..ఇప్పటి ట్రెండ్!
నేడు‘అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం’ సందర్భంగా..
పట్టణాలు, నగరాల్లోనూ ఎవరికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలను వారే పండించుకోవడం తాజా ట్రెండ్‌గా మారింది. వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కంటెయినర్లలో కూరగాయల పెంపకం సంపన్న నగరం న్యూయార్క్ లేదా మనీలాలోని మురికి వాడల దగ్గరి నుంచి.. లండన్‌లోని సంపన్నులు నివసించే ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ల వరకు పట్టణ ప్రాంతాల్లో ఎవరి ఆహారాన్ని వాళ్లే ఉన్నంతలో పండించుకోవడం అలవాటుగా మారుతోంది...
పొలాల్లో భారీ స్థాయిలో జరిగే ఆహారోత్పత్తి పరిమాణంతో పోల్చితే వీళ్లు ఇంటిపంటలతో పండించేది కొంచెమే కావచ్చు. కానీ విషర సాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరల కోసం మధ్య/ఉన్నత వర్గాల ప్రజలతోపాటు.. కొనుగోలు శక్తిలేని పేదలు సైతం వీలైనంతలో ఇంటిపంటలు పండిస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టులో ఆఖరి ఆదివారాన్ని ప్రపంచ ఇంటిపంటల దినోత్సవంగా ఎక్కడి వాళ్లు అక్కడ జరుపుకుంటున్నారు. ఆరోగ్యపరిరక్షణ దృష్ట్యా సేంద్రియ ఇంటిపంటల మేలు గురించి ప్రచారం చేయడం.. స్థానికంగా పండే ఆహారాన్నే ఎక్కువగా తినడం ద్వారా సుదూర ప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించడానికయ్యే వ్యయాన్ని/కాలుష్యాన్ని తగ్గించడం.. ఇంటిపంటల పెంపకం, పోషకాలు నష్టపోని విధంగా వంట చేయడాన్ని ప్రపంపవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడం.. ఇవీ అంతర్జాతీయ ఇంటిపంటల దినోత్సవం లక్ష్యాలు.
మన దేశంలోనూ పట్టణాలు, నగరాల్లో నివసించే అన్ని వర్గాల ప్రజలకు ఇంటిపంటలు అనువైనవే. ఆర్థిక స్థోమతతో నిమిత్తం లేకుండా అన్నివర్గాల ప్రజలకూ ఇంటిపంటల అవసరముంది. పట్టణ నిరుపేదలకు ఇంటి వద్ద చోటుండదు కాబట్టి ప్రభుత్వం కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, అందులో ప్రతి పేద కుటుంబానికి కొద్దిపాటి స్థలాన్ని కేటాయించాలి. మేడల మీద, ఇళ్ల ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో ఇంటిపంటలు పండించుకునేందుకు మధ్యతరగతి ప్రజలను సబ్సిడీ కిట్ల ద్వారా ప్రోత్సహించాలి. అన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నమూనా కిచెన్ గార్డెన్లను ఉద్యాన శాఖలు నిర్వహిస్తూ.. ప్రజలకు కొత్త మెలకువలను నేర్పేందుకు శిక్షణనివ్వాలి. ఉపకరణాలను అందుబాటులోకి తేవాలి. పోషకాహార లోపాన్ని, తీవ్ర పేదరికాన్ని పారదోలడానికి ఇంటిపంటలు చక్కటి మార్గమని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకటించిన విషయాన్ని పాలకులు గుర్తించాలి.
‘ఇంటిపంట’లకు సబ్సిడీ.. అన్ని చోట్లా ఇవ్వొచ్చుగా!
‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి ‘సాక్షి’ స్వచ్ఛంద సంస్థల తోడ్పాడుతో ప్రారంభించిన కృషి ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. తత్ఫలితంగానే ఇంటిపంట కిట్లకు సబ్సిడీ ఇచ్చే పథకం ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన శాఖ సబ్సిడీపై ‘ఇంటిపంట’ ఉపకరణాల పంపిణీకి హైదరాబాద్‌లో గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టింది. ఆర్‌కేవీవై నిధులతో 50% సబ్సిడీపై సిల్పాలిన్ మడులు, వేపపిండి, వేపనూనె, స్ప్రేయర్, సూటిరకం విత్తనాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల నుంచి ఈ పథకం పునఃప్రారంభం కానుంది. పాలకులు ఇంటిపంటల ప్రాధాన్యాన్ని పెద్ద మనసుతో పట్టించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలకు ఇంటిపంట కిట్లు అందు బాటులోకి తేవాలని ‘సాక్షి’ కాంక్షిస్తోంది.