల్లోనూ తప్పని డెలివరీ సర్వీస్ తిప్పలు!
కరోనా టైమ్‌లో కుదేలు
కరోనా అనే వైరస్.. వందల కోట్ల మంది బతుకుల్ని మార్చి పడేసింది. చాలామందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఈ చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగులూ ఉన్నారు. లాక్‌డౌన్‌లతో ఎందరికో పని లేకుండా పోయింది. పూట గడవక వాళ్లు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో యాజమాన్య యాప్ కంపెనీలు.. మొండి చేయి చూపించాయి. కార్మిక చట్టంలో తమకంటూ ఓ పేజీ లేకుండా పోయేసరికి అభద్రతా భావంలోకి కూరుకుపోయారు వాళ్లు. అందుకే మేల్కొని తమ హక్కుల కోసం పోరాటానికి దిగారు.
ఎందుకు కష్టమవుతోంది?
ఎదుగూ బొదుగూలేని జీవితాలు ఎవరికైనా సహిస్తాయా? కనీసం కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని అనుకుంటారు. కానీ, లక్షల్లో ఉన్న గిగ్ వర్కర్లు తమ బతుకులకు ఓ భరోసా.. హక్కులకు కనీస రక్షణ ఉంటే చాలని కోరుతున్నారు.
మన దేశంలో ఒక నిర్దిష్టత అంటూ లేని ఉద్యోగుల కోసం అసంఘటిత కార్మికుల సామాజిక సంక్షేమ భద్రత చట్టంఒకటి ఉంది. కానీ, గిగ్ వర్కర్లను ఈ చట్టం కింద చేర్చలేదు. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వాళ్లు కావడంతో.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన, నిర్దిష్టమైన డేటా ఉండడం లేదనేది ప్రభుత్వాల వాదన. అయినప్పటికీ ప్రభుత్వం ఓ అడుగు వేసింది. నవంబర్ 2020లో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ కింద డ్రాఫ్ట్ నియమాలను నోటిఫై చేసింది. ఇలాంటి ఉద్యోగులను.. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్రతిపాదించింది. కానీ, అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.
సాధారణంగా యూరోపియన్ యూనియన్ సహా చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఇలాంటి గిగ్ వర్కర్లను నేరుగా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి ఆదుకుంటున్నాయి.మన దగ్గర మాత్రం ఇబ్బందులు తలెత్తున్నాయి. ఒకవేళ వర్తింపచేయాలనుకున్నా.. స్టార్టప్ యాప్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఖాయమని న్యాయ నిపుణలు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన నియంత్రణ వ్యవస్థ, లేదంటే కనీసం నిబంధనలతోనైనా గిగ్ ఉద్యోగుల భధ్రతకు ఒక ప్రత్యేక చట్టం తేవాల్సి ఉంది. లక్షల మంది శ్రమ జీవుల ఎదురు చూపులు ఎప్పటికీ ఫలిస్తాయో మరి!
-భాస్కర్ శ్రీపతి
Comments
Please login to add a commentAdd a comment