చేవెళ్ల: రానున్న దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా పూల విక్రయాలతో మంచి లాభాలను గడించవచ్చని భావించిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన తోటలు కళ్లముందే పాడవడంతో రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితి దాపురించింది. చేవెళ్ల వ్యవసాయ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో బంతి, చేమంతి, గులాబీ, హాస్టర్ పూల తోటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
దసరా, దీపావళి పండగలు మరో 25 రోజు వ్యవధిలో రానున్నాయి. ఈ దశలో వర్షాలు పూల తోటలపై విరుచుకుపడ్డాయి. ఎకరం చేమంతి పూల తోటలో ఒక కోతకు సాధారణంగా 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. అతివృష్టి కారణంగా పంటలు బాగా దెబ్బ తిన్నాయని, దిగుబడి గణనీయంగా తగ్గి సగానికి పడిపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పూల రవాణా, మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులో ఉండడంతో పూల సాగును అధిక విస్తీర్ణంలో చేపట్టామని, ఇటీవల కురిసిన వర్షాలు తమ ఆశలపై నీళ్లు చల్లాయని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న పంటలు వర్షాభావ పరిస్థితులతో ఎండుముఖం పట్టాయని, ప్రస్తుత వర్షాలతో ఉన్న కాస్త పూలతోటలు పాడవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఈసీ వాగు సమీప తోటలకు అపార నష్టం
వారం రోజుల క్రితం కురిసిన వర్షాలు.. ముఖ్యంగా ఈసీ వాగు సమీపంలోని పూల తోటలకు అపార నష్టం కలిగించింది. వాగు ప్రవహించి పొలాల్లోంచి రావడంతో బంతి, చామంతి, గులాబీ, హాస్టర్, జర్మనీ పూలు తదితర పూల తోటల్లోకి నీరు భారీగా చేరింది. ఈసీవాగు పొలాల నుంచి ప్రవహించడంతో అమ్డాపూర్, కాశింబౌళి, ముర్తుజగూడ, కనకమామిడి, తదితర గ్రామాలలోని పూల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది.
ప్రభుత్వమే ఆదుకోవాలి: రమణ గౌడ్, రైతు, అమ్డాపూర్
వర్షాలు పూల తోటలను పాడుచేశాయి. పదిహేను రోజుల క్రితం వరకు పూలతోటలు అధికంగా దిగుబడి వచ్చే సూచనలు కనిపించాయి. కానీ క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో పంట బాగా దెబ్బతిన్నది. కొన్ని చెట్లు పూలతో సహా కింద పడిపోయాయి. పూల కూడా రంగు మారింది. దసరా, దీపావళికి డబ్బులు వస్తాయనుకున్న దశలో వర్షాలు నట్టేటా ముంచాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
పూల రైతు ఆశలపై నీళ్లు
Published Sun, Sep 7 2014 11:56 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement