కొంగు బంగారమైన కోనేటి రాయుడి వైభోగం నభూతో నభవిష్యత్. బ్రహ్మాండనాయకుడికి పరబ్రహ్మ చేసిన ఉత్సవాలకు ఫలం, పుష్పం, పత్రం, దీపం, ధూపం, దేవగణం మేమూ మీ సేవలో ఉన్నామంటూ తమ సోయగాలను వెదజల్లుతున్నాయి. భక్తవత్సలుడితోపాటు భక్తులకు ఆహ్లాదం.. ఆనందం పంచుతూ కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పురాణ ఘట్టాలు సైతం ఆకట్టుకుంటున్నాయి.
సాక్షి, తిరుపతి తుడా: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తులను ఫల, పుష్ప ప్రదర్శన శాల కనువిందు చేస్తోంది. శ్రీవారి దర్శనం, వాహన సేవల అనంతరం భక్తుల సందర్శనార్థం పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో టీటీడీ గార్డెన్ విభాగం ప్రతి ఏటా ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఫల పుష్పాలతో పాటు కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలకు చెందిన పురాణ ఇతిహాస ఘట్టాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించారు. ఈ ఘట్టాలకు సంబంధించిన విశేషాలను అక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులు ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పురాణ ఘట్టాలు ఆధ్యాత్మికతను పంచుతుంటే, వివిధ రకాల పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. వీటికి తోడు పుష్పాలతో తయారు చేసిన కళాఖండాలు, ఆకృతులు భక్తులను మైమరిపిస్తున్నాయి. ఎంత చూసిన తనివి తీరదు.. అన్నట్టుగా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు.
ప్రదర్శనలో పుష్పాలతో ఆకృతులు
ఫల, పుష్ప ప్రదర్శనశాలలో 50 వేల పూలమొక్కలతో వివిధ ఆకృతులను రూపొం దించారు. గడ్డి, రోజా పుష్పాలతో స్వామివారి రథం, డాల్ఫిన్, సీతాకోక చిలుక, గుర్రాల ఆకృతులను తీర్చిదిద్దారు. వివిధ రకాల రోజాలు, చామంతి, బంతి, సంప్రదాయ పుష్పాలను ఇక్కడ తిలకించవచ్చు.
పురాణ ఘట్టాలు
ఫల, పుష్పశాలలో పురాణ ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపించేలా అద్భుత సెట్టింగులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. రామాయణ, మహాభారత, వేంకటేశ్వర మహత్యంలోని పలు కీలక ఘట్టాలను ప్రత్యేక లైటింగ్, ఘట్టాలకు సంబంధించి ఆడియో విజువల్స్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఏకశిలా నగరంలో భీముడు బకాసురునితో యుద్ధం చేసే సన్నివేశ భారీ సెట్టింగ్ అలరిస్తోంది. అలాగే బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నెను దొంగలించే సన్నివేశం, స్నానమాచరిస్తున్న గోపికల బట్టలను తీసుకెళ్లి చెట్టుపై దాచిపెట్టే చిలిపి కృష్ణుడు సన్నివేశం ఆకట్టుకుంటోంది. గయిడు అనే గంధర్వ రాజును సంరక్షించేందుకు శ్రీకృష్ణుడితో యుద్ధం చేసే అర్జునుడు సన్నివేశం కనువిందు చేస్తోంది. రథాలపై నిల్చొని బాణాలను సందించేలా సహజ సిద్ధంగా ఏర్పాటుచేసిన సెట్టింగ్ ఆకట్టుకుంటోంది.వేంకటేశ్వరుని పరమ భక్తుడైన హథీరాం బావాజీ సజీవంగా పరమాత్మునిలో ఐక్యమయ్యే సన్నివేశం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిచ్చే కంచిలోని అత్తి వరదరాజస్వామి భారీ సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అత్తి వరదరాజస్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఈ సెట్టింగ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. స్వామివారు పడుకుని, నిల్చొని దర్శన మిచ్చే ప్రతిమలతో పాటు కోనేటిలో స్వామివారిని తిరిగి భద్రపరచే సన్నివేశాలు భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ ఫల, పుష్ప ప్రదర్శనలో అత్తి వరదరాజస్వామిసెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అత్తి వరదరాజుని దర్శించినట్లే ఉంది
కంచిలోని అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తారు. ఈ ఏడాది ఆ అరుదైన అవకాశం వచ్చినా నేను వెళ్లలేకపోయాను. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన అత్తి వరదరాజస్వామి సెట్టింగులు సహజ సిద్ధంగా ఉంది. అత్తి వరదరాజస్వామిని దర్శించుకోలేనన్న లోటు తీరింది.
–సెంథిల్‌వేల్, భక్తుడు, తిరుప్పతూర్, తమిళనాడు
సెట్టింగులు బాగున్నాయి
ఫల, పుష్ప ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన వివిధ ఘట్టాలు, పూల తోట, శ్రీవారి వైభవాన్ని చాటే వివిధ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
– రామదాస్, భక్తుడు, తిరువణ్ణామలై
Comments
Please login to add a commentAdd a comment