Flower gardens
-
బంతి, కనకాంబరాల పూల తోటలు.. ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
పూల తోటల్ని గట్టెక్కించుకోండిలా!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పూల తోటలు దెబ్బతిన్నట్టు ఉద్యాన శాఖ గుర్తించింది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పూల తోటల్లో ఇప్పటికీ నీళ్లు నిలిచి ఉండటంతో మల్లె, బంతి, గులాబీ తోటలను చీడపీడలు ఆశిస్తున్నాయి. అధిక తేమ కారణంగా తెగుళ్లు ప్రబలుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పూల రైతులు చేపట్టాల్సిన సంరక్షణ చర్యలపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అనంతరాజు పేటలో గల రైతు సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.నాగరాజు ఈ దిగువ సూచనలు, సలహాలు ఇచ్చారు. నీటిని తొలగించండి.. తేమను తగ్గించండి పూల తోటల్లో ఎక్కువ నీరు నిలిచి ఉండటం వల్ల చీడపీడల ఉధృతి పెరుగుతుంది. వేర్లు కుళ్లి మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు తోటల్లోని నీరు బయటకు పోయేలా బోదెలు తవ్వాలి. చెట్ల మధ్య అంతర సేద్యం చేస్తూ తేమ శాతం తగ్గిపోయేలా చూడాలి. పాలీ హౌస్‌లో పూల సాగు చేస్తుంటే చుట్టుపక్కల తెరలను తొలగించాలి. గాలిలోని తేమ లోపలకు రాకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించవచ్చు. పాలీ హౌస్, షేడ్ నెట్ హౌస్‌ల దగ్గర గల పెద్ద చెట్ల కొమ్మలను కత్తిరించుకోవాలి. ఆరు బయట తోటల్లో అయితే గాలి బాగా ప్రసరించేందుకు అవసరమైతే కొన్ని మొక్కలను తీసివేయాలి. ఇంకా వర్షాలు పడుతుంటే.. ఇంకా వర్షాలు పడుతుంటే తోటల్లో పట్టాలు కప్పగలిగిన అవకాశాన్ని పరిశీలించాలి. లేదంటే మొక్కల మధ్య దిన పత్రికల కాగితాలు ఉంచినా వర్షం నీటిని ఆకుల మీద పడకుండా చేయవచ్చు. తద్వారా తెగుళ్లను నివారించుకోవచ్చు. మొదలు కుళ్లు సోకితే తగిన మందుల్ని పాదుల్లో పోసుకోవాలి. చామంతికి ఎక్కువగా వడలు తెగులు, తుప్పు తెగులు, ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఎక్కువ. వడలు తెగులు, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండిజమ్ ఏదా థైరం మందును, తుప్పు తెగులు ఆశిస్తే సల్ఫర్ 0.2 శాతం మందును, మొదలు కుళ్లు తెగులు నివారణకు బావిస్టిన్, బూడిద తెగులు నివారణకు సల్ఫర్‌ను తగిన మోతాదులో నీళ్లతో కలిపి పిచికారీ చేయాలి. బంతి.. మల్లె తోటల్లో ఇలా చేయండి బంతి తోటల్లో బూడిద తెగులు నివారణకు సల్ఫర్, పువ్వు, మొగ్గలు కుళ్లు తెగులు సోకితే డైథీనియం ఎం.45, ఆకుమచ్చ తెగులు కనిపిస్తే కార్బండజిమ్ మందుల్ని తగిన మోతాదులో వాడాలి. వేరుకుళ్లు తెగులు సోకితే కార్బండిజమ్ మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. మల్లె తోటల్లో ఆకుమచ్చ తెగులు కనిపించినా, గులాబీ తోటల్లో పూల రేకులు నల్లబడుతున్నా, బూడిద తెగులు కనిపించినా దాదాపు ఇవే మందుల్ని వాడవచ్చు. మరింత సమాచారం కోసం సమీపంలోని ఆర్బీకేలలో ఉద్యాన శాఖ సహాయకుడిని లేదంటే గన్నవరంలోని సమగ్ర కాల్ సెంటర్ నంబర్ 155251కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చు. వర్షాలు దెబ్బతీశాయి చామంతి తోటలో నాలుగు రోజులుగా నీళ్లు నిలిచిపోయాయి. తోట ఉరకెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే రూ.60 వేల వరకు ఖర్చు చేశాను. కార్తీక మాసంలో చామంతికి మంచి గిరాకీ ఉంటుందనుకుంటే వర్షాలొచ్చి దెబ్బతీశాయి. - తమ్మా చెన్నారెడ్డి, ఉండవల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా -
సోయగం.. వైభోగం
కొంగు బంగారమైన కోనేటి రాయుడి వైభోగం నభూతో నభవిష్యత్. బ్రహ్మాండనాయకుడికి పరబ్రహ్మ చేసిన ఉత్సవాలకు ఫలం, పుష్పం, పత్రం, దీపం, ధూపం, దేవగణం మేమూ మీ సేవలో ఉన్నామంటూ తమ సోయగాలను వెదజల్లుతున్నాయి. భక్తవత్సలుడితోపాటు భక్తులకు ఆహ్లాదం.. ఆనందం పంచుతూ కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పురాణ ఘట్టాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. సాక్షి, తిరుపతి తుడా: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులను ఫల, పుష్ప ప్రదర్శన శాల కనువిందు చేస్తోంది. శ్రీవారి దర్శనం, వాహన సేవల అనంతరం భక్తుల సందర్శనార్థం పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో టీటీడీ గార్డెన్ విభాగం ప్రతి ఏటా ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఫల పుష్పాలతో పాటు కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలకు చెందిన పురాణ ఇతిహాస ఘట్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు. ఈ ఘట్టాలకు సంబంధించిన విశేషాలను అక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులు ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పురాణ ఘట్టాలు ఆధ్యాత్మికతను పంచుతుంటే, వివిధ రకాల పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. వీటికి తోడు పుష్పాలతో తయారు చేసిన కళాఖండాలు, ఆకృతులు భక్తులను మైమరిపిస్తున్నాయి. ఎంత చూసిన తనివి తీరదు.. అన్నట్టుగా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు. ప్రదర్శనలో పుష్పాలతో ఆకృతులు ఫల, పుష్ప ప్రదర్శనశాలలో 50 వేల పూలమొక్కలతో వివిధ ఆకృతులను రూపొం దించారు. గడ్డి, రోజా పుష్పాలతో స్వామివారి రథం, డాల్ఫిన్, సీతాకోక చిలుక, గుర్రాల ఆకృతులను తీర్చిదిద్దారు. వివిధ రకాల రోజాలు, చామంతి, బంతి, సంప్రదాయ పుష్పాలను ఇక్కడ తిలకించవచ్చు. పురాణ ఘట్టాలు ఫల, పుష్పశాలలో పురాణ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపించేలా అద్భుత సెట్టింగులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. రామాయణ, మహాభారత, వేంకటేశ్వర మహత్యంలోని పలు కీలక ఘట్టాలను ప్రత్యేక లైటింగ్, ఘట్టాలకు సంబంధించి ఆడియో విజువల్స్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఏకశిలా నగరంలో భీముడు బకాసురునితో యుద్ధం చేసే సన్నివేశ భారీ సెట్టింగ్ అలరిస్తోంది. అలాగే బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నెను దొంగలించే సన్నివేశం, స్నానమాచరిస్తున్న గోపికల బట్టలను తీసుకెళ్లి చెట్టుపై దాచిపెట్టే చిలిపి కృష్ణుడు సన్నివేశం ఆకట్టుకుంటోంది. గయిడు అనే గంధర్వ రాజును సంరక్షించేందుకు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసే అర్జునుడు సన్నివేశం కనువిందు చేస్తోంది. రథాలపై నిల్చొని బాణాలను సందించేలా సహజ సిద్ధంగా ఏర్పాటుచేసిన సెట్టింగ్ ఆకట్టుకుంటోంది.వేంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బావాజీ సజీవంగా పరమాత్మునిలో ఐక్యమయ్యే సన్నివేశం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కంచిలోని అత్తి వరదరాజస్వామి భారీ సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్తి వరదరాజస్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఈ సెట్టింగ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్వామివారు పడుకుని, నిల్చొని దర్శన మిచ్చే ప్రతిమలతో పాటు కోనేటిలో స్వామివారిని తిరిగి భద్రపరచే సన్నివేశాలు భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ ఫల, పుష్ప ప్రదర్శనలో అత్తి వరదరాజస్వామిసెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్తి వరదరాజుని దర్శించినట్లే ఉంది కంచిలోని అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తారు. ఈ ఏడాది ఆ అరుదైన అవకాశం వచ్చినా నేను వెళ్లలేకపోయాను. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన అత్తి వరదరాజస్వామి సెట్టింగులు సహజ సిద్ధంగా ఉంది. అత్తి వరదరాజస్వామిని దర్శించుకోలేనన్న లోటు తీరింది. –సెంథిల్‌వేల్, భక్తుడు, తిరుప్పతూర్, తమిళనాడు సెట్టింగులు బాగున్నాయి ఫల, పుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ ఘట్టాలు, పూల తోట, శ్రీవారి వైభవాన్ని చాటే వివిధ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. – రామదాస్, భక్తుడు, తిరువణ్ణామలై -
ఆ ఊరే ఓ పూల తోట
ఆ ఊరి పొలిమేరలో అడుగుపెడుతూనే పూల సువాసనలు గుప్పుమంటాయి. చుట్టుపక్కల పూల తోటలు సాగుచేస్తున్నారనుకుంటే పొరపాటే. ఆ గ్రామంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఊరే ఓ పూల వనం అని.కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల ప్రాంతమైన వంద్రికల్ గ్రామం అది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు, వెనుక భాగాల్లోని ఖాళీ ప్రదేశాలు, పెరడులలో అందరూ పూలను సాగు చేస్తారు. ప్రతి ఇంటా పరిమళాలొచ్చే పూలతోబాటు కనకాంబరాలను కూడా సాగు చేస్తారు. కనకాంబర పూల సాగు తమకు ఆనందంతో పాటు జీవనోపాధిని కల్పిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. కనకాంబరాల సాగుతో వంద్రికల్ గ్రామం జిల్లాలోనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రతి ఇంటా కనకాంబరాలు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో వంద్రికల్ గ్రామం ఉంది. నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ప్రాజెక్టుల ముంపు గ్రామాల నుంచి 1963 లో 133 కుటుంబాల వారు ఇక్కడకు వచ్చి గ్రామంగా ఏర్పడ్డారు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వ్యవసాయం, తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2000 సంవత్సరం నుంచి కనకాంబరాల సాగు వైపు దృష్టి సారించారు. మొదట్లో కొంత మంది తమ ఇండ్ల వద్ద కనకాంబరాలను పెంచి ఆదాయం పొందడం మిగతా వారిని ఆలోచింపజేసింది. అప్పటినుంచి ప్రతి ఇంటి పెరడు, ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మొత్తం కనకాంబరాల మొక్కలను పెంచడం, పూలను సేకరించి నిజామాబాద్, కామారెడ్డి మార్కెట్లలో విక్రయించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలసాగు కొనసాగిస్తు ఉపాధి పొందుతున్నారు. పూల సాగుతో జీవనాధారం వంద్రికల్ గ్రామంలో గతంలో కంటే పరిస్థితులు ఇటీవల మెరుగుపడ్డాయి. గ్రామం నుంచి ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో ఉండేవారు మాత్రం వారికి ఇష్టమైన కనకాంబరాల సాగుతో ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు కన కాంబరాల సాగునే జీవనాధారంగా చేసుకున్నాయి. వారంలో రెండుసార్లు పూలను సేకరిస్తారు. కనకాంబరాలను కొనుగోలు చేసే బేరగాళ్లు గ్రామానికే వస్తారు. కొందరు నేరుగా, మరికొందరు దండలు అల్లి విక్రయిస్తారు. గ్రామంలో విక్రయిస్తే మూర దండ రూ.12. నేరుగా కామారెడ్డి మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తే మూర రూ.20 వస్తాయని గ్రామస్తులు తెలిపారు. పూలసాగును జీవనాధారంగా చేసుకున్న కుటుంబాలు నేరుగా కామారెడ్డి, నిజామాబాద్ మార్కెట్లకు వెళ్లి కనకాంబరాలను అమ్ముతారు. వారానికి వంద మూరలు వారానికి రెండుసార్లు పూలను సేకరిస్తాం. వారానికి వంద మూరల పూల దండలను అమ్ముతాను. దగ్గర్లోని కామారెడ్డి మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్ముతాము. మా జీవనాధారం ఇదే. ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పదేళ్ళుగాపెంచుతున్నా మా ఇంటి ఆవరణలో కనకాంబరాలను పది ఏళ్ళుగా పెంచుతున్నాను. ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం లభిస్తుంది. కనకాంబరాలను పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఆనందంతో పాటు ఆదాయమూ దొరుకుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మొక్కల పెంపకం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చీడ పీడలు లేకుండా చూసుకుంటాం. వారానికి రెండుసార్లు పూలను సేకరించి కొంతమంది గ్రామంలోనే అమ్ముతారు. మరికొందరు బేరగాళ్లకు ఇస్తారు. కనకాంబరాలకు మా గ్రామం ప్రత్యేకం. ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేదు మా ఇంటి చుట్టూరా కనకాంబరాల చెట్లు పెంచుతున్నాం. ఈ పూలను అమ్మడం వల్ల ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా ఊళ్లో చాలా కుటుంబాలు పూర్తిగా కనకాంబరాల సాగుమీదనే ఆధారపడుతున్నాయి. -
పూల రైతు ఆశలపై నీళ్లు
చేవెళ్ల: రానున్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా పూల విక్రయాలతో మంచి లాభాలను గడించవచ్చని భావించిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన తోటలు కళ్లముందే పాడవడంతో రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితి దాపురించింది. చేవెళ్ల వ్యవసాయ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాల్లో బంతి, చేమంతి, గులాబీ, హాస్టర్ పూల తోటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దసరా, దీపావళి పండగలు మరో 25 రోజు వ్యవధిలో రానున్నాయి. ఈ దశలో వర్షాలు పూల తోటలపై విరుచుకుపడ్డాయి. ఎకరం చేమంతి పూల తోటలో ఒక కోతకు సాధారణంగా 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. అతివృష్టి కారణంగా పంటలు బాగా దెబ్బ తిన్నాయని, దిగుబడి గణనీయంగా తగ్గి సగానికి పడిపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పూల రవాణా, మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉండడంతో పూల సాగును అధిక విస్తీర్ణంలో చేపట్టామని, ఇటీవల కురిసిన వర్షాలు తమ ఆశలపై నీళ్లు చల్లాయని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పత్తి, మొక్కజొన్న పంటలు వర్షాభావ పరిస్థితులతో ఎండుముఖం పట్టాయని, ప్రస్తుత వర్షాలతో ఉన్న కాస్త పూలతోటలు పాడవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈసీ వాగు సమీప తోటలకు అపార నష్టం వారం రోజుల క్రితం కురిసిన వర్షాలు.. ముఖ్యంగా ఈసీ వాగు సమీపంలోని పూల తోటలకు అపార నష్టం కలిగించింది. వాగు ప్రవహించి పొలాల్లోంచి రావడంతో బంతి, చామంతి, గులాబీ, హాస్టర్, జర్మనీ పూలు తదితర పూల తోటల్లోకి నీరు భారీగా చేరింది. ఈసీవాగు పొలాల నుంచి ప్రవహించడంతో అమ్డాపూర్, కాశింబౌళి, ముర్తుజగూడ, కనకమామిడి, తదితర గ్రామాలలోని పూల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి: రమణ గౌడ్, రైతు, అమ్డాపూర్ వర్షాలు పూల తోటలను పాడుచేశాయి. పదిహేను రోజుల క్రితం వరకు పూలతోటలు అధికంగా దిగుబడి వచ్చే సూచనలు కనిపించాయి. కానీ క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని చెట్లు పూలతో సహా కింద పడిపోయాయి. పూల కూడా రంగు మారింది. దసరా, దీపావళికి డబ్బులు వస్తాయనుకున్న దశలో వర్షాలు నట్టేటా ముంచాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. -
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - Organic Kitchen/Terrace Gardening గ్రూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.com కు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు.