అవే కూరగాయాలు
దిగిరామంటున్న ధరలు
వరదలకు నీటమునిగిన కూరగాయల పంటలు
వేసవిలో మండడం మొదలైన కూరగాయల రేట్లు నేటికీ ఆదిశలోనే కొనసాగుతున్నాయి. కొన్నింటి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ మిగిలినవాటి రేట్లు పెరగడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరదలు మన ప్రాంతంలోని కూరగాయల పంటలను దెబ్బతీయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
అమలాపురం :
వేసవి ఆరంభంలో చుక్కలనంటిన కూరగాయల ధరలు ఇప్పటికీ దిగి రావడం లేదు. వేసవి ఎండలకు మన ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో టమాటా, బీన్స్ గింజలు, చిక్కుడు కాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల నుంచి ఇతర ప్రాంతాల్లో పంట కాలం పూర్తి కావస్తుండడంతో క్యాప్సికమ్, బంగాళాదుంప వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరల తగ్గుతాయనుకుంటున్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. క్యాప్సికమ్ ధర కేజీ రూ.80 వరకు ఉంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.90. బీట్‌రూట్, క్యారెట్ ధరలు రూ.40 ఉండగా, అల్లం ధర రూ.60 వరకు ఉంది. బీన్స్‌కాయల ధర రూ.60, బంగాళాదుంప రూ.24 నుంచి రూ.26 వరకు ఉంది. టమాటా ధర గత నెలకన్నా తక్కువ అనిపిస్తున్నా ఇప్పటికీ కేజీ రూ.32 వరకు ఉండడం విశేషం. ఇవన్నీ దిగుమతి చేసుకొనేవే. బంగాళాదుంప కోల్‌కతా నుంచి, మిగిలిన కాయగూరలు బెంగళూరు, చిత్తూరుల నుంచి దిగుమతి అవుతున్నాయి. అక్కడ పంట కాలం పూర్తి కావస్తుండడం, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొంత పంట దెబ్బతినడం, ఎగుమతులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే వీటి ధరలు స్వల్పంగా తగ్గినా సాధారణ స్థాయికి వీటి వచ్చే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
ముంచిన వరదలు
గోదావరికి వచ్చిన వరదలు కూరగాయ రైతులను ఎక్కువగా నష్టపరిచాయి. ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతుంటాయి. చిక్కుడు, గోరుచిక్కుడు, ఆనప, దొండ, బీర, పొట్ల, కాకరకాయ వంటి పందిరి కూరగాయలు, బెండ, టమాట, వంగ వంటి కాయగూరలతోపాటు తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు ఎక్కువ. ముఖ్యంగా ఆలమూరు, పి.గన్నవరం, అయినవిల్లిలో విస్తృతంగా వీటిని సాగు చేస్తుంటారు. గోదావరి వరదల ప్రభావం ఈ మండలాలపైనే ఎక్కువగా ఉంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 2,928 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ ప్రభావంతో స్థానికంగా పండే ఈ రకం కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది.