ఆ ఊరే ఓ పూల తోట | That is the town A flower garden | Sakshi
Sakshi News home page

ఆ ఊరే ఓ పూల తోట

Published Fri, Feb 1 2019 12:07 AM | Last Updated on Fri, Feb 1 2019 12:07 AM

That is the town A flower garden - Sakshi

ఆ ఊరి పొలిమేరలో అడుగుపెడుతూనే పూల సువాసనలు గుప్పుమంటాయి. చుట్టుపక్కల పూల తోటలు సాగుచేస్తున్నారనుకుంటే పొరపాటే. ఆ గ్రామంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ ఊరే ఓ పూల వనం అని.కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల ప్రాంతమైన వంద్రికల్‌ గ్రామం అది. ఇక్కడ ప్రతి ఇంటి ముందు, వెనుక భాగాల్లోని ఖాళీ ప్రదేశాలు, పెరడులలో అందరూ పూలను సాగు చేస్తారు. ప్రతి ఇంటా పరిమళాలొచ్చే పూలతోబాటు కనకాంబరాలను కూడా సాగు చేస్తారు. కనకాంబర పూల సాగు తమకు ఆనందంతో పాటు జీవనోపాధిని కల్పిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. కనకాంబరాల సాగుతో వంద్రికల్‌ గ్రామం జిల్లాలోనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 

ప్రతి ఇంటా కనకాంబరాలు
మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో వంద్రికల్‌ గ్రామం ఉంది. నల్గొండ, మెదక్‌ జిల్లాలకు చెందిన ప్రాజెక్టుల ముంపు గ్రామాల నుంచి 1963 లో 133 కుటుంబాల వారు ఇక్కడకు వచ్చి గ్రామంగా ఏర్పడ్డారు. మొదట్లో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వ్యవసాయం, తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. 2000 సంవత్సరం నుంచి కనకాంబరాల సాగు వైపు దృష్టి సారించారు. మొదట్లో కొంత మంది తమ ఇండ్ల వద్ద కనకాంబరాలను పెంచి ఆదాయం పొందడం మిగతా వారిని ఆలోచింపజేసింది. అప్పటినుంచి ప్రతి ఇంటి పెరడు, ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మొత్తం కనకాంబరాల మొక్కలను పెంచడం, పూలను సేకరించి నిజామాబాద్, కామారెడ్డి మార్కెట్లలో విక్రయించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూలసాగు కొనసాగిస్తు ఉపాధి పొందుతున్నారు. 

పూల సాగుతో జీవనాధారం
వంద్రికల్‌ గ్రామంలో గతంలో కంటే పరిస్థితులు ఇటీవల మెరుగుపడ్డాయి. గ్రామం నుంచి ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో ఉండేవారు మాత్రం వారికి ఇష్టమైన కనకాంబరాల సాగుతో ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు కన కాంబరాల సాగునే జీవనాధారంగా చేసుకున్నాయి. వారంలో రెండుసార్లు పూలను సేకరిస్తారు. కనకాంబరాలను కొనుగోలు చేసే బేరగాళ్లు గ్రామానికే వస్తారు. కొందరు నేరుగా, మరికొందరు దండలు అల్లి విక్రయిస్తారు. గ్రామంలో విక్రయిస్తే మూర దండ రూ.12. నేరుగా కామారెడ్డి మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తే మూర రూ.20 వస్తాయని గ్రామస్తులు తెలిపారు. పూలసాగును జీవనాధారంగా చేసుకున్న కుటుంబాలు నేరుగా కామారెడ్డి, నిజామాబాద్‌ మార్కెట్లకు వెళ్లి కనకాంబరాలను అమ్ముతారు. 


వారానికి వంద మూరలు
వారానికి రెండుసార్లు పూలను సేకరిస్తాం. వారానికి వంద మూరల పూల దండలను అమ్ముతాను. దగ్గర్లోని కామారెడ్డి మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్ముతాము. మా జీవనాధారం ఇదే. ఇంటి ఖర్చులకు సరిపోతుంది. 

పదేళ్ళుగాపెంచుతున్నా
మా ఇంటి ఆవరణలో కనకాంబరాలను పది ఏళ్ళుగా పెంచుతున్నాను. ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం లభిస్తుంది. కనకాంబరాలను పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఆనందంతో పాటు ఆదాయమూ దొరుకుతోంది.    
  
అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం
మొక్కల పెంపకం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చీడ పీడలు లేకుండా చూసుకుంటాం. వారానికి రెండుసార్లు పూలను సేకరించి కొంతమంది గ్రామంలోనే అమ్ముతారు. మరికొందరు బేరగాళ్లకు ఇస్తారు. కనకాంబరాలకు మా గ్రామం ప్రత్యేకం.  
    
ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేదు
మా ఇంటి చుట్టూరా కనకాంబరాల చెట్లు పెంచుతున్నాం. ఈ పూలను అమ్మడం వల్ల ఇంటి ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా ఊళ్లో చాలా  కుటుంబాలు పూర్తిగా కనకాంబరాల సాగుమీదనే ఆధారపడుతున్నాయి. 


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement