ఇది ‘ఇంటిపంట’ల కాలం! | Organic Kitchen Gardening creates more interest to telugu people on Intipanta Column | Sakshi
Sakshi News home page

ఇది ‘ఇంటిపంట’ల కాలం!

Published Sun, Aug 17 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

ఇది ‘ఇంటిపంట’ల కాలం!

ఇది ‘ఇంటిపంట’ల కాలం!

సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్‌పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు.  జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా..  
 
 తోటకూర, టమాటా..!
‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్  ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్‌బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను.  
 - కాసా హరినాథ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్,
 కేపీహెచ్‌బీ 7 ఫేజ్,  హైదరాబాద్

 
 ‘ఇంటిపంట’ శిక్షణ పొందా..

మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్‌లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’
 - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్
 
 ‘ఇంటిపంట’ల సేవలో..
వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా.  మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా.
 - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్
 
 జీవామృతం, అమృత్‌పానీ..
 మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో  పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం,  జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా..
 -ఎస్. సత్యనారాయణ మూర్తి
  విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి,
 రామనామక్షేత్రం, గుంటూరు

 
పూల మొక్కల నుంచి కూరగాయల వైపు..
పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్‌బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.
 - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి,
 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్


 ఫేస్‌బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’!
 ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్‌బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో INTIPANTA - Organic Kitchen/Terrace Gardening గ్రూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి.
 గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది:  https://groups.google.com/ forum/#!forum/intipanta
 intipanta@googlegroups.com
కు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement